అంగన్‌వాడీ కేంద్రంలో ప్లాస్టిక్‌ బియ్యం

ABN , First Publish Date - 2021-06-14T03:48:04+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాలకు అత్యంత నాణ్యమైన ఫ్లోర్టిఫైడ్‌ బియ్యం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం నాసిరకానివి పంపిణీ చేసింది. వీటిలో ప్లాస్టిక్‌ బియ్యం కూడా ఉండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

అంగన్‌వాడీ  కేంద్రంలో ప్లాస్టిక్‌ బియ్యం
చిన్నకర్రివానిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం

- చిన్నకర్రివానిపాలెంలో పంపిణీ

- ఆందోళనలో గర్భిణులు, బాలింతలు

కవిటి, జూన్‌ 13: అంగన్‌వాడీ కేంద్రాలకు అత్యంత నాణ్యమైన ఫ్లోర్టిఫైడ్‌ బియ్యం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం నాసిరకానివి పంపిణీ చేసింది. వీటిలో ప్లాస్టిక్‌ బియ్యం కూడా ఉండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కవిటి మండలం జగతి పంచాయతీ చిన్నకర్రివానిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో ఆదివారం  పిల్లలు, గర్భిణులు, బాలింతలకు బియ్యం పంపిణీ చేశారు. వీటిలో ప్లాస్టిక్‌ బియ్యం ఉండడంతో బాలింతలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ  ఆరోగ్యంతో చెలగాటమాడతారా? అని అంగన్‌వాడీ కార్యకర్తను ప్రశ్నించారు.  బియ్యం కడిగితే కొన్ని గింజలు నీటిలో తేలిపోతున్నాయని తెలిపారు. నోటితో నమిలితే గట్టిగా ఉన్నాయని వాపోయారు. ఇటువంటి బియ్యం తింటే పిల్లల పరిస్థితి ఏంటని నిలదీశారు. దీనిపై అంగన్‌వాడీ కార్యకర్త సునీత స్పందిస్తూ..  ప్రతినెల మాదిరిగా ఈనెల కూడా రేషన్‌ డిపో నుంచి వచ్చిన బియ్యాన్ని పంపిణీ చేశానని తెలిపారు. అందులో కల్తీ అయినట్లు తెలియదని చెప్పారు. పంపిణీ చేసిన బియ్యాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని సూపర్‌ వైజర్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి.. నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. ఈ విషయమై కవిటి ఇన్‌చార్జి సూపర్‌వైజర్‌ ఎస్‌.నీలవేణి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా, అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసిన బియ్యంలో ఎక్కడా రిమార్క్‌లు రాలేదన్నారు. ఒక్కచోట బియ్యం నాసిరకంగా ఉన్నాయని చెప్పడంతో వాటిని వెనక్కి తీసుకుని, నాణ్యమైనవి అందజేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించామని తెలిపారు. కాగా  ఇంత వరకు బియ్యంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఇచ్ఛాపురం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ సిబ్బంది తెలిపారు.


 

Updated Date - 2021-06-14T03:48:04+05:30 IST