కాంగ్రెస్‌లోకి పీకే?

ABN , First Publish Date - 2022-04-17T08:26:19+05:30 IST

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారా? రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ కోసం పీకే బృందం పనిచేయనుందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణా మాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.

కాంగ్రెస్‌లోకి పీకే?

చేరేందుకు వ్యూహకర్త సన్నద్ధత!.. సోనియా, రాహుల్‌తో సుదీర్ఘ భేటీ

2024 రోడ్‌మ్యా్‌పపై ప్రజెంటేషన్‌.. 370సీట్లపై దృష్టిపెట్టాలని సూచన

పీకే చేరిక వారంలో తేలుతుందని సీనియర్‌ నేత వేణుగోపాల్‌ వెల్లడి

సోనియా, రాహుల్‌తో సుదీర్ఘ భేటీ.. సీనియర్‌ నేతలూ హాజరు


2024 రోడ్‌మ్యా్‌పపై ప్రజెంటేషన్‌

370 సీట్ల టార్గెట్‌కు సూచనలు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారా? రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ కోసం పీకే బృందం పనిచేయనుందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణా మాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. శనివారం కాంగ్రెస్‌ అఽధ్యక్షురాలు సోనియా, రాహుల్‌తో పాటు పార్టీ సీనియర్‌ నేతలతో పీకే సమావేశమయ్యారు. 2024 ఎన్నికల వ్యూహంపై ప్రజెంటేషన్‌ ఇచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీలో చేరేందుకు పీకే అంగీక రించారు. పార్టీ సీనియర్‌ నేతలు సైతం ఆహ్వానించా రు. వ్యూహకర్తగా కన్నా.. పార్టీ నేతగానే పనిచేయాలని కోరారు. పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలపై మరింతగా దృష్టి పెట్టాలని కాంగ్రెస్‌ నాయకత్వానికి పీకే సూచించారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 370 లోక్‌సభ సీట్లపై దృష్టి సారించాలని, మిగతా స్థానాలను మిత్రపక్షాలకు అప్పగించాలని సలహా ఇచ్చారు. పార్టీ సమాచార విభాగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడంతో పాటు మీడియా వ్యూహాన్ని మార్చాల్సిన అవసరముందని చెప్పినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా కాంగ్రెస్‌ నేతలతో పీకే చర్చించారు. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, మల్లికార్జున్‌ ఖర్గే, అంబికా సోనీ, దిగ్విజయ్‌సింగ్‌, అజయ్‌ మాకెన్‌, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. పి.చిదంబరం, రణ్‌దీప్‌ సుర్జేవాలా సకాలంలో ఢిల్లీ రానందున సమావేశంలో పాల్గొనలేదని కాంగ్రెస్‌ వర్గాలు చెప్పాయి. కాగా.. పీకే తమ పార్టీలో చేరే అవకాశం ఉందని, కన్సల్టెంటుగా గాక.. పార్టీలో చేరి పనిచేయాలని కోరినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్‌ నేత వెల్లడించారు. కాగా, పీకే ఇచ్చిన ప్రజెంటేషన్‌పై చర్చించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తామని వేణుగోపాల్‌ విలేకరులకు వెల్లడించారు. 


రాహుల్‌, ప్రియాంకపై గతంలో విసుర్లు

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ప్రశాంత్‌ కిశోర్‌ తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. లఖీంపూర్‌ ఖీరీలో రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడు కారెక్కించిన ఘటన జరిగినప్పుడు ప్రియాంకా వాద్రా అక్కడకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. లోతుగా వేళ్లూనుకున్న సమస్యలకు, సంస్థాగత బలహీనతకు సత్వర పరిష్కారం ఉండదని పీకే ట్వీట్‌ చేశారు. నాయకత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయించాలన్నారు. యూపీ ఎన్నికల ఫలితా లు 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు  సూచిక అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల నూ ఆయన ఖండించారు. ప్రతిపక్షంపై మానసికంగా పైచేయి సాధించేందుకు మోదీ తెలివిగా ప్రయత్నించారని.. ఆయన ఇలాంటి భ్రమల్లో పడొద్దని.. 2024లోనే నిర్ణయాత్మక పోరు జరుగుతుందని, ఈ విషయం ప్రధానికీ తెలుసని పీకే వ్యాఖ్యానించారు.

దేశంలో విద్వేష వైరస్‌: సోనియా గాంధీ

భారత సమాజం శాశ్వతంగా చీలిపోయి ఉండాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు. దేశంలో విద్వేష వైర్‌సను వ్యాపింపజేస్తోందన్నారు. విభజన, పరస్పర అవిశ్వాసం, చర్చలు జరగకుండా గొంతు నొక్కేయడం వంటివి ఒక జాతిగా మనకు తీవ్ర నష్టం కలిగిస్తాయంటూ ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘విద్వేషం, మతోన్మాదం, అసహనం, అసత్యం ఇవాళ దేశాన్ని కమ్ముకుంటున్నాయి. అడ్డుకోకపోతే బాగుచేయలేనంతగా ఇవి సమాజాన్ని నష్టపరుస్తాయి. ప్రజలు వీటిని సహించకూడదు.  నకిలీ జాతీయవాదమనే బలిపీఠంపై శాంతిని, భిన్నత్వాన్ని బలి చేస్తుంటే చూస్తూ కూర్చోరాదు. విద్వేష జ్వాలలను, సునామీని అడ్డుకోవాలి. లేదంటే గత తరాలు నిర్మించినదంతా కుప్పకూలిపోతుంది’ అని ఆమె హెచ్చరించారు.


గుజరాత్‌ సీఎం అభ్యర్థిగా నరేశ్‌ పటేల్‌?


కాంగ్రె్‌సలో పీకే 2020లోనే చేరాల్సి ఉం ది. నాయకత్వ అంశాలకు సంబంధించిన విభేదాల వల్ల ఇది సాధ్యపడలేదు. గత నెలలో రాహుల్‌, ప్రియాంకలతో పీకే ఢిల్లీ లో సమావేశమయ్యారు. కాంగ్రె్‌సలో ఆయన చేరికపై అప్పుడే లోతుగా చర్చ జరిగినట్లు ప్రచారం జరిగింది. శనివారం నాటి భేటీతో ఇది రూఢి అయింది. గుజరాత్‌ అసెం బ్లీ ఎన్నికల్లో విజయం కోసం పీకేను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే పార్టీ సీఎం అభ్యర్థిగా పారిశ్రామికవేత్త, పాటీదార్‌ నేత నరేశ్‌ పటేల్‌ను ఎంపిక చేయాలని పీకే సూచించినట్లు సమాచారం. ఇంకోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పీకే సేవలను ఉపయోగించుకోనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన కాంగ్రె్‌సలో చేరితే పరిస్థితి ఏమిటన్న దానిపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.

Updated Date - 2022-04-17T08:26:19+05:30 IST