మొక్కుబడి

ABN , First Publish Date - 2021-10-02T06:18:34+05:30 IST

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. మొక్కలు నాటుదాం వాటిని సంరక్షిద్దాం. ఇంటికో మొక్క’ ఇలాంటి నినాదాలు తరచూ ప్రభుత్వపరంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాలకులు, అధికారులు వల్లెవేసే మాటలు.

మొక్కుబడి
వాడరేవు, రామాపురం మధ్య రోడ్డు పక్కన కనిపించని గతంలో నాటిన మొక్కలు

జగనన్న పచ్చతోరణంలో రూ.కోట్లలో ఖర్చు

కనిపించని మొక్కలు 

నిధులు మాత్రం  మాయం

పర్యవేక్షణ అంతంతమాత్రం

ఇదెక్కడి చోద్యం అంటున్న ప్రజలు

లింగసముద్రం మండలంలో గత బుధవారం జరిగిన సోషల్‌ ఆడిట్‌లో రోడ్లకిరువైపులా వేసిన మొక్కల్లో 70శాతానికిపైగా మాయమైనట్లు గుర్తించారు. అయినప్పటికీ నిధులు మంజూరు చేసినట్లు తేల్చారు.  మొక్కల మాటున భారీగా నిధులు స్వాహా చేసినట్లు నిర్ధారించారు. అలాగే మస్టర్లలో మాయాజాలం కూడా వెలుగు చూసింది.

ఉలవపాడు మండలంలో మొక్కలకు సంబంధించి ఉపాధి నిధులు దుర్విని యోగం అయినట్లు గత సోమవారం జరిగిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో బయట పడింది. అటవీ ప్రాంతంలో మొక్కల పెంపకానికి ఉపాధి నిధులు వెచ్చించినప్ప టికీ సంబంధిత రికార్డులు ఇవ్వలేదు.

మొక్కల పెంపకం కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రధానంగా ఉపాధి హామీ సిబ్బందికి ఆదాయ వనరుగా మారింది. ఫలితంగా అంతా మొక్కుబడి వ్యవహారంలా తయారైంది. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కింద జిల్లాలో ప్రస్తుతం ఉద్యమంలా మొక్కలు నాటుతున్నారు. అయితే గతేడాది నాటిన మొక్కల సంరక్షణను పట్టించుకోవటం లేదు. గతంలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా భారీగా మొక్కలు  నాటారు. రోడ్లకు ఇరువైపులా, విద్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో, చెరువుల చుట్టూ ఎన్నోచోట్ల నాటారు. అవి ప్రస్తుతం ఎలా ఉన్నాయో కూడా తెలియడం లేదు. జగన్‌ ప్రభుత్వంలో వాటి సంరక్షణ మరిచారు. ప్రస్తుతం మరలా భారీగా ఖర్చు పెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. పనిలోపనిగా జేబులు నింపుకుంటున్నారు.

చీరాల, అక్టోబరు 1 : ‘పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. మొక్కలు నాటుదాం వాటిని సంరక్షిద్దాం. ఇంటికో మొక్క’ ఇలాంటి నినాదాలు తరచూ ప్రభుత్వపరంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాలకులు, అధికారులు వల్లెవేసే మాటలు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అందుకుగాను ఇప్పటికే సుమారు రూ.కోటికిపైగా వెచ్చించారు. అయితే గతేడాది నాటిన మొక్కలు కనిపించటం లేదు. మొక్కలు నాటడం, పెంపకం, సంరక్షణ కొంత కాగితాల మీద, కొంత క్షేత్రస్థాయిలో జరుగుతోంది. ఈక్రమంలో నిధుల వినియోగంలో పారదర్శకత లోపించింది. ఐస్‌ ముక్క ఒకరి చేతుల నుంచి మరొకరి చేతులకు మారుతుంటే ఎలా కరుగుతుందో అలా వివిధ దశల్లో నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. జిల్లా మొత్తం మీద 6,39,593 మొక్కలను 1,598 కిలోమీటర్ల పరిధిలో నాటాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. అందుకుగాను సెప్టెంబరు చివరకు జిల్లాలో 1430 కిలోమీటర్ల మేర 5.72లక్షల మొక్కలు నాటారు. గుంతలు తీసి, మొక్కలు నాటినందుకు సుమారు రూ.55లక్షలు ఖర్చు చేశారు. నర్సరీలో మొక్కల పెంపకం, రవాణా అదనం. ఇక ఇప్పటి నుంచి సంరక్షణకు అదనపు ఖర్చు. కాగా మొక్కల సంరక్షణ బాధ్యతను స్థానిక సర్పంచ్‌కు అప్పగించారు. నెలకు నాలుగు సార్లు నీటి తడులు అందించాల్సి ఉంది. అందుకుగాను ప్రతి 200 మొక్కలకు ఒక కూలీని పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇది కాగితాలపైనే కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. ఉపాధి సిబ్బంది కూడా మొక్కల సంరక్షణను అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు.


కాగితాలపైనే మొక్కలు

మొక్కలు నాటే ముందు నర్సరీలలో పెంచాలి. ఆ తర్వాత వర్షాలు సక్రమంగా ఉన్నపుడు గుంతలు లోతుగా తీయించి అవసరమైన మేర మంచి మట్టిని జోడించి నాటాలి. పశువుల నుంచి రక్షణకు కంచె ఏర్పాటు చేయాలి. తర్వాత బెట్ట సమయాల్లో నీటితడులు ఇవ్వాలి. ఈ మొత్తానికి ఆయా నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఇవన్నీ చేస్తున్నారా.. అంటే అధికశాతం కాగితాల మీద చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం చెప్పిన వెంటనే స్థానిక స్థితిగతులను ఆలోచించకుండా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నారు.  కూలీలతో గుంతలు తీయించి మొక్కలు నాటి మమ అన్పిస్తున్నారు. మొత్తంగా అంతా చేసినట్లు బిల్లులు చేసుకుని స్వాహా చేస్తున్నారు. అధికారులు, సిబ్బంది లాభాపేక్ష కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరటం లేదు. అయితే ఇటీవల జిల్లాలో జరిగిన పలు సోషల్‌ ఆడిట్‌లో మొక్కల పెంపకంలో జరిగిన అవకతవకలు బయటపడుతున్నాయి.


ఖర్చు ఘనం... 

కాగితాల మీద లెక్కలు చూపినా, క్షేత్రస్థాయిలో మొక్కలు కనిపించకపోవటంపై ఉన్నతాధికారులు నోరు మెదపరు. ఖర్చు ఘనంగా ఉన్నా, ఫలితం గురించి ఆరా తీయరు. అందరి భాగస్వామ్యం ఉండటంతో ముందుగా నాటిన మొక్కలు ఏవీ అని పరిశీలించకుండా మరలా మొక్కలు నాటడం, పెంచటం షరామామూలైపోయింది.


నాటిన మొక్కల్లో సగం బతికినా ...

గత రెండు దశాబ్దాల కాలంలో నాటిన మొక్కల్లో సగం బతికినా జిల్లా అంతటా పచ్చదనం గణనీయంగా ఉండేది. అయితే ఆ పరిస్థితి లేకపోవటంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. అంతేకానీ తమ ప్రాంతాల్లో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటిన తరువాత సంరక్షణ చర్యలు చేపట్టని అధికారులు, సిబ్బందిని ప్రశ్నించటంగాని, తాము కూడా భాగస్వాములు కావటం కానీ చేయటం లేదు. 


Updated Date - 2021-10-02T06:18:34+05:30 IST