మొక్క లెక్క..

ABN , First Publish Date - 2022-09-16T06:18:27+05:30 IST

‘సుందర అనంత-మన అనంత’ అన్నారు. పాలకులు, అధికారులు గొప్పలు చెప్పు కుంటూ రూ.లక్షల్లో నిధులు ఖర్చు చేశారు.

మొక్క లెక్క..
ఎండి న మొక్కలు

హరిత వనం పేరిట దోపిడీ 

వర్టికల్‌ గార్డెనకు రూ.అర కోటి

మొక్కలు నాటని నగర పాలిక

పచ్చదనం ప్రకటనలకే పరిమితం


 ‘సుందర అనంత-మన అనంత’ అన్నారు. పాలకులు, అధికారులు గొప్పలు చెప్పు కుంటూ రూ.లక్షల్లో నిధులు ఖర్చు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే పాట పాడుతున్నారు. కేవలం డబ్బు ఖర్చు చేసేందుకే పరిమితమౌతున్నారు. కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారు. అనంత నగరాన్ని హరిత వనంగా తీర్చిదిద్దుతామని సందర్భం వచ్చిన ప్పుడల్లా.. ప్రజాప్రతినిధులు, అధి కారులు ఊదరగొడుతున్నారు. మాటలు కోటలు దాటుతున్నా.. కాలు గడప దాటడం లేదు. డివైడర్ల మధ్యలో మొక్కలు నాటితే.. నగరం పచ్చబడినట్లా..? రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడా మొక్కలు నాటాల్సిన పని లేదా..? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.

- అనంతపురం క్రైం


కార్పొరేటర్లడిగినా లేవంట..!

మొక్కలు నాటుతామని కార్పొరేటర్లడిగినా ఇప్పుడు లేవని అధికారులు చెబుతున్నారట. కార్పొరేటర్లకే దిక్కు లేకపోతే ఇక సామాన్యులకు ఇస్తారా..? అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడా  మొక్కలు నాటడం లేదు. తమ డివిజనలో పది మొక్కలు కావాలని కోరితే.. ప్రస్తుతానికైతే లేవు.. తెప్పిస్తామని చెబుతున్నారట. నగరంలోని ఓ వాటర్‌ ప్లాంట్‌ యజమాని తనకు రెండు మొక్కలు ఇప్పించండి అని ఓ ఉన్నతాధికారిని అడిగారట. ఇందుకు త్వరలోనే తెప్పిస్తామని సమాధానం ఇచ్చారట. ఏ డివిజనలోనూ కనీసం 10 మొక్కలు నాటలేదు. నగరంలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజనలో 100 మొక్కలు నాటినా, ఐదువేల వృక్షాలు పెరిగేవి. కానీ పాలకవర్గానికి, అధికారులకు పట్టడం లేదు. 


చెదలు పడుతున్న మొక్కలు

 నాటేందుకు తెచ్చిన కొన్ని మొక్కలు ఎండిపోయి.. చెదలు పడుతున్నాయి. వాటిని రూ.లక్షలు వెచ్చించి తెప్పించారు. హౌసింగ్‌ బోర్డులో ఉన్న రాజీవ్‌ చిల్డ్రన్స పార్కులో మొక్కల దుస్థితి ఇది. నాలుగైదు నెలలుగా నాటకుండా వాటిని అలాగే ఉంచారు. దీంతో కొన్ని ఎండిపోయాయి. నగరంలో కొన్ని డివైడర్ల మధ్యలో అడ్వర్టయిజ్‌మెంట్‌ కోసం బోర్డులు ఏర్పాటు చేశారు. వాటి కోసం ఏకంగా మొక్కలను తొలగించారు. అటవీశాఖ జిల్లాలో ఏటా కోటి మొక్కలను సిద్ధం చేస్తుంది. నగరపాలక సంస్థ వాటిని కొనుగోలు  చేసి నాటొచ్చు. లేదా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి నాటే వీలుంది. విద్యుత తీగలు, రోడ్లు, బ్రిడ్జి నిర్మాణాలకు అడ్డు వస్తున్నాయని నగరంలో ఇప్పటికే వందల సంఖ్యలో చెట్లను కొట్టేశారు. ఈ లోటును పూడ్చే ఆలోచనే నగరపాలికకు లేనట్లుంది. 


రూ.అర కోటిపైగా ఖర్చు

బళ్లారి బైపాస్‌ బ్రిడ్జి కింద వర్టికల్‌ గార్డెన కోసం రూ.57 లక్షలు ఖర్చు చేశారు. ఇది కాంట్రాక్టర్‌కు తప్ప ఎవరికీ ఉపయోగపడింది లేదు. ఓ ఉన్నతాధికారి ప్రత్యేకంగా ఉందని అప్పట్లో ఆ పనికి పూనుకున్నారు. అక్కడ కుండీల తరహాలో వేలాడే మొక్కలు ఏర్పాటు చేశారు. అవి కొన్ని రోజులు పచ్చగా ఉండి, ఆ తరువాత ఎండిపోతున్నాయి. శాశ్వతంగా పచ్చదనం అక్కడ కనిపించదు. పచ్చదనం కనిపించాలంటే ప్రతిసారీ ఖర్చు పెడుతూనే ఉండాలట. ఈ వర్టికల్‌ గార్డెన కోసం పెట్టిన ఖర్చుతో కొన్ని వేల మొక్కలను నగరంలో నాటి ఉండొచ్చని జనం అంటున్నారు. 

Updated Date - 2022-09-16T06:18:27+05:30 IST