గ్రామాల్లో ఆటస్థలాలు

ABN , First Publish Date - 2022-05-26T05:58:26+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో వసతులు లేక ప్రతిభావంతమైన క్రీడాకారులు సైతం ముందుకు వెళ్లలేకపోతున్నారు.

గ్రామాల్లో ఆటస్థలాలు
గ్రామాల్లో ఆటస్థలాలు

- గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు కసరత్తు

- అనువైన స్థలాల గుర్తింపు కోసం తహసీల్దార్లకు ఆదేశాలు 

- జిల్లాలో 267 గ్రామాల్లో 245 స్థలాలు గుర్తింపు 

- జూన్‌ 2న అవతరణ దినోత్సవం రోజున క్రీడా మైదానాల శంకు స్థాపనకు ఏర్పాట్లు 

- క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

గ్రామీణ ప్రాంతాల్లో వసతులు లేక ప్రతిభావంతమైన క్రీడాకారులు సైతం ముందుకు వెళ్లలేకపోతున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతీ పల్లెలోనూ తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసే విధంగా స్థలాలు గుర్తించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అనువైన స్థలాలు గుర్తించడానికి తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించారు. జూన్‌ 2 వరకే మైదానాలకు శంకుస్థాపన చేయడానికి అధికారులు నిమగ్నమయ్యారు. కనీసం మండలానికి రెండు మైదానాలైనా సిద్ధం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాలకు కలిపి 267 గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 245 క్రీడామైదానాలను గుర్తించారు. ప్రస్థుతం పాఠశాలలకు అనుబంధంగా ఉన్న స్థలాలతో పాటు కొత్తగా మైదానాలకు స్థలాలను గుర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థలాల కొరత తీవ్రంగానే ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో తప్ప బయట క్రీడామైదానాలు, ఆడిటోరియాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడంతో చాలా గ్రామాల్లో క్రీడాకారులు నిరుత్సాహ పడుతున్నారు. కొవిడ్‌ కారణంగా పాఠశాలలు మూసి ఉంచడంతో గతంలో ఉన్న క్రీడా మైదానాల్లో గడ్డి, పిచ్చి మొక్కలు మొలిచి ఉపయోగించుకునే వీలులేకుండా పోయింది. ప్రస్థుత ప్రభుత్వ నిర్ణయంతో మళ్లీ బాగుపడే అవకాశాలు ముందుకు వచ్చాయి. గ్రామీణ క్రీడాకారుల్లో దాగిన ప్రతిభను వెలికితీయడానికి క్రీడామైదానాలు దోహదపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 

- శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి.. 

జిల్లాలో క్రీడా మైదానాలను శాశ్వత ప్రతిపాదికన పూర్తి స్తాయిలో క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా ఎంపిక చేస్తున్నారు. గ్రామాల్లో కనీసం ఎకరం స్థలంలో క్రీడా మైదానం ఉండే విధంగా చూస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించినప్పటికీ స్థలాల కొరత సమస్యగా ఉంది. పల్లె ప్రగతిలో శాశ్వత ప్రతిపాదికన పనులు చేపట్టినట్టుగానే క్రీడా మైదానాలను కూడా అభివృద్ధి పరిచే విధంగా ఆదేశాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో అనువైన స్థలాలను గుర్తించిన తరువాత వాటిని అభివృద్ధి పర్చుకోవడానికి ఉపాధి నిధులను వాడుకోనున్నారు. ఉపాధిహామీ కూలీలతో మైదానం చుట్టూ మొక్కలు నాటేలా, మొరం నింపే విధంగా చర్యలు చేపట్టనున్నారు. గ్రామాల్లో వాలీబాల్‌, కబడ్డీ వంటి ఆటలపై ఆసక్తి ఎక్కువగా చూపుతున్నారు. వీటికి అనుగుణంగా వసతుల కల్పించి గ్రామీణ క్రీడాకారులను ప్రొత్సహించాలని భావిస్తున్నారు. 


- క్రీడా ప్రాంగణాలు సిద్ధం చేయాలి: కలెక్టర్‌

రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2 నాటికి ప్రతీ మండలంలో కనీసం రెండు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించుకునే విధంగా సిద్ధం చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అదేశించారు. క్రీడా ప్రాంగణాల్లో లైటింగ్‌, నీటి సదుపాయం, బెంచీలు, టాయిలెట్‌లు, ప్రాంగణం చుట్టూ బయో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. క్రీడా ప్రాంగణంలో ఉపాధి హామీ నిధులతో వాలీబాల్‌కోర్టు, ఖోఖో, కబడ్డీ, ఇతర క్రీడలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. 


Updated Date - 2022-05-26T05:58:26+05:30 IST