‘ప్లాస్టిక్‌’తో పండగే

ABN , First Publish Date - 2022-08-13T07:09:49+05:30 IST

అధికారం అండతో ప్రతి దాంట్లో అడ్డగోలుగా కాసుల వేట సాగిస్తున్న జిల్లాలో కొందరు అధికారపార్టీ నేతలు చివరకు ప్లాస్టిక్‌ను వదల్లేదు. దీని నుంచి కూడా లక్షలకు లక్షల మామూళ్లు పిండేస్తున్నారు. కొద్ది రోజులుగా రెండుచేతులా సంపాదిస్తున్నారు. ఇదేంటి ప్లాస్టిక్‌ నుంచి ఏమొస్తుంది అనుకుంటున్నారా.. అయితే తప్పులో కాలేసినట్లే.. ఇక్కడే సదరు అధికార పార్టీ నేతలు తెలివి ప్రదర్శించారు.

‘ప్లాస్టిక్‌’తో పండగే

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)/శంఖవరం:

అధికారం అండతో ప్రతి దాంట్లో అడ్డగోలుగా కాసుల వేట సాగిస్తున్న జిల్లాలో కొందరు అధికారపార్టీ నేతలు చివరకు ప్లాస్టిక్‌ను వదల్లేదు. దీని నుంచి కూడా లక్షలకు లక్షల మామూళ్లు పిండేస్తున్నారు. కొద్ది రోజులుగా రెండుచేతులా సంపాదిస్తున్నారు. ఇదేంటి ప్లాస్టిక్‌ నుంచి ఏమొస్తుంది అనుకుంటున్నారా.. అయితే తప్పులో కాలేసినట్లే.. ఇక్కడే సదరు అధికార పార్టీ నేతలు తెలివి ప్రదర్శించారు. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధం అమల్లోకి రాగా, అప్పటికే జిల్లాలో తుని, ప్రత్తిపాడు, కాకినాడలో కొందరు బడా హోల్‌సేల్‌ వ్యాపారులవద్ద రూ.7.50 కోట్లకు పైగా విలువైన ప్లాస్టిక్‌ కవర్లు, సంచులు, బ్యాగులు, ప్లేట్లు, గ్లాసులు ఉండిపోయాయి. నిషేధంతో నేపథ్యంలో ఈ సరుకు డీలర్లు, ఒప్పంద దుకాణాలకు ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో వ్యాపారులతో చేతులు కలిపిన సదరు నేతలు స్టాకు అయిపోయేవరకు అమ్ముకునేలా సహకరించడానికి ముందుకు వచ్చారు. ముఖ్యంగా తుని కేంద్రంగా కీలక నేత భారీగా డబ్బులు పుచ్చుకుని దాడులనేవే లేకుండా ఆశీస్సులు అందించారు. ఇది చూసి మిగిలిన బడా వ్యాపారులూ సదరు నేత వద్దకు క్యూ కడుతున్నారు.



దాడులతో భయం భయం

జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధానికి రాజకీయ గ్రహణం పట్టింది. జూలై 1నుంచి దేశవ్యాప్తంగా కేంద్రం ప్లాస్టిక్‌ను నిషేధించింది. ఎక్కడా ప్లాస్టిక్‌ సంచులు, బ్యాగులు, ఒక్కసారి వాడి పడేసే ఇతర ప్లాస్టిక్‌ వస్తువులేవీ వినియోగించ వద్దని ఆదేశాలు జారీ చేసింది. తీరా జిల్లాలో మాత్రం ప్లాస్టిక్‌ నిషేధం నవ్వులపావుతోంది. అధికారపార్టీకి చెందిన కొందరు నేతలు అడ్డగోలుగా ఈ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. కొందరు అధికా రులు దీనికి వంత పాడుతుండడంతో నిషేధం విమర్శల పాలవుతోంది. దీంతో ఇప్పుడు జిల్లాలో ప్రధాన పట్టణాలనుంచి గ్రామీణ ప్రాంతాల వరకు యథేచ్ఛ గా ప్లాస్టిక్‌ వినియోగం జరిగిపోతోంది. వాస్తవానికి జూలై 1 నుంచి నిషేధం అమల్లోకి రావడంతో ఎక్క డికక్కడ కార్పొరేషన్‌, మున్సిపాల్టీలతోపాటు పంచా యతీల పరిధిలోను ప్లాస్టిక్‌ వాడకంపై అధికారులు జరినామా విధిస్తున్నారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న సింగిల్‌ యూజర్‌ కవర్లను తయా రు చేయడం, విక్రయించడం, వినియోగించడం నిషేధంలోకి రావడంతో తనిఖీలకోసం జిల్లాలో అధికారులు ప్రత్యేక బృందా లను ఏర్పాటు చేయించి కొన్నిరోజులుగా దాడులు చేయిస్తున్నారు. అందు లో భాగంగా ఇటీవల తునినుంచి కత్తిపూడి, ప్రత్తిపాడువైపుగా లక్షల్లో ప్లాస్టిక్‌ కవర్లు రవాణా అవుతున్నట్లు అధికారులకు సమాచారం రాగా దాడులు చేసి పట్టుకున్నారు. సదరు వ్యాపారికి రూ.30వేల జరినామా విధించడంతోపాటు ఓ దుకాణాన్ని సీజ్‌ చేశారు. దీంతో ప్లాస్టిక్‌ రవాణాపై భయం పెరిగి కొద్దిరోజులు వ్యాపారం ఆగిపోయింది. దీంతో నిషేధం నాటికి తమ చేతిలో కోట్లలో సరుకు ఉండిపోయిన వ్యాపారులు తలపట్టుకున్నారు. గోదాముల్లో సరుకు డీలర్లు, అక్కడి నుంచి చిన్నచిన్న దుకాణాలు, కిరాణాషా పులు, హోటళ్లకు రవాణా ఆగిపోవడంతో విలవిల్లాడారు. కోట్లలో తెచిపెట్టుకున్న సరుకు అలాగే ఉండిపోతే ఆర్థికంగా నష్టపోతామనే భయంతో తాజాగా కొత్త ఎత్తు వేశారు. 



