పీకే నో ఎంట్రీ

ABN , First Publish Date - 2022-04-27T08:05:13+05:30 IST

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌.. కాంగ్రె్‌సలో చేరే అంశంపై జరుగుతున్న ప్రచారానికి తెర పడింది.

పీకే నో ఎంట్రీ

కాంగ్రెస్‌లో చేరడంలేదని ప్రశాంత్‌ కిశోర్‌ ట్వీట్‌


సాధికారిక బృందంలో సభ్యుడిగా ఉండాలన్న అధిష్ఠానం ప్రతిపాదనకు తిరస్కరణ

పార్టీని పునరుద్ధరించేందుకు స్వేచ్ఛను, ‘సీనియర్‌ హోదా’ను ఆశించిన పీకే!

ముందునుంచే వ్యతిరేకిస్తున్న సీనియర్లు

సైద్ధాంతిక నిబద్ధత ఉండదని వాదన


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌.. కాంగ్రె్‌సలో చేరే అంశంపై జరుగుతున్న ప్రచారానికి తెర పడింది. తాను కాంగ్రె్‌సలో చేరబోవడం లేదని మంగళవారం ఆయన స్వయంగా ప్రకటించారు. కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదనను తాను వినయంగా తిరస్కరిస్తున్నానని ప్రశాంత్‌ కిశోర్‌ ట్విటర్‌లో తెలిపారు. తన కంటే ఎక్కువగా.. కాంగ్రె్‌సలో నిర్మాణాత్మకమైన సమస్యలను పరివర్తనాత్మకమైన సంస్కరణల ద్వారా మార్చే నాయకత్వం, సమిష్టి పట్టుదల అవసరమని పేర్కొన్నారు. పీకే నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ కూడా ధ్రువీకరించింది. ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన సాధికారిక బృందంలో సభ్యుడిగా ఉండాలంటూ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన ప్రతిపాదనను ప్రశాంత్‌ కిశోర్‌ తిరస్కరించారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా తెలిపారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు తాను కాంగ్రె్‌సలో చేరి పార్టీని బలోపేతం చేస్తానంటూ అధిష్ఠానాన్ని పీకే కలవడం, అందుకు తన వద్దనున్న వ్యూహాలతో వారితో చర్చలు జరపడం తెలిసిందే. అయితే పార్టీలో తనకు సీనియర్‌ హోదా ఇచ్చి పార్టీని పునరుద్ధరించేందుకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని ప్రశాంత్‌ కిషోర్‌ ఆశించారు. కానీ, తన ప్రతిపాదనను పట్టించుకోకుండా, కేవలం ఒక కమిటీలో సభ్యుడుగా చేర్చాలని అధిష్ఠానం నిర్ణయించినందువల్లే కాంగ్రె్‌సలో చేరాలన్న ఆలోచనను ఆయన మానుకున్నట్లు స్పష్టమవుతోంది. 


పీకేపై నేతల్లో అపనమ్మకం!

ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రె్‌సలో కీలక పదవి పొంది పార్టీలోని నేతలందరినీ తన నియంత్రణలో ఉంచుకుంటారన్న ప్రచారం జరగడంతో గత రెండు రోజులుగా పార్టీలో వివిధ దశల్లో కలకలం రేగింది. అదే సమయంలో ఆయన హైదరాబాద్‌కు వెళ్లి టీఆర్‌ఎస్‌ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కావడంతో కాంగ్రె్‌సలో పీకే వ్యతిరేక ప్రచారానికి మరింత బలం చేకూరింది. తమతో ప్రశాంత్‌ కిశోర్‌ జరిపిన సమావేశాల్లోనే దిగ్విజయ్‌సింగ్‌, జైరాం రమేశ్‌, ముకుల్‌ వాస్నిక్‌ లాంటి నేతలు పీకేకు కళ్లెం వేసే ప్రయత్నం చేశారు. తాను చెప్పినట్లు నడుచుకుంటే పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని, రాజస్థాన్‌లో ముఖ్యమంత్రిని మార్చాలని, రాహుల్‌ గాంధీని పార్టీ అధ్యక్షుడిని చేయవద్దని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పడం కాంగ్రెస్‌ నేతలకు ఎంతమాత్రం రుచించలేదు. ఆయన ఒక్కోసారి ఒక్కో పార్టీకి పనిచేసిన వ్యక్తి అని, ఆయనను విశ్వసించలేమనే అభిప్రాయంతో వారు ఉన్నారు. పైగా ప్రశాంత్‌ కిశోర్‌కు సైద్ధాంతిక నిబద్ధత ఉండదన్న అభిప్రాయాన్ని ఓ వర్గం నేతలు వ్యక్తం చేశారు. కాంగ్రె్‌సలో చేరాక కూడా తెలంగాణలో అధికార టీఆర్‌ఎ్‌సకు తన సంస్థ ఐప్యాక్‌ పని చేస్తుందని పీకే చెప్పడమే ఇందుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు.  ఆ సంస్థను మూసివేసేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ ఇష్టపడకపోవడాన్ని వారు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్‌ కిశోర్‌ను చేర్చుకోవడంపై ఎనిమిది మంది సభ్యుల కమిటీలో ఎక్కువ మంది ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం, ఆయనను కేవలం సభ్యుడిగా చేర్చి క్రమంగా బాధ్యతలు అప్పజెప్పాలని సూచించడంతో సోనియా ఆ నిర్ణయానికి వచ్చారు. 


పీకే సూచనలు కొత్తవేమీ కాదు..

ప్రియాంకాగాంధీ వాధ్రా, అంబికా సోనీ లాంటి నేతలు ప్రశాంత్‌ కిశోర్‌ను కాంగ్రెస్‌ శిబిరంలో ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారని, కానీ.. రాహుల్‌గాంధీ మాత్రం ఆయన పట్ల మొదటినుంచీ వ్యతిరేకంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ గెలవడం, ఓడటం అటుంచితే.. వందేళ్ల చరిత్ర గల పార్టీని బయటి నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా అప్పజెబుతామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు ప్రశ్నించారు. అంతేకాకుండా.. అధిష్ఠానంతో సమావేశంలో ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన సూచనలు కొత్తవేమీ కావని అన్నారు. పార్టీలో అసమ్మతి వర్గంగా పేర్కొంటున్న జీ-23 నేతలు కూడా దాదాపు ఇలాంటి సూచనలే చేశారని చెప్పారు. వాస్తవానికి కాంగ్రెస్‌ అధినాయకత్వం ఇప్పటికే పార్టీ బలోపేతానికి చర్యలు ప్రారంభించిందని, మేధోమదన సదస్సు నిర్వహించడం, సాధికారిక కమిటీ ఏర్పాటు చేయడం ఇందుకు నిదర్శనాలని ఆయన పేర్కొన్నారు. పార్టీలో ఎంత పెద్దవారైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్న సందేశం పంపడంతో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా.. ప్రశాంత్‌ కిశోర్‌తో మంతనాలు ప్రారంభించినప్పటి నుంచీ పార్టీలో కదలిక ఏర్పడిందని, ఒక వృత్తి నిపుణుడిగా ఆయన పార్టీ ని బలోపేతం చేస్తారని భావించామని కాంగ్రెస్‌ నేత ఒకరు అన్నారు. 


Updated Date - 2022-04-27T08:05:13+05:30 IST