క్యారీబ్యాడ్‌!

ABN , First Publish Date - 2021-11-13T05:47:29+05:30 IST

జిల్లాలో నిషేధిత ప్లాసిక్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

క్యారీబ్యాడ్‌!

పేరుకే నిషేధం ... యథేచ్ఛగా వినియోగం

జిల్లాలో విచ్చలవిడిగా నిషేధిత ప్లాస్టిక్‌..

మనుషుల, జంతువుల ప్రాణాలకు ముప్పు

అయినా చర్యలు నామమాత్రం

రెండు రోజుల నుంచి ప్లాసిక్‌ రహిత గుంటూరు అమలు

గతంలోనూ అనేక మార్లు ఆదేశాలు

కఠినంగా అమలు చేస్తేనే ఫలితం

జిల్యావ్యాప్తంగా ప్లాస్టిక్‌ను నియంత్రించాలంటున్న పర్యావరణవేత్తలు

ప్రజల భాగస్వామ్యం ముఖ్యమంటున్న నిపుణులు 


నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగం హానికరం.. ఇదే విషయాన్ని ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిత్యం చెబుతున్నాయి. కానీ వాటి నిషేధం అమలు మాత్రం ఆచరణలోకి రావడం లేదు. ప్లాస్టిక్‌ కవర్‌ లేనిదే రోజు గడవదన్నట్లు మారిపోయింది. గుడ్డ, జూట్‌తో చేసిన బ్యాగ్‌లు వాడాలని పదేపదే మొత్తుకుంటున్నా ప్రజలు దానిని నిర్లక్ష్యం చేస్తున్నారు. వ్యాపారులు బహిరంగంగా ప్లాస్టిక్‌ కవర్లు విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడంలో మీనమేషాలు లెక్కపెడుతున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లా కేంద్రమైన గుంటూరులో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం అమలులోకి తెచ్చారు. దీంతో మరోమారు ప్లాస్టిక్‌ నిషేధం తెరపైకి వచ్చింది. ఇది అమలు సాధ్యమేనా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్‌ అమలు సాధ్యమంటున్నారు నిపుణులు..!

   

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, నవంబరు 12: జిల్లాలో నిషేధిత ప్లాసిక్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొంతకాలం హడావుడిగా దాడులు చేయడం... తర్వాత మిన్నకుండి పోవడంతో నిషేధం అమలు కావడం లేదు. ఇది హానికరం అని తెలిసినా వినియోగిస్తున్నారు.. విక్రయిస్తున్నారు..! హ్లాండ్లింగ్‌ ప్లాస్టిక్‌ కవర్స్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ 2011 నిబంధనల ప్రకారం మునిసిపల్‌ అధికారులు వ్యాపార, కాయకూరల, పండ్ల మార్కెట్‌ తదితర దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తుంటే వారిపై కఠిన చర్యలు తీసుకొని, అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించాలి. వాటిని స్వాధీనం చేసుకుని కాల్చివేయాలి. అయితే ఈ నిబంధనలు పటిష్టంగా అమలు కాకపోవడంతో విచ్చలవిడిగా వినియోగం జరుగుతోంది. 

ఫ నరసరావుపేట పట్టణంలో 2019లో ప్లాస్టిక్‌ నిషేధాన్ని విజయవంతంగా అమలు చేశారు. పూర్తిస్థాయిలో నిషేదం అమలు అవుతున్న తరుణంలో మునిసిపల్‌ అధికారులపై రాజకీయ వత్తిడిలు పెరిగాయి. కొందరు వ్యాపార ప్రతినిధుల పైరవీలు, రాజకీయ వత్తిడిలతో గత మూడుసార్లు నిషేధం నిలిచిపోయింది. వ్యాపారులు నిషేదిత ప్లాస్టిక్‌ కవర్లు, పేపరు, గ్లాసులు పెద్దఎత్తున విక్రయిస్తున్నారు. కనీసం మునిసిపల్‌ కూరగాయల మార్కెట్‌లోనైనా పురపాలక సంఘం నూరు శాతం నిషేదం అమలు చేసే ప్రయత్నం చేయాలి.  తెనాలి పట్టణంలోని మునిసిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్‌ కవర్లను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ అమలుకు నోచుకోలేదు. కిరాణా దుకాణాలు, కాయగూరలు, పండ్ల విక్రయాలు, హోటళ్లు, కర్రీస్‌ పాయింట్లు ఇలా అన్నిచోట్ల తక్కువ మైక్రాన్లు కలిగిన ప్లాస్టిక్‌ కవర్లనే వినియోగిస్తున్నారు. గుర్తుకొచ్చినప్పుడల్లా తూతూ మంత్రంగా తనిఖీలు చేసి నామమాత్రం జరిమానాలు విధిస్తున్నారు. అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడంతో వీటి నిషేధం అమలు కావడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.  