కీలక నేతలకు కాసులే కాసులు

ఎక్కడికక్కడ కట్టడి పెరగడం, గోదా ముల్లో సరుకు కోట్లలో ఉండిపోవడంతో తుని కీలక నేత వద్దకు ఇటీవల కొంద రు వ్యాపారులు వెళ్లారు. గోదాముల్లో ఉన్న సరుకు పూర్తిగా అమ్ముడుపోయే వరకు అధికారులు చూసీచూడనట్లు ఆ దేశాలు ఇవ్వాలంటూ సదరు కీలక నేత ను వేడుకున్నారు. ఇందుకోసం రూ.25 లక్షలకుపైగా బేరం కుదుర్చుకున్నారు. దీంతో అధికారులనుంచి దాడుల భయం లేకుండా వ్యాపారం చేసుకునేందుకు సదరు నేత ఆశీస్సులు ఇచ్చేశారు. అదే సమయంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ నేతకు సదరు వ్యాపారులు రూ.3లక్షలు చెల్లించుకున్నారు. ఈశాఖ పరిధిలోకి వచ్చే కొందరు కీలక అధికా రులకూ చదివింపులు జరిగిపో యాయి. ముఖ్యంగా తునిలో ఓ బడా హోల్‌సేల్‌ ప్లాస్టిక్‌ కవర్ల వ్యాపారివద్ద కోట్లలో సరుకు ఉండిపోయింది. ఆయన కింద 46మంది డీలర్లు ఉన్నారు. వీరందరికీ కవర్లు, కప్పులు, ప్లేట్లు, గ్లాసుల రవాణా ఆగిపోయింది. దీంతో కోట్లలో సరుకు వదిలించుకునేందుకు లక్షల్లో ముడుపులు చెల్లించారు. ఆయన ద్వారా ప్రత్తిపాడు, కాకినాడలోని బడా వ్యాపారులు సైతం సదరు కీలకనేతను ఇటీవల ప్రసన్నం చేసుకుని భారీగానే చదివించుకున్నారు. ఈ విషయం తెలిసి జిల్లాలో మరికొందరు వ్యాపారులు సైతం కీలకనేతను కలిసి సరుకు అయ్యే వరకు చల్లని చూపులు చూడాలంటూ క్యూ కడుతున్నారు.  ఇలా ప్లాస్టిక్‌ నిషేధం సదరు నేతకు కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఆయన అనుచరులు, స్థానిక ఎమ్మెల్యేల అనుచరులు ఇప్పుడు వ్యాపారులతో లాలూచీ పడి వసూళ్లు పెంచారు. ఈ నేపథ్యంలో పేరుకు ప్లాస్టిక్‌ నిషేధం ఉన్నా జిల్లాలో ఎక్కడికక్కడ కిరాణా దుకాణాలనుంచి చికెన్‌షాపులు, మార్కెట్ల వరకు ఎంచక్కా ప్లాస్టిక్‌ కవర్లు, కప్పులు, ప్లేట్లు, చెంచాలు, గ్లాసులు వివిరిగా దొరుకుతున్నాయి.

Updated Date - 2022-08-13T07:09:49+05:30 IST