రక్తంలోనూ ప్లాస్టిక్‌ విషం

Published: Sat, 26 Mar 2022 00:38:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రక్తంలోనూ ప్లాస్టిక్‌ విషం

ప్రపంచంలో తొలిసారి గుర్తించిన డచ్‌ శాస్త్రజ్ఞులు

శరీర అవయవాల్లో, మలంలో ప్లాస్టిక్‌ అవశేషాలను గతంలో వివిధ పరిశోధనల్లో గుర్తించిన శాస్త్రవేత్తలు

రక్తంలో కనిపించడం ఆందోళన కలిగించే విషయమే!..

మైక్రో ప్లాస్టిక్‌ అవశేషాలతో ఆరోగ్యానికి తీవ్ర ముప్పు

కణాల మరణం, పేగు వాపు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నట్టు గత అధ్యయనాల్లో వెల్లడి


ఆమ్‌స్టెర్‌డ్యామ్‌, మార్చి 25: కాలి కింది భూమిలో.. నీలి సంద్రపు లోతులో.. చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణంలో.. తినే తిండిలో.. పీల్చే గాలిలో.. తాగే నీటిలో..  అన్ని చోట్లా నిండిపోయిన ప్లాస్టిక్‌ భూతం ఆఖరికి మన రక్తంలోకి కూడా చేరుతోంది! మానవ శరీరాల్లో మైక్రో ప్లాస్టిక్‌ అవశేషాలు కొత్త విషయమేమీ కాదు. మానవ మెదడు, జీర్ణాశయం, మాయ (గర్భసంచిలో ఉండే ఉమ్మనీరు)లో కూడా శాస్త్రజ్ఞులు గుర్తించారు. కానీ, ప్రపంచంలోనే తొలిసారి.. నెదర్లాండ్స్‌ శాస్త్రజ్ఞులు మానవ రక్తంలో మైక్రో ప్లాస్టిక్‌ (అతి సూక్ష్మ ప్లాస్టిక్‌) అవశేషాలను గుర్తించారు. పరిశోధనలో భాగంగా వారు మొత్తం 22 మంది వ్యక్తుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షించగా.. వారిలో 17 మంది రక్తంలో (అంటే 77.2ు) మైక్రో ప్లాస్టిక్‌ అవశేషాలున్నాయి. అంగుళంలో 0.00002వ వంతు పరిమాణం ఉండే అత్యంత సూక్ష్మ ప్లాస్టిక్‌ కణాలవి.


]ఇలా రక్తంలో ప్లాస్టిక్‌ చేరడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమే. ‘‘మానవ రక్తంలో పాలిమర్‌ కణాలున్న విషయం మా అధ్యయనంలో వెల్లడైంది. అయితే దీనిపై మరింత పెద్ద సంఖ్యలో నమూనాలను సేకరించి పరిశోధన జరపాల్సి ఉందని’’ అని ఈ రిసెర్చ్‌కు నేతృత్వం వహించిన డచ్‌ ప్రొఫెసర్‌ డిక్‌ వెతాక్‌ తెలిపారు. ‘‘రక్తంలో ఉన్న సూక్ష్మ ప్లాస్టిక్‌ కణాలు ఒకచోటే ఉంటాయా? లేక రక్తం సరఫరా అయ్యే క్రమంలో వివిధ అవయవాలకు చేరుతాయా? రక్తంలోని విషాల నుంచి మెదడును  కాపాడే ‘బ్లడ్‌-బ్రెయిన్‌ బ్యారియర్‌’ వ్యవస్థను కూడా అధిగమించి మెదడులోకి చేరుతాయా? వీటన్నింటిపైనా వేగంగా పరిశోధనలు చేయాల్సి ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. ప్లాస్టిక్‌ కాలుష్యంపై పోరాడుతున్న ‘కామన్‌ సీస్‌’ అనే సంస్థ ఈ అధ్యయనం వెనుక ఉంది.


ఇందులో తేలిన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జో రాయల్‌ అన్నారు. ‘‘మనం ప్లాస్టిక్‌ను తింటున్నాం. తాగుతున్నాం. పీలుస్తున్నాం. సముద్రపు అట్టడుగు లోతుల్లో.. ఎవరెస్ట్‌ పర్వత శిఖరంపై ప్లాస్టిక్‌ ఉంది. అయినా కూడా 2040 నాటికి ప్లాస్టిక్‌ ఉత్పత్తి రెట్టింపు కాబోతోంది’’ అని జో రాయల్‌ ఆందోళన వెలిబుచ్చారు. ఇక.. ఈ అధ్యయనం కోసం తక్కువ నమూనాలు సేకరించి చేసినప్పటికీ.. విశ్లేషణకు ఉపయోగించిన విధానాలు సమగ్రమైనవని, రక్తంలో మైక్రోప్లాస్టిక్‌ అవశేషాలు చేరుతున్నాయనడానికి కచ్చితమైన ఆధారాలనిచ్చాయని ‘నేషనల్‌ ఓషనోగ్రఫీ సెంటర్‌’ పరిశోధకుడు డాక్టర్‌ అలిస్‌ హార్టన్‌ పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలితం ‘ఎన్విరాన్‌మెంటల్‌ ఇంటర్నేషనల్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. 


