కాంగ్రెస్ పునరుజ్జీవానికి 5 మెట్లు

Published: Fri, 22 Apr 2022 18:43:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కాంగ్రెస్ పునరుజ్జీవానికి 5 మెట్లు

కాంగ్రెస్ చేతికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు

న్యూఢిల్లీ: ‘‘కాంగ్రెస్ పార్టీ చావకూడదు.. దేశం ఉన్నంతకాలం అది ఉంటుంది’’ అని 1947లో మహాత్మగాంధీ చెప్పిన మాటలతో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవ ప్రణాళికను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రూపొందించారు. పార్టీ అంతరాత్మ సజీవంగా ఉండాలి. కానీ పార్టీ రూపం మారిపోవాలని సూచించారు. మొత్తం 85 పేజీలతో కూడిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆయన అందజేశారు. 2024 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా అందించిన ప్రణాళికలో మొత్తం 5 అంచెలు ఉన్నాయి. కాంగ్రెస్ పునరుజ్జీవ ప్రక్రియ ఈ నిర్ణయాలతో ఆరంభమవ్వాలని ప్రశాంత్ కిశోర్ సూచించారు.

అవి

1. పార్టీలో నాయకత్వ సమస్యలను పరిష్కరించాలి.

2. పొత్తులపై పార్టీ వైఖరి స్పష్టంగా ఉండాలి.

3. పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాలను మళ్లీ అందిపుచ్చుకోవాలి.

4. కిందిస్థాయిలో లీడర్లు, క్షేత్రస్థాయి సైనికులతో కాంగ్రెస్ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలి.

5. మద్దతుగా నిలిచే మీడియా, డిజిటల్ మీడియా వ్యూహాలకు పదునుపెట్టాలి.


1.నాయకత్వ సమస్యలను పరిష్కరించాలి

తొలిసారి కాంగ్రెస్ పార్టీ ఏవిధమైన లక్ష్యాలు, వ్యూహాలు, పద్ధతులు, ఎత్తుగడలు లేకుండా చుక్కానీలేని నావలా పయనిస్తోంది. అందుకే దిశాదశా లేకుండానే నాయకత్వం పనిచేస్తోంది. ఈ కారణంగానే పార్టీలో సందిగ్దత, ప్రతిష్ఠంభన ఆవహించాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు... యూపీఏ చైర్‌పర్సన్(కాంగ్రెస్‌కు చెందిన ఎవరైన ఒక సీనియర్), ఏఐసీసీ ప్రెసిడెంట్‌గా సోనియా గాంధీ, వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్(గాంధీ ఏతర కుటుంబానికి చెందినవారు), పార్లమెంటరీ బోర్డ్ నాయకుడిగా రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ- కోఆర్డినేటర్‌గా ప్రియాంకా గాంధీలు పార్టీ నిర్ణయాల్లో ముఖ్యభూమిక పోషించాలి. నిర్ణయాల్లో వీరికే ప్రాధాన్యత ఉండాలి. ఈ విధానం కొనసాగితే  విజయవంతమయ్యే అవకాశాలు మోస్తారుగా ఉంటాయి. ప్రభావం మధ్యస్తంగా ఉంటుంది. కానీ ఇందుకు ప్రత్యమ్నాయంగా యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీయేతరులను కొనసాగించవచ్చు అని ప్రశాంత్ కిశోర్ సూచించారు.


సమష్టి కృషితో ముందుకు...

కాంగ్రెస్ పార్టీ బలంగా లేకపోతే యూపీఏ మనుగడ సంక్లిష్టంగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాలి. ఇందుకోసం యూపీఏ చైర్‌పర్సన్ తన పరపతిని ఉపయోగించుకోవాలి. కీలకమైన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న కాంగ్రెస్ పార్టీ నేతల మద్దతను కూడబెట్టుకోవాలి. కిందిస్థాయిలో పట్టుకోసం కృషిచేయాలి. మరోవైపు కాంగ్రెస్ పార్టీని సమష్టిగా నడిపించడంపై ఏఐసీసీ ప్రెసిడెంట్ దృష్టిపెట్టాలి. ఇక గాంధీయేతర వైస్ ప్రెసిడెంట్ పార్టీ అధినాయకత్వానికి అనుగుణంగా ప్రజల్లోకి దూసుకెళ్లాలి. లీడర్ ఆఫ్ పార్లమెంటరీ బోర్డ్‌గా వ్యవహరించే వ్యక్తి పార్లమెంట్ లోపల, వెలుపల ప్రజల గొంతును బలంగా వినిపించాలి. చివరిగా జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ నాయకత్వం, పార్లమెంటరీ బోర్డ్, క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య అనుసంధానం కోసం నిరంతరాయంగా కృషి చేయాలి.


