ఆట‘విడుపు’

ABN , First Publish Date - 2021-07-19T05:43:00+05:30 IST

కరోనా మహమ్మారి క్రీడారంగాన్ని అస్తవ్యస్తం చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మెరికల్లాంటి క్రీడాకారుల ప్రతిభ మసకబారిపోతోంది. వరుసగా రెండేళ్లుగా క్రీడాకారులకు గడ్డు కాలమే సాగుతోంది. క్రీడాకారులు సాధనకు దూరమై ఫిట్‌నెస్‌ కోల్పోతున్నారు. వ్యయ, ప్రయాసలకోర్చి చేసిన కసరత్తులు.. కొవిడ్‌ ప్రభావంతో వృథా అవుతున్నాయి. బాలలకు శిక్షణ కార్యక్రమాలు లేకపోవడంతో ఇంటికే పరిమితమవుతున్నారు. మరో సంవత్సరం ఇదే పరిస్థితి కొనసాగితే క్రీడారంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదముందని క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడాపోటీల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

ఆట‘విడుపు’

కరోనాతో కుదేలైన క్రీడారంగం
ఆటలకు దూరమైన క్రీడాకారులు
అటకెక్కిన క్రీడా పోటీలు
బోసిపోతున్న మైదానాలు
వేసవి శిక్షణ శిబిరాలకు బ్రేక్‌
క్రీడా పాఠశాలల్లో నిలిచిన ప్రవేశాలు
ఉమ్మడి జిల్లాలో సంక్షోభంలో స్పోర్ట్స్‌


కరోనా మహమ్మారి క్రీడారంగాన్ని అస్తవ్యస్తం చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మెరికల్లాంటి క్రీడాకారుల ప్రతిభ మసకబారిపోతోంది. వరుసగా రెండేళ్లుగా క్రీడాకారులకు గడ్డు కాలమే సాగుతోంది. క్రీడాకారులు సాధనకు దూరమై ఫిట్‌నెస్‌ కోల్పోతున్నారు. వ్యయ, ప్రయాసలకోర్చి చేసిన కసరత్తులు.. కొవిడ్‌ ప్రభావంతో వృథా అవుతున్నాయి. బాలలకు శిక్షణ కార్యక్రమాలు లేకపోవడంతో ఇంటికే పరిమితమవుతున్నారు. మరో సంవత్సరం ఇదే పరిస్థితి కొనసాగితే క్రీడారంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదముందని క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడాపోటీల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.  

హన్మకొండ, ఆంధ్రజ్యోతి

కరోనా, లాక్‌డౌన్‌తో రెండేళ్లుగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని క్రీడామైదానాలన్నీ బోసిపోయాయి. ఆంక్షలు సడలించడంతో క్రీడాకారులు ఇప్పుడిప్పుడే మైదానాలకు వస్తున్నా ము నుపటి ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు. కనీసం స్వతహాగా సాధన చేసుకునే ఉత్సాహం కూడా తగ్గిపోయింది. వివిధస్థాయి పోటీల్లో రాణిస్తున్న వారికి శిక్షణ కార్యక్రమాలు కరువై ప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశం కోల్పోతున్నారు. కొవిడ్‌ సడలింపుతో అన్నిస్థాయిల్లో విద్యార్థులు చదువుల్లోకి అడుగుపెడుతుండగా, అలాంటి అవకాశం తమకు లేదని క్రీడాకారులు వాపోతున్నారు. అంతర్జాతీయ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని క్రీడలే భవిష్యత్తు అని నమ్మి సాధన చేస్తున్న వారు అయోమయానికి గురవుతున్నారు.

అటకెక్కిన క్రీడా పోటీలు
అండర్‌ 14, 19 విభాగాల్లో ప్రతిభ చూపాలనుకున్న వా రికి ఆ అవకాశం దాటిపోయింది. అండర్‌ -19 జూనియర్‌ కళాశాల విభాగం, డిగ్రీ స్థాయిలో జరిగే విశ్వవిద్యాలయ క్రీడ ల్లో పాల్గొనేందుకు సిద్ధమైన వారికి అవకాశాలు జారిపోయాయి. వయసు పెరగడంతో ఛాన్స్‌ లేకుండాపోయింది. ఫిట్‌నెస్‌ పరంగా డీలా పడ్డారు. వచ్చే ఏడు, ఆ తర్వాత కూడా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నారు. ఇక విశ్వవిద్యాలయాల క్రీడా పోటీల ఊసే లే కుండా పోయింది. అంతర్‌ విశ్వవిద్యాలయాల కీడా పోటీలను నిర్వహించడం లేదు. కేయూ ఆధ్వర్యంలో గతేడాదిగా పోటీలు జరగడం లేదు. అంతర్‌ ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌, డిగ్రీ కళాశాలల పక్షాన జరగాల్సిన పోటీలు ఏనాడో అటకెక్కాయి. జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఏటా నిర్వహించే ఖేలో ఇండియా పోటీలు గత సంవత్సరం రద్దయ్యాయి. ఒలంపిక్‌ సంఘం గుర్తింపు గల క్రీడా సంఘాలు జిల్లాలో 50వరకు ఉన్నాయి. వీటిలోని చాలా సంఘాలు ఉమ్మడి జిల్లాలో పలు వయస్సు విభాగాల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ గల వారిని రాష్ట్రస్థాయికి పంపించేవి. కనీసం ఏటా 2,500 మందికిపైగా క్రీడాకారులు వీటిలో పాల్గొనేవారు. గత విద్యా సంవత్సరంలో ఎలాంటి పోటీలు జరగలేదు.