‘పెట్‌’ ప్లాస్టిక్‌ అవశేషాలే ఎక్కువ..

ఈ అధ్యయనంలో భాగంగా నెదర్లాండ్స్‌ పరిశోధకులు తాము సేకరించిన రక్త నమూనాల్లో ఐదు రకాల ప్లాస్టిక్‌ అవశేషాల కోసం గాలించారు. అవేంటంటే.. పాలీమిథైల్‌ మెథక్రిలేట్‌ (పీఎంఎంఏ), పాలీప్రొపిలీన్‌ (పీపీ), పాలిస్టరీన్‌ (పీఎస్‌), పాలీ ఇథలీన్‌ (పీఈ), పాలీ ఇథలీన్‌ టెరెఫ్తాలేట్‌ (పీఈటీ). మొత్తం సేకరించినవాటిలో 50 శాతం రక్త నమూనాల్లో పీఈటీ రకం మైక్రోప్లాస్టిక్‌ అవశేషాలున్నట్టు తేలింది. మనం ముద్దుగా పిలుచుకునే పెట్‌ బాటిల్స్‌ (వాటర్‌ బాటిల్స్‌, జ్యూస్‌ బాటిల్స్‌) తయారయ్యేది ఈ ప్లాస్టిక్‌తోనే. ఫుడ్‌ ప్యాకేజింగ్‌కు కూడా ఈ ప్లాస్టిక్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నాం. ఇక, 36 శాతం నమూనాల్లో పాలిస్టరీన్‌ (ప్యాకేజింగ్‌/స్టోరేజీకి వాడే ప్లాస్టిక్‌ ఇది) అవశేషాలు, 23 శాతం నమూనాల్లో పాలీ ఇథలీన్‌ (క్యారీబాగుల తయారీలో వాడేది ఇదే) అవశేషాలు కనిపించాయి. 5 శాతం నమూనాల్లో పాలీమిథైల్‌ మెథాక్రిలేట్‌ అవశేషాలు కనిపించగా.. ఎవ్వరిలోనూ పాలీప్రొపిలీన్‌ అవశేషాలు లేవు. అయితే, ఒక నమూనాలో ఏకంగా మూడు రకాల ప్లాస్టిక్‌ అవశేషాలు కనిపించడం పరిశోధకులనే ఆందోళనకు గురిచేసింది. 


ఏమిటీ మైక్రో ప్లాస్టిక్‌?

సూక్ష్మ ప్లాస్టిక్‌ కణాలంటే.. అంగుళంలో 0.2వ వంతుకన్నా (5మిల్లీమీటర్ల కన్నా) తక్కువ ఉండే ప్లాస్టిక్‌ కణాలు. ఏటా ప్రపంచవ్యాప్తంగా 9 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తులు తయారై వినియోగంలోకి వస్తున్నాయి. కానీ, వాటిలో 9 శాతం మాత్రమే రీసైక్లింగ్‌ అవుతున్నాయి. మిగతా 91 శాతం ఉత్పత్తులు.. గాలిలో, నీటిలో, వాతావరణంలో కలిసిపోతున్నాయి. రోడ్డు మీద నడిచేటప్పుడు మన కాలికి తగిలే ప్లాస్టిక్‌ బాటిళ్లు, కవర్లు ఇలాంటివే. అవన్నీ కాలక్రమంలో చిన్న చిన్న ముక్కలుగా విడిపోతూ దీర్ఘకాలంలో సూక్ష్మ ప్లాస్టిక్‌ కణాలుగా (5 మిల్లీమీటర్ల కన్నా తక్కువ మందం గల ముక్కలుగా) మారుతాయి. అవే నీటివనరుల్లోకి.. జలచరాల్లోకి చేరి నీటి ద్వారా, జలచరాల ద్వారా మళ్లీ మానవ శరీరాల్లోకి చేరుతున్నాయి.


ఎంత ప్రమాదం?