ఫ బాపట్ల పట్టణంలో క్యారీబ్యాగ్‌లు నిషేదిస్తూ 2009వ సంవత్సరంలోనే పెద్దఎత్తున కార్యక్రమాలు చేశారు. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో చేసిన ఈ కార్యక్రమం కొంతవరకు ఫలించినా నేడు యఽథాస్థితికి వచ్చింది. అన్ని దుకాణాల్లో విచ్చలవిడిగా విక్రయాలు చేస్తున్నారు. నిషేదం ఉందంటూనే మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవటంలేదు. డ్రైనేజీలలో పెద్దఎత్తున క్యారీబ్యాగ్‌లు పేరుకుపోతున్నాయి.  సత్తెనపల్లి నియోజకవ ర్గంలో పలు హోటళ్లు, మెడికల్‌ షాపుల నిర్వాహకులు, చిరువ్యాపారులు, చికెన్‌, మటన్‌ వ్యాపారస్తులు ప్లాస్టిక్‌ సంచుల వాడకాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. సత్తెనపల్లి కేంద్రంగా ప్లాస్టిక్‌ సంచులను తయారు చేసి చుట్టుపక్కల గ్రామాలకు, మండలాలకు విక్రయిస్తున్నారు. తాడేపల్లి సీతానగరం నదిఒడ్డున ఉండవల్లి కూడలి వద్ద కాలువ ఏరియాలలో ప్లాస్టిక్‌ సంచుల వ్యర్థాలు ఇష్టానుసారంగా పడేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగిస్తుండడంతోపాటు మూగజీవాలకు ప్లాస్టిక్‌ సంచులు ప్రాణసంకటంగా మారాయి. చిలకలూరిపేట పట్టణంలో నిత్యం విడుదలయ్యే 60 టన్నుల చెత్త వ్యర్థాలలో సగం ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఉంటున్నాయి. కాల్వలలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ సంచులు కనిపిస్తున్నాయి.

  

గుంటూరు నగరంలో..

గుంటూరును ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దడానికి ఈనెల 10 నుంచి పాలిథిన్‌ సంచులను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఇప్పటికే నగర మేయర్‌, కమిషనర్లు ప్రకటించారు. ప్లాస్టిక్‌ సంచుల ఉత్త్పత్తిదారులకు, వర్తకులతో పాటు వాటిని ఉపయోగించే వినియోగదారులకు భారీగా జరిమానాలు ప్రకటించారు. గతంలో ఇటువంటి ఆదేశాలు అనేకసార్లు వచ్చాయి. కానీ మొదట రెండురోజుల హడావుడి తప్ప తరువాత పరిస్థితి షరామాములే. గతంలో సిబ్బంది కొరత కారణంగా సరైన దాడులు జరగక నిషేధం అంతగా అమలు కాలేదు. కానీ ఈసారి నిషేధం అమలు కోసం నగరపాలకసంస్ధ నాలుగు ప్రత్యేక బృందాలను(ఒక్కో టీంలో ఏడుగురు చొప్పున) నియమించింది. వీరితోపాటు నగరంలో ఉన్న 207 సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది కూడా తనిఖీల్లో పాల్గొంటారు. సచివాలయాల్లో పనిచేసే 11మంది ఉద్యోగుల్లో ఒకరిద్దరు మినహా మిగిలినవారు, వలంటీర్లు ఈ తనిఖీల్లో భాగస్వాములుగా చేశారు. పాలిఽథిన్‌ కవర్లు వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటారు. 

  

75 మైక్రానుల కంటే తక్కువ..

గతంలో 50 మైక్రాన్లు కన్నా తక్కువ మందం కలిగిన సంచులపై నిషేధం ఉండేది. ఈసారి ఆ నిషేదం 75మైక్రానులకు పెంచారు.  అమెరికా లాంటి దేశాల్లో ప్రతి మనిషి సరాసరి వేసే చెత్త 5-6 కేజీలు ఉంటే, మన దగ్గర ముఖ్యంగా గుంటూరు నగరంలో సరాసరి 500 - 1000గ్రాములు మాత్రమే ఉంది. కానీ ఈ కాస్త చెత్తను రీసైక్లింగ్‌ చేసే సాంకేతిక మన దగ్గరలేక పోవడం కూడా సమస్యకు మరో కారణం.  


