ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ గోదాంలో భారీ పేలుడు

ABN , First Publish Date - 2021-12-19T16:35:05+05:30 IST

జీడిమెట్ల పారిశ్రామికవాడ ప్రాంతంలోని వెంకటాద్రినగర్‌లో నివాస ప్రాంతంలో అక్రమంగా నడుపుతున్న ఓ రీసైక్లింగ్‌ ప్లాస్టిక్‌ గోదాంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది...

ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ గోదాంలో భారీ పేలుడు

ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు

పేలుడు ధాటికి కూలిపోయిన షెడ్‌


హైదరాబాద్/జీడిమెట్ల: జీడిమెట్ల పారిశ్రామికవాడ ప్రాంతంలోని వెంకటాద్రినగర్‌లో నివాస ప్రాంతంలో అక్రమంగా నడుపుతున్న ఓ రీసైక్లింగ్‌ ప్లాస్టిక్‌ గోదాంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో యంత్రంపై పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. భారీ పేలుడుకు గోదాం పైకప్పు, ప్రహరీ కూలిపోయాయి. ఒక్కసారిగా బాంబులు పేలిన శబ్దం రావడంతో వెంకటాద్రినగర్‌ నివాసితులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. నగరంలోని రసూల్‌పురకు చెందిన అబ్బాస్‌ కొంతకాలంగా జీడిమెట్ల ఫాక్స్‌సాగర్‌ కట్టకింద ఉన్న వెంకటాద్రినగర్‌లో ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ గోదాంను నిర్వహిస్తున్నాడు. వివిధ రసాయన పరిశ్రమల నుంచి భారీ ఎత్తున కెమికల్‌ డబ్బాలను తీసుకొచ్చి వాటిని ముక్కలుగా చేసి తిరిగి విక్రయిస్తుంటాడు.


రోజు మాదిరిగానే శనివారం ఉదయం ఇద్దరు కార్మికులు షేక్‌ అజీమ్‌(45), ముంతాజ్‌బేగం(40) యంత్రం వద్ద కెమికల్‌ డబ్బాలను ముక్కలు చేసే పనిలో ఉన్నారు. ఓ రసాయన డబ్బాను కట్‌చేయగా ఒక్కసారిగా బాంబుపేలినట్టు పేలింది. ఈ డబ్బాలో ఉన్న ప్రమాదకరమైన కెమికల్స్‌కు నిప్పురవ్వలు తగలడంతో అది పేలింది. దీంతో గోదాం షెడ్‌ కూలిపోయింది. ఈ ఘటనలో అజీమ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే పనిచేస్తున్న ముంతాజ్‌ తలకు బలమైన గాయమైంది. గాయపడిన ఈ కార్మికులను హుటాహుటిన సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. కాగా నివాస ప్రాంతాల్లో అక్రమంగా నడుస్తున్న కెమికల్‌, ప్రమాదకరమైన గోదాంలను తక్షణమే ఇక్కడి నుంచి తొలగించాలని స్థానికులు అధికారులను డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-12-19T16:35:05+05:30 IST