ప్రధాని మోడీ వర్సెస్ పార్లమెంటరీ పార్టీ హెడ్

పార్లమెంట్ వెలుపల, బయటా ప్రజల స్వరాన్ని గట్టిగా వినిపించేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పార్టీ పార్లమెంటరీ హెడ్ సమర్థవంతంగా పోరాడాలి. జనాల నాడిని పసిగట్టి వారి నమ్మకాన్ని, ఆశీర్వాదాన్నీ పొందాలి. అప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది.


30 కోట్ల మంది ఓటర్లు లక్ష్యం

సాధారణ ఎన్నికల్లో 45 శాతం ఓటు షేరు పొందాలంటే 30 కోట్ల మంది ఓటర్లను లక్ష్యంగా చేసుకోని ముందుకుపోవాలని పీకే ప్రణాళిక సూచించింది. ప్రాంతాలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.  ఇందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజల అసంతృప్తిని తెలియజేసేందుకు ప్రత్యేక వేదికేదీ లేదు. ఇందుకోసం ప్రత్యేక వేదికలను ప్రోత్సహించాలని పేర్కొంది.


ఎన్నికల బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ ముందు 3 ఆప్షన్లు

2014 నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు గెలిచే స్థితిలో లేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ముందు 3 ఆప్షన్లు ఉన్నాయి. 1.కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగాలి. ఇందుకోసం దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఇలా చేస్తే విజయవంతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ప్రభావం కూడా భవిష్యత్‌లో సానుకూలంగా ఉంటుంది. కానీ ఎన్నికల్లో గెలవడం మాత్రం కష్టమనే చెప్పాలి. ఇక 2వ ఆప్షన్‌లో యూపీఏ3 ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కూటమితో కలిసి ముందుకెళ్లాలి. బీజేపీ లేదా నరేంద్ర మోడీని ఓడించేందుకు అన్ని పార్టీలతో కలిపి ముందుకెళ్లాలి. అయితే ఈ ఆప్షన్‌లో ప్రభావం మోస్తారుగానే ఉండొచ్చు. ఇక 3వ ఆప్షన్ విషయానికి వస్తే.. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వ్యూహాలు ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో ఒంటరిగా బరిలోకి దిగాలి. మిగతా ప్రాంతాల్లో వ్యూహాత్మక ఎత్తుగడలతో కూటములు ఏర్పాటు చేయాలి. కూటములు ఏర్పాటు చేసే విషయంలో జాతీయభావాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా ముందుకెళ్తే ఎన్నికల్లో గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు భవిష్యత్‌లో రాణించేందుకు మెరుగైన అవకాశాలుంటాయని వెల్లడించారు. పొత్తులు ఏర్పరచుకునే విషయంలో 3 కీలకమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. 1. సైద్దాంతికత, 2. అనుకూలతలు, 3. ప్రాంతీయ పార్టీలు అధికారంలో రాలేని లేదా కాంగ్రెస్ గత 20 ఏళ్లుగా అధికారంలో లేని రాష్ట్రాలను ఎంపిక చేసుకోవాలని పీకే ప్రణాళిక పేర్కొంది.


