ప్లాస్టిక్‌ నిషేధం సరే.. ప్రత్యామ్నాయాలేవీ ?

ABN , First Publish Date - 2022-07-01T06:30:27+05:30 IST

ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెనుభూతంలా మారిన ఒకసారి వినియోగించి పడేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది.

ప్లాస్టిక్‌ నిషేధం సరే.. ప్రత్యామ్నాయాలేవీ ?
ద్వారకాతిరుమల క్షేత్రంలో ప్లాస్టిక్‌ కవర్లు

నేటి నుంచి దేశవ్యాప్తంగా నిషేధించాలని కేంద్రం ఆదేశం 

తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం.. చిన్నతిరుపతిలో శూన్యం

ద్వారకాతిరుమల, జూన్‌ 30 : ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెనుభూతంలా మారిన ఒకసారి వినియోగించి పడేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించి గత ఏడాది ఆగస్టులోనే నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉత్పత్తి చేసే పరిశ్రమలు, వినియోగదారులు ప్రత్యామ్నాయం వైపు మళ్లడానికి సమయమిచ్చిన ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను తెచ్చేందుకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం పూర్తిస్థాయిలో అమలు జరిగేనా అనేది ప్రశ్నా ర్థకమే. ప్లాస్టిక్‌ కాలుష్యంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌దే అగ్రస్థానం. ఇప్పటికే 60కి పైగా దేశాలు నిషేధించాయి. భారత్‌లోనూ కొన్ని రాష్ట్రాల్లో వీటిపై ఆంక్షలున్నాయి. కేంద్రం ఆదేశాల మేరకు 75 మైక్రానుల కన్నా తక్కువ మందం ఉన్న సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం విధించింది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుంచి ఐదు ట్రిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ బ్యాగ్‌లను వినియోగిస్తున్నారు.

తిరుపతిలో పూర్తి నిషేధం.. మరి చిన్న తిరుపతిలో..

పుణ్యక్షేత్రమైన తిరుమలలో గత నెల ఒకటి నుంచే సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేశారు. కొండపై ఉన్న దుకాణదారులతో పాటు భక్తులు సైతం నిషేధాన్ని పాటించాల్సిందేనని టీటీడీ నిర్ణయించింది. ప్లాస్టిక్‌ రహిత ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు చర్చలు చేపట్టారు. అలిపిరి టోల్‌గేట్‌ వద్దే ప్లాస్టిక్‌ను గుర్తించే సెన్సార్‌లను ఏర్పాటు చేసి నిఘా పెంచింది. 

ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో ప్లాస్టిక్‌ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. గ్రామంతో పాటు క్షేత్ర పరిసరాల్లో యథేచ్ఛగా ప్లాస్టిక్‌ను వినియోగి స్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ప్రస్తుతం ఏ భక్తుడి చేతిలో చూసినా క్యారీబ్యాగ్‌ కనిపిస్తోంది. దాదాపు అన్ని దుకాణాల్లోనూ ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు. బాటిల్స్‌, కొండ దిగువన చిరువ్యాపారులు పండ్లు, నిమ్మకాయలు, జామకాయలు వంటి వాటిని ఈ కవర్ల ద్వారానే విక్రయిస్తున్నారు. అటు పంచాయతీ అధికారులు, ఇటు ఆలయ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్లాస్టిక్‌ కవర్లకు బదు లుగా సేంద్రియ పత్తి, వెదురు, చెక్క, మట్టి, పింగాణి, త్వరగా ప్రకృతిలో కలసిపో యే ప్లాస్టిక్‌తో తయారైన వస్తువులు వాడాలి. మట్టి, పింగాణి పాత్రలను ఆహారం నిల్వచేసేందుకు వాడొచ్చు. 


నిషేధించిన వస్తువులు ఇవే..

క్యారీ బ్యాగులు, 75 మైక్రానుల మందం కన్నా తక్కువున్న ప్లాస్టిక్‌ వస్తువులు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, ఇయర్‌ బడ్స్‌, పుల్లలు, జెండాలు, ఐస్‌క్రీమ్‌ పుల్లలు, డెకరేషన్‌కు వినియోగించే థర్మోకోల్‌ షీట్లు, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్స్‌, చెంచాలు, స్ట్రాలు, స్వీటు బాక్సులు, సిగరెట్‌ పెట్టెలకు చుట్టే కవర్లు, ప్లాస్టిక్‌ ఆహ్వాన పత్రికలు, పీవీసీ బ్యానర్లు వంటి  వస్తువులపై నిషేధం వర్తిస్తుంది.


Updated Date - 2022-07-01T06:30:27+05:30 IST