బెల్లం సమస్య పరిష్కారానికి ప్రణాళిక

ABN , First Publish Date - 2022-05-22T06:38:29+05:30 IST

బెల్లం సమస్య శాశ్వత పరిష్కారానికి అన్ని వర్గాలతో మాట్లాడి ప్రణాళికను రూపొందిస్తామని వర్తక సంఘం కార్యదర్శి కొణతాల లక్ష్మీనారాయణ తెలిపారు.

బెల్లం సమస్య పరిష్కారానికి ప్రణాళిక
సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మీనారాయణ


వర్తక సంఘం కార్యదర్శి కొణతాల లక్ష్మీనారాయణ

అనకాపల్లి టౌన్‌, మే 21: బెల్లం సమస్య శాశ్వత పరిష్కారానికి అన్ని వర్గాలతో మాట్లాడి ప్రణాళికను  రూపొందిస్తామని వర్తక సంఘం కార్యదర్శి కొణతాల లక్ష్మీనారాయణ తెలిపారు. ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో రైతులు, వర్తకులు, కార్మికుల ఐక్యవేదిక సమావేశం మళ్ల సత్యనారాయణ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏదేమైనా బెల్లం సమస్యకు శాశ్వత పరిష్కారం అవసర మన్నారు. గతంలో నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేసినట్టు జీవోలు విడుదలైనా, ప్రభుత్వాలు మారినప్పుడు కొత్తగా అనధికార ఆంక్షలు విధించడం పరిపాటైందన్నారు. బెల్లాన్ని కొందరు అధికారులు గంజాయి మాదిరిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే భవిష్యత్తులో ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ నల్లబెల్లం పేరుతో రైతులు, వ్యాపారులను పోలీసులు వేధించడం దుర్మార్గమన్నారు. 2002లో అప్పటి ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే రైతులు, కార్మికులు, వ్యాపారులు కలిసి ఐక్యంగా పోరాడి తిప్పికొట్టారని, ఇప్పుడు అదేవిధంగా తిప్పి కొడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ బెల్లం ప్రజలకు హాని కల్పించేదిగా అధికారులు చెప్పడంలో అర్థం లేదన్నారు. సారాను అరికట్టలేక రైతులు, కార్మికులు, వర్తకులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో పలు సంఘాల నేతలు కర్రి అప్పారావు, గంటా శ్రీరామ్‌, కార్మిక, కొలగార్ల గుమస్తాల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-22T06:38:29+05:30 IST