
హైదరాబాద్: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అహంకారంతో మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుపై గత ఏడాది పీయూష్ గోయల్‌ను చాలా సార్లు కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. కేంద్రంలో తలాతోక లేని ప్రభుత్వం ఉందని కేటీఆర్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆహారభద్రత చట్టం ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. లక్షలాది మంది రైతుల జీవితాలతో ముడిపడిన అంశమని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడంలేదని, రైతుల్ని ప్రత్యామ్నాయ పంటలు వేయమని చెప్పామని తెలిపారు. ప్రతిగింజ కొంటామని బీజేపీ నేతలు చెప్పారని, కేంద్రాన్ని ఒప్పిస్తానన్న బీజేపీ నేత బండి సంజయ్ మాటలు ఏమయ్యాయి? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం ఓ మాట.. రాష్ట్ర బీజేపీ నేతలు మరో మాట చెబుతున్నారని మండిపడ్డారు. పంజాబ్‌లో ఎందుకు కొంటున్నారు?.. తెలంగాణలో ఎందుకు కొనడంలేదని నిలదీశారు. ఢిల్లీ బీజేపీది ఒకమాట.. గల్లీలోని సిల్లీ బీజేపీది మరోమాట అని దుయ్యబట్టారు. చిల్లరమాటలు మాట్లాడి రైతుల్ని అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పౌరుల్ని అవమానించిన వాళ్లను వదిలిపెట్టమని కేటీఆర్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి