Plastic Waste ; ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఆహ్లాదం పంచుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు

ABN , First Publish Date - 2022-06-04T01:53:08+05:30 IST

ప్లాస్టిక్ రహిత జీవితాన్ని ప్రస్తుతం మనం ఊహించుకోలేం. అయితే లక్షిత

Plastic Waste ; ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఆహ్లాదం పంచుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు

న్యూఢిల్లీ : ప్లాస్టిక్ రహిత జీవితాన్ని ప్రస్తుతం మనం ఊహించుకోలేం. అయితే లక్షిత ప్రయోజనం నెరవేరిన తర్వాత ప్లాస్టిక్ వృథాగా పడి ఉంటుంది. చెత్తతోపాటు పారేస్తే డంపింగ్ యార్డుల్లోనూ, కాలువల్లోనూ పేరుకుపోతుంది. అలాంటి చెత్త అందమైన కళాఖండాలుగా, రకరకాల రూపాల్లో తిరిగి ఉపయోగపడుతోంది. ఆదాయంతోపాటు సంతోషాన్ని కూడా పంచుతోంది. 


ఉగాండాలో...

ఉగాండా రాజధాని నగరం కంపాలాలో వర్షాలు పడితే చాలు రోడ్లు, కాలువలు చెత్తతో నిండిపోతాయి. ఈ నగరంలోని ఓ మురికివాడవాసి ఫెయిత్ అవెకో అనే మహిళ ఓ సోషల్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌కు వెళ్లారు. అప్పుడు ఆమెకు సరికొత్త ఆలోచన వచ్చింది. మరో ఇద్దరు మహిళలతో కలిసి ‘రిఫార్మ్ ఆఫ్రికా’ను 2018లో ప్రారంభించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేసి, ఎండబెట్టి, ప్రాసెస్ చేసి, తోలు వంటి పదార్థంగా మార్చుతున్నారు. దీంతో  వాటర్‌ప్రూఫ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్స్, షాపింగ్ బ్యాగులు, టాయిలెట్రీ బ్యాగులు వంటివాటిని తయారు చేసి అమ్ముతున్నారు. వీరు రోజుకు సగటున 20 బ్యాగుల వరకు తయారు చేస్తారు. ఒక్కొక్క బ్యాగు ధర సుమారు రూ.700 నుంచి రూ.1,700 వరకు ఉంటుంది. వీరి కష్టాన్ని గుర్తించిన మానవతావాద, స్వచ్ఛంద సంస్థలు వీరు తయారు చేసిన బ్యాగులను కొని, ప్రోత్సహిస్తున్నాయి. ఈ బ్యాగులను ప్రస్తుతం నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్, అమెరికాల్లో కూడా విక్రయిస్తున్నారు. ఈ విజయంతో నూతనోత్తేజం లభించడంతో అవెకో హార్డ్ ప్లాస్టిక్స్‌ను రీసైకిల్ చేయడం కోసం ఓ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సామాజిక బాధ్యతతో ప్లాస్టిక్ వ్యర్థాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 


భారత దేశంలో...

ముంబైలో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో మోనిషా నార్కే 2009లో RUR Green Life (Are you Reducing, Reusing and Recycling>)ను ప్రారంభించారు. ఈ సోషల్ ఎంటర్‌ప్రైజ్ అనేక ప్రొడక్ట్స్‌ను తయారు చేస్తోంది. ప్లాస్టిక్, పేపర్ కార్టన్లతో పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే బల్లలు, డెస్క్‌లు, కుర్చీలను తయారు చేస్తోంది. వీటిని చాలా మంది ఆన్‌లైన్ ద్వారా కొని, ప్రభుత్వ పాఠశాలలకు విరాళంగా ఇస్తున్నారు. ఈ సంస్థ స్వయంగా 350 స్కూల్ డెస్క్‌లు, 250 బెంచీలను పంపిణీ చేసింది. ఈ సంస్థను విస్తరించి, మూడు నగరాల్లోని దుకాణాలు, పాఠశాలలు, కళాశాలల నుంచి టెట్రాప్యాక్ కార్టన్లను సేకరిస్తున్నారు. ఒక డెస్క్ లేదా కుర్చీని తయారు చేయడానికి సుమారు 4,500 కార్టన్లు; ఒక బెంచీని తయారు చేయడానికి సుమారు 6,500 కార్టన్లు అవసరమవుతాయి. ఈ ఫర్నిచర్ పట్ల విద్యార్థినీ, విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


ఇండోనేషియాలో...

ఇండోనేషియాలో సంవత్సరానికి దాదాపు 7.8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడతాయి. విశ్వవిద్యాలయంలో స్నేహం కుదిరిన ఓవీ సబ్రినా, నోవిటా టాన్ ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఇటుకలుగా మార్చాలనే ఆలోచనకు వాస్తవ రూపం ఇవ్వడానికి వీరికి దాదాపు 18 నెలలు పట్టింది. వీరిద్దరూ సైకాలజీ గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ, సిమెంటు, ప్లాస్టిక్‌లను కలిపి, పర్యావరణ హితకరంగా, మన్నికగా, ప్రామాణికంగా ఉండే ఇటుకలను తయారు చేయడానికి పెద్ద ఎత్తున పరిశోధన నిర్వహించారు. 2019 నవంబరులో Rebricksను ఏర్పాటు చేశారు. జకార్తాలో మూడు చోట్ల నుంచి, వెస్ట్ జావాలో ఒక చోటు నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, ఇటుకలను తయారు చేస్తున్నారు. 1 లక్ష ఇటుకలను తయారు చేయడానికి 17,500 కేజీల వ్యర్థాలు అవసరమవుతాయి. ఒక చదరపు మీటరు వైశాల్యంగల పేవింగ్ బ్లాక్ తయారీకి 880 ప్లాస్టిక్ పీసెస్ అవసరమవుతాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం మొదట్లో కష్టమైనప్పటికీ, ఇప్పుడు వీరిద్దరి వాట్సాప్ నంబర్లకు నిరంతరం మెసేజ్‌లు వస్తున్నాయి. తమ వద్దనున్న చెత్తను ఏ విధంగా పంపించాలో చెప్పాలని ప్రజలు ఈ సందేశాల ద్వారా వీరిని కోరుతున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా రీసైకిలింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని వీరిద్దరూ ప్రయత్నిస్తున్నారు. సాధారణ ఇటుకల వ్యాపారులతో పోటీ పడటం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రతి చదరపు మీటర్ ప్లాస్టిక్‌ రీసైకిల్ అయినపుడు దాని కోసం వినియోగించిన ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్త కుప్పలో పడకుండా కాపాడగలిగామని తాము సంతోషిస్తామని వీరు చెప్పారు. ఇది తమకు చాలా విలువైనదన్నారు. 


మలావీలో...

మలావీలోని బ్లాంటైర్‌లో రెండేళ్ళ క్రితం ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే చిసోమో లీఫాకు ఓ మంచి ఆలోచన వచ్చింది. వీటితో కళాఖండాలను తయారు చేయాలని వచ్చిన ఆలోచనను కార్యరూపంలోకి మార్చారు. వన్య ప్రాణులు వేటగాళ్ళ చేతుల్లో బలైపోతుండటాన్ని చూసి, చలించిపోయిన లీఫా తాను సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలతో జంతువుల బొమ్మలను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. రంగులు, వార్నిష్ వేసి తయారు చేసిన ఈ బొమ్మలను అమ్మడం ప్రారంభించారు. వీటికి మంచి ఆదరణ లభిస్తోందని సంతోషిస్తున్నారు. ఆయన తయారు చేసిన కళాఖండాలను లిలోంగ్వేలో ప్రముఖ ఆర్ట్ స్పేస్ ఫోర్ సీజన్స్ గార్డెన్ సెంటర్‌లో ప్రదర్శించారు. కొన్ని కళాఖండాలను విక్రయించారు. 


పెరూలో...

పెరూలో రెండు సమస్యలు ఉన్నాయి. అవి ఏమిటంటే... ప్లాస్టిక్ వ్యర్థాలు, కూరగాయల పెంపకానికి స్థలం లేకపోవడం. వీటిని పరిష్కరించేందుకు తమకు ఓ మంచి ఆలోచన వచ్చిందని శాంటియాగో డీ సుర్కోలోని పర్యావరణ ప్రాజెక్టుల అధిపతి క్రిస్ కోర్టెజ్ చెప్పారు. వృథాగా పడి ఉండే ప్లాస్టిక్ సీసాల్లో మట్టిని నింపి, ఆకు కూరలు, కేరట్ వంటి కూరగాయలను పండించడం ప్రారంభించామన్నారు. ఈ సీసాలను ఒకదానిపై మరొకదానిని పెట్టి, తక్కువ స్థలంలో ఎక్కువ కూరగాయలను పండిస్తున్నామన్నారు. ఎకలాజికల్ పార్క్‌లో 700 మీటర్ల గోడపై 2,20,000 రీయూజ్డ్ ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఉపయోగించి వీటిని పండిస్తున్నట్లు తెలిపారు.  ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకోవచ్చునని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కొన్ని కూరగాయలను విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. 


కెన్యాలో...

కెన్యాలో ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసే ప్రాజెక్టుకు కృషి చేసిన డ్యాన్సర్ న్జంబి మాటీని అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆమె ప్లాస్టిక్ వ్యర్థాలతో బిల్డింగ్ మెటీరియల్స్‌ను తయారు చేస్తున్నారు. కెన్యన్ ఎన్విరాన్‌మెంటలిస్ట్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ప్రొఫెసర్ వాంగరి మాథాయి నుంచి ఆమె ప్రేరణ పొందారు. 


Updated Date - 2022-06-04T01:53:08+05:30 IST