నిలిచిన శిక్షణ శిబిరాలు
కొవిడ్‌ లాక్‌డౌన్‌తో ఉమ్మడి జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు బ్రేక్‌ పడింది. జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో పదుల సంఖ్యలో నెల రోజుల పాటు నిర్వహించే శిబిరాలు పిల్లలతో సందడిగా కనిపించేవి. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో రెండేళ్ల కిందటి వరకు జరిగిన వేసవి శిబిరాలకు 3,500 మందికిపైగా బాలలు హాజరై పలు క్రీడాంశాల్లో శిక్షణ పొందేవారు. రెండేళ్లుగా వేసవి శిబిరాలు రద్దు కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు నిరాశకు లోనయ్యారు.  

ప్రవేశాలకు బ్రేక్‌
రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ హన్మకొండ జేఎన్‌ఎ్‌స స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ క్రీడా పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలను కరోనాతో జరపలేదు. నాలుగో తరగతిలో రాష్ట్రవ్యాప్తంగా 40 మంది ప్రతిభ గల విద్యార్థులకు ఇందులో ప్రవేశాలను కల్పిస్తారు. గతేడాది ప్రవేశాలకు ఎంపిక పోటీలను నిర్వహించలేదు. ఈ ఏడాది కూడా వాటిని నిర్వహిస్తారనే దానిపై అధికారుల్లో స్పష్టత లేదు. విద్యార్థులు లేక ఈ క్రీడా పాఠశాల వెలవెలబోతోంది. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల కోసం జనవరిలో పాఠశాలను తెరిచినా కరోనా కారణంగా తిరిగి మూసివేశారు.

ఏదీ ఆ వైభవం..
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలలు 6,500 వరకు ఉన్నాయి. ఏటా 4వేల మంది వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో జరిగే పాఠశాలస్థాయి క్రీడల్లో పొల్గొంటున్నారు. అండర్‌ 14, 17, 19 విభాగాల్లో  పాఠశాల, జూనియర్‌ కళాశాల విద్యార్థులకు ఏటా 80 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతుంటాయి. రెండేళ్లుగా వీరంతా ఆటకు దూరమయ్యారు. ఉమ్మడి జిల్లాలో క్రీడాకారులు కనీసం 40కిపైగా అంశాల్లో పాల్గొంటారు. కొత్త జిల్లాల పరిధిలో, అలాగే జోన్‌ స్థాయి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతుంటాయి. ఏటా వీటిలో 10వేల మందికిపైగా క్రీడాకారులు హాజరవుతారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు 3,500 మందికి వరకు విద్యార్థులు హాజరవుతుండగా వారిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు సుమారు 300 నుంచి 400 మంది వరకు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుంటారు. ఆయా పోటీల్లో పలు పతకాలను సాధిస్తున్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ఎలాంటి పోటీలు లేని కారణంగా మెజారిటీ సంఖ్యలో క్రీడాకారులు అవకాశాలు కోల్పోయారు.

ఆటలకు దూరమవుతున్నారు..
- సారంగపాణి, రాష్ట్ర అథ్లెటిక్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి

ఏడాదికిపైగా పోటీలు, శిక్షణలు లేక విద్యార్థులు మైదానాలకు దూరమయ్యారు. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో కాస్త పరిస్థితులు మెరుగవడంతో అథ్లెటిక్‌ పోటీలు నిర్వహించి ప్రతిభ గల క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశాం. కానీ కరోనా సెకండ్‌వేవ్‌లో మళ్లీ  విజృంభించడంతో క్రీడా పోటీలకు బ్రేక్‌ పడింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థులు, క్రీడాకారులు మానసికంగా, శారీరకంగా బలహీనులవుతారు. క్రీడారంగాన్ని సంక్షోభం నుంచి బయట పడేయడానికి ప్రభుత్వ ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలి.

త్వరలో క్రీడారంగానికి పూర్వవైభవం
- అశోక్‌, జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా

కరోనా మహమ్మారి ఉమ్మడి జిల్లాలో క్రీడారంగాన్ని దెబ్బతీసింది. పోటీలు, శిక్షణలు లేక క్రీడాకారులు నిరాశలో ఉన్నారు. ప్రతిభగల క్రీడాకారులు క్రీడా కోటను నష్టపోతున్నారు. వేసవి శిబిరాలతో ఎందో ఔత్సాహికులు వెలుగులోకి వచ్చేవారు. మళ్లీ పూర్వవైభవం రావడానికికొంత సమయం పడుతుంది. కరోనా పరిస్థితిని కూడా క్రీడాస్పూర్తితో స్వీకరించి భవిష్యత్