గుంటూరులో 450 టన్నుల చెత్త

గుంటూరు నగరంలో నగరంలో దాదాపు 8లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వీరి నుంచి దాదాపు రోజుకు 450 టన్నుల చెత్తను పారిశుధ్య కార్మికులు సేకరిస్తున్నారు. వీటిలో 30శాతం మేర ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఉంటున్నాయని ఒక అంచనా. ఈ వ్యర్ధాలు భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. 


విష వాయులతో ప్రమాదం

ప్లాస్టిక్‌ను కాల్చితే వచ్చే డయాక్సిన్‌, ప్యూరాన్‌ విషవాయువులు క్యాన్సర్‌ను కలగజేస్తాయి. రంగుల సంచుల్లో తయారీలో వాడే సీసం, క్యాడ్మియం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సీసం పిల్లల పెరుగుదల, జ్ఞాపకశక్తిని హరించి వేస్తుంది. క్యాడ్మియం కిడ్సీలను దెబ్బతీస్తుంది. వేడి ఆహార పదార్ధాలను నిలువచేస్తే ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ గ్రాన్యుల్‌ పిగ్మంట్లు అందులో కలసిపోయి ప్రాణాంతకరమైన క్యాన్సర్‌కు దారి తీస్తాయి. ప్లాస్టిక్‌ వ్యర్ధాలను తయారుచేసే ప్రక్రియలో వెలువడే క్లోరినేటడ్‌ హైడ్రోకార్బన్లు శారీరకంగా ఉన్నవారికి కేంద్రనాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఉన్నచోట మొక్కలు కూడా మొలకెత్తవు. 


 సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నియంత్రించాలి

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నియత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి కొవిడ్‌ సమయంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం బాగా పెరిగింది. అర్బన్‌లో తిరిగే ప్రతి ఆవులో 20 నుంచి 30 కేజీల ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఉన్నాయంటే పరిస్థితి ఏస్ధాయిలో అర్ధం చేసుకోవచ్చు. 11 రకాల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై కేంద్రం నిషేధం విధించింది. అంటే డిస్పోజల్‌ కప్పులు, గ్లాసులు, ప్లేట్లు వంటివాటిపై ఈ నిషేధం ఉంటుంది. నగరంలో ఇప్పటినుంచే వీటి వాడకంపై కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించి వాటి వినియోగాన్ని తగ్గించగలిగితే క్లీన్‌ గుంటూరును త్వరగా సాకారం చేసుకోవచ్చని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.


 సాంకేతిక ఏదీ..?

చెత్తను రీసైక్లింగ్‌ చేసే అధునాతన సాంకేతిక లేకపోవడం కూడా నగరంలో ప్లాస్టిక్‌ వ్యర్ధాలు పేరుకుపోవడానికి మరో కారణంగా చెప్పుకోవాలి. కేవలం 450  టన్నుల చెత్త రీసైక్లింగ్‌కు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం. అంతేగాక తడిచెత్త, పొడిచెత్త దగ్గరే ఆగిపోయాం. గతంలో ఏటుకూరు బైపాస్‌కు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన రీసైక్లింగ్‌ ప్రక్రియ ప్రస్తుతం నిలిచిపోయింది. రోజుకు దాదాపు 1000 టన్నుల చెత్తను రీసైక్లింగ్‌ చేసే సామర్ధ్యం కలిగిన జిందాల్‌ కంపెనీ పూర్తిస్తాయిలో మొదలుకాలేదు. దీంతో వ్యర్ధాలు పేరుకుపోతున్నాయి.  


వేడుకల్లోనూ ప్లాస్టిక్‌

ఇటీవలకాలంలో శుభకార్యాల్లో అన్ని వస్తువులు ప్లాస్టిక్‌తో చేసినవే వాడుతున్నారు. తినే ప్లేట్లు, గ్లాసులు, బల్లలపై వేసే పేపర్‌లోల్స్‌, డెకరేషన్స్‌కు వాడే  పూలు కూడా ప్లాస్టిక్‌ వాటినే వాడుతున్నారు. వాటిని ఉపయోగించిన తరువాత ఊరి చివర రోడ్ల పక్కనే పడేస్తున్నారు. దీంతో ఇవి పంట కాలువలు, మురుగు కాల్వల్లోకి వెళ్లి కాల్వల్లో మురుగు నీరు పారుదల లేకుండా అడ్డుపడుతున్నాయి. వర్షాలు పడినప్పుడు కాల్వల్లోని నీరు రోడ్లపైకి వచ్చేస్తున్నాయి.  

Updated Date - 2021-11-13T05:47:29+05:30 IST