18 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక

ABN , First Publish Date - 2022-06-29T06:14:03+05:30 IST

హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 18 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

18 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- హరితహారం కార్యక్రమంపై సమీక్ష

- హాజరైన ఎమ్మెల్యేలు అబ్రహాం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ శ్రీహర్ష

గద్వాల క్రైం, జూన్‌ 28 : హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 18 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. హరితహారం కార్యక్రమంపై కలెక్టరేట్‌ సమావేశపు హాలులో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నర్సరీలలో పండ్ల మొక్కలను పెం చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ పాఠశాలలో మధ్నాహ్న భోజనానికి అవసరమయ్యే కరివేపాకు, కూరగాయలు, పండ్ల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. గతంలో నాటిన మొక్కలు చనిపోతే, వాటి స్ధానంలో కొత్తమొక్కలు నాటాలని సూచించారు. కలెక్టర్‌ శ్రీహర్ష మాట్లాడుతూ ఎనిమిదవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా లో 18 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ కోసం మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మండల స్ధాయి అధికారులు సమావేశాలు నిర్వహించి హరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఆరు లక్షల మొక్కలు నాటేందుకు గుంతలు తీసినట్లు తెలిపారు. డీఆర్‌డీవో, డీపీవో ఆధ్వర్యంలో 1,70,000 మొక్కలు నాటాలని చెప్పారు. ప్రతీ మండలంలోని పల్లె ప్రగతి వనాల్లో మొక్కలు నాటేందుకు ప్లాన్‌ చేస్తున్నామన్నారు. జిల్లాలో ఆరు రకాల మొక్కలు నాటడంతో పాటు టెకోమా మొక్కలు నాటాలన్నారు. గద్వాల పట్టణంలోని 33 వార్డుల్లో పార్కులను సిద్ధం చేసి, మొక్కలు నాటినట్లు తెలిపారు. గద్వాల స్మృతివనంలో మిగిలిన పనులు పూర్తిచేయాలన్నారు. అయిజ, వడ్డేపల్లి, అలంపూర్‌ మునిసిపాలిటీల పరిధిలో రహదారులకు ఇరు వైపులా మొక్కలు నాటాలన్నారు. సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలం పూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం, జడ్పీ సీఈవో, డీఎఫ్‌వో రామకృష్ణ, గోవిందనాయక్‌, డీపీవో శ్యాంసుందర్‌, డిప్యూటీ డీఆర్డీవో నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.


నాణ్యమైన భోజనం అందించాలి

గట్టు : విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. కలుషిత ఆహారంతో గట్టు గురుకుల పాఠశాల విద్యార్థినులు సోమ వారం అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, స్థానిక సర్పంచ్‌ ధనలక్ష్మితో కలిసి పాఠశాలను పరిశీలిం చారు. విద్యార్థినులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం వంట గది, స్టోర్‌రూం లను తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి అక్కడే భోజనం చేశారు. ఆ తర్వాత పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థినులపై శ్రద్ధ వహించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపాల్‌ వాణి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T06:14:03+05:30 IST