ఏపీలో వైఎస్సాఆర్‌సీపీతో పొత్తు

లోక్‌సభ సీట్లలో 70-75 శాతం సీట్లలో కాంగ్రెస్ ప్రత్యక్షంగా పోటీ చేయాలి. వ్యూహాత్మకంగా ప్రాంతీయ పార్టీలతో భాగస్వామం ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం  కాంగ్రెస్ పార్టీ 17 రాష్ట్రాలలో ఒంటరిగా 358 సీట్లలో పోటీ చేయాలి. 5 రాష్ట్రాలలో వ్యూహాత్మకంగా ప్రాంతీయ పార్టీలతో పొత్తుపెట్టుకుని 168 సీట్లలో పోటీ చేయాలి. ఈ పార్టీలో జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ఉంది. మిగతా పార్టీల విషయానికి వస్తే.. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా, తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో ఎన్‌సీపీ పార్టీతో ముందుకెళ్లాలని పీకే ప్రణాళిక సూచించింది. ఇక జమ్ముకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని 17 సీట్లలో అనుబంధ మిత్రులు, ఎంతోకాలంగా పార్టీకి అనుబంధంగా ఉంటున్న పార్టీలలో ఉమ్మడిగా పోటీ చేయాలని సూచించింది. జమ్ముకాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి ముందుకెళ్లాలని సూచించింది.


ఒక కుటుంబం.. ఒక టికెట్

పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ తిరిగి అందిపుచ్చుకోవాలి. ఇందుకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు, నేతల్లో ప్రేరణ నింపాలి. దేశ రాజకీయాల్లో నేరపూరిత, అవినీతిపై పోరాటం చేయాలని ప్రశాంత్ కిశోర్ ప్రణాళిక పేర్కొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్యయుతం చేయాలి. ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వాలి. పార్టీ అంతర్గత అంశాలపై నిర్ణయాలు తీసుకునే విభాగాల్లో అంతర్గతంగా ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు చెరో 50 శాతం చొప్పున ఉండాలి. నామినేటెడ్ సభ్యుల్లో లోక్‌సభ లేదా విధానసభకు చెందిన 50 శాతం మంది ఉండాలి. 

1. పార్టీ విభాగాలను తిరిగి ఏర్పాటు చేయాలి. ఇందుకోసం అన్నీ స్థాయిల్లో ఎన్నికలు జరగాలి.

2. పదవీకి నిర్ణీత కాలవ్యవధి ఉండాలి. కాంగ్రెస్ ప్రెసిడెంట్‌తోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కూడా కాలవ్యవధి ఉండాలి.

3. పార్టీ అంతర్గత ఎన్నికల్లో ఎలాంటి అవకతవకులకు తావివ్వకుండా టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు చూపించాలి.

4. వారసత్వ రాజకీయాలపై వెలువడుతున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఒక కుటుంబం.. ఒక టికెట్ విధానాన్ని అనుసరించాలి.

5. పార్టీ నియామకాల్లో వయసు, లింగం, సామాజిక వర్గాలకు కట్టుబడి ఉండాలి. దేశ జనాభా, ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. 

6. అవినీతికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.

7. తీవ్రమైన నేరాల్లో ప్రమేయం ఉన్నవారికి పార్టీ టికెట్లు కేటాయించకూడదు. అలాంటివారి పదవీ కాలాలను కూడా పొడిగించకూడదు.

8. పార్టీకి సంబంధించిన నిర్వహణ, నిర్ణయాలు, నిధుల వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా బహిర్గతం చేయాలి.


క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ సైన్యం కదంతొక్కాలి

కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో 15 వేల మంది నేతలు ఉన్నారు. ఒక కోటికిపైగానే కార్యకర్తలు ఉన్నారు. పార్టీ బలోపేతానికి రెండంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. 1. పార్టీ : మొదటి విభాగం సరికొత్ పాన్ ఇండియా వ్యవస్థ రూపాన్ని కలిగివుండాలి. 2. ఎలక్టోరల్: రెండో విభాగం పటిష్టమైన ఎలక్టోరల్ విధానాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, 2024 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు.


పటిష్టమైన సోషల్ మీడియా విభాగం

పటిష్టమైన సోషల్ మీడియా విభాగం ఏర్పాటు చేసుకోవాలి. ప్రధాని మోడీ తన స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న వ్యాఖ్యలను జనాలకు తెలియజేసేందుకు ఓ ప్రత్యేక యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేయాలి. అనుకూలమైన న్యూస్ పోర్టల్స్, రిపోర్టర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం ఫేస్‌బుక్ పేజీలు, యూట్యూబ్ ఛానెల్స్, ట్విట్టర్, గ్రామీణ స్థాయిల్లో వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసుకోవాలి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.