మైక్రో ప్లాస్టిక్‌ అవశేషాలు శరీరంలోకి చేరితే ఏమవుతుంది? దీనిపై యూనివర్సిటీ ఆఫ్‌ హల్‌ పరిశోధకుల నేతృత్వంలో ఒక అధ్యయనం జరిగింది. గత ఏడాది డిసెంబరులో ఆ అధ్యయన ఫలితాలు హజార్డస్‌ మెటీరియల్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఆ నివేదిక ప్రకారం.. మైక్రో ప్లాస్టిక్‌ అవశేషాలు మానవ శరీరంలో కణాల మరణానికి (సెల్‌ డెత్‌), కణాల గోడలు దెబ్బతినడానికి, అలర్జిక్‌ రియాక్షన్లకు కారణమవుతాయి. శరీరంలో ఆ అవశేషాల సంఖ్య పెరిగే కొద్దీ ముప్పు కూడా అంతేస్థాయిలో పెరుగుతుందని వారి అధ్యయనంలో వెల్లడైంది.  2021లోనే చైనా శాస్త్రజ్ఞులు చేసిన మరో అధ్యయనం ప్రకారం.. మైక్రో ప్లాస్టిక్‌ అవశేషాలు పేగుల్లో వాపునకు, ఇన్‌ఫ్లమేటరీ బొవెల్‌ డిసీజ్‌కు (ఐబీడీ) కారణమవుతాయని తేలింది. ఈ అధ్యయనం కోసం వారు ఇన్‌ఫ్లమేటరీ బొవెల్‌ డిసీజ్‌తో బాధపడుతున్నవారి (52 మంది) మల నమూనాలు, ఆ వ్యాధి లేనివారి (50 మంది) నమూనాలు సేకరించి పరీక్షించగా.. ఆరోగ్యవంతులైన వ్యక్తులతో పోలిస్తే ఐబీడీ బాధితుల మలంలో 1.5 రెట్లు ఎక్కువగా మైక్రోప్లాస్టిక్‌ అవశేషాలున్నట్టు తేలింది. 


ప్లాస్టిక్‌ తినేస్తున్నాం!

మన కంటికి కనిపించనంత సూక్ష్మ మైక్రోప్లాస్టిక్‌ అవశేషాలు మనం తినే తిండి ద్వారా, తాగే నీటి ద్వారా, పీల్చే గాలి ద్వారా శరీరంలోకి చేరుతున్నాయి. అయితే ఎంత పరిమాణంలో? వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఇంటర్నేషనల్‌ 2019లో దీనిపై ఒక ఆసక్తికరమైన అధ్యయనం చేసి.. విస్మయం కలిగించే నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ అధ్యయనం ప్రకారం.. ఏ రూపంలో అయినాగానీ.. వారానికి క్రెడిట్‌ కార్డంత పరిమాణంలో (దాదాపు 5 గ్రాములు.. అంటే ఒక టేబుల్‌ స్పూన్‌) ప్లాస్టిక్‌ అవశేషాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇదే క్రమంలో నెలకు 21 గ్రాముల ప్లాస్టిక్‌.. ఆరు నెలలకు 125 గ్రాములు, ఏడాదికి పావుకిలో, పదేళ్లకు 2.5 కిలోలు.. జీవితకాలంలో 20 కిలోల ప్లాస్టిక్‌ మన శరీరంలోకి ప్రవేశిస్తోంది. 20 కిలోల ప్లాస్టిక్‌ అంటే.. రెండు చెత్త డబ్బాల బరువు!!


ఎక్కణ్నుంచి వస్తాయి?

మైక్రోప్లాస్టిక్‌ అవశేషాలు రకరకాల ప్లాస్టిక్‌ ఉత్పత్తుల నుంచి వస్తాయి. ఉదాహరణకు.. సింథటిక్‌ దుస్తులు, ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌, ప్లాస్టిక్‌ సంచులు, మేకప్‌ ఉపకరణాలు, పెయింట్‌, అరిగిపోయిన కారు టైర్ల వంటివాటి నుంచి వాతావరణంలో కలుస్తుంటాయి.


1/10000.. నానో ప్లాస్టిక్‌

పరిమాణంలో 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ తునకలను మైక్రోప్లాస్టిక్‌గా వ్యవహరిస్తే.. మిల్లీమీటరులో పదివేలో వంతు ఉండే అవశేషాలను నానోప్లాస్టిక్‌ అవశేషాలుగా పిలుస్తారు. ఇవి మనచుట్టూ ఉన్న గాలిలో తిరుగుతుంటాయి. మనం పీల్చే శ్వాస ద్వారామన శరీరంలోకి ప్రవేశిస్తాయి.

రక్తంలోనూ ప్లాస్టిక్‌ విషం

70000000000 టన్నులు

1950ల నుంచి.. ఇప్పటిదాకా మనుషుల వల్ల సముద్రాల్లో కలిసిన మైక్రోప్లాస్టిక్‌ అవశేషాల బరువు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.