రెండేళ్ల క్రితమే లాయర్‌ హత్యకు ప్లాన్‌

ABN , First Publish Date - 2022-08-08T08:51:21+05:30 IST

ములుగు జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి.

రెండేళ్ల క్రితమే లాయర్‌ హత్యకు ప్లాన్‌

రూ. 18 లక్షలకు కుదిరిన డీల్‌.. న్యాయవాది హత్యకేసులో మరో ఆరుగురికి రిమాండ్‌


ములుగు, ఆగస్టు 7: ములుగు జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. నిందితులు 2020లోనే ఈ హత్యకు ప్రణాళికలు రూపొందించుకుని, కుట్రలు పన్నినట్లు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ వెల్లడించారు. శనివారం నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. ఆదివారం మరిన్ని వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ మాట్లాడుతూ.. ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టి.. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ‘‘మల్లారెడ్డితో ఏర్పడ్డ పలు భూవివాదాల నేపథ్యంలో వ్యాపారి గోనెల రవీందర్‌, పిండి రవియాదవ్‌, వంచ రామ్మోహన్‌రెడ్డి అతణ్ని అంతమొందించేందుకు కుట్రపన్నారు. ఇందుకోసం ఆర్‌ఎంపీ వైద్యుడు తడక రమేశ్‌ సాయం తీసుకున్నారు. హనుమకొండ జిల్లా గంగిరేణి గూడానికి చెందిన పెరుమాండ్ల రాజు అమలు వీరి వ్యూహాన్ని చేశాడు.


రూ. 18 లక్షలకు డీల్‌ కుదుర్చుకోగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఈడిగ జయరాం, ఈడిగ వేణు, నంద్యాల జిల్లా బుక్క వెంకటరమణ, వరంగల్‌ జిల్లా నారక్కపేటకు చెందిన వైనాల శివకు అడ్వాన్స్‌ చెల్లించారు. సుపారీ డబ్బులు, మల్లారెడ్డి సమాచారం కోసం వీరంతా పలుమార్లు నర్సంపేటకు వచ్చారు’’ అని ఎస్పీ తెలిపారు. ఆగస్టు 1న ఇద్దరు వ్యక్తులు మల్లారెడ్డి కదలికలపై రెక్కీ నిర్వహించగా.. నలుగురు భూపాల్‌నగర్‌ బస్టాప్‌ వద్ద కాపుకాచారన్నారు. ‘‘వీరు ముందుగా అనుకున్నట్లే.. స్పీడ్‌బ్రేకర్‌ వద్ద మల్లారెడ్డి కారు నెమ్మదించగా.. ఆ కారును వెనక నుంచి ఢీకొట్టారు. దాంతో మల్లారెడ్డి కారు దిగి, బయటకు రాగా.. అతణ్ని పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లిన దుండగులు కత్తులతో పొడిచి, హతమార్చారు. మల్లారెడ్డి తీవ్రంగా ప్రతిఘటించడంతో.. కర్నూలుకు చెందిన జయరాం గాయపడ్డాడు. ఈ కుట్రలో గంగిరేణిగూడానికి చెందిన పెరుమాండ్ల రాకేశ్‌ సహకరించాడు’’ అని ఎస్పీ తెలిపారు. ఈ ఆరుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు.

Updated Date - 2022-08-08T08:51:21+05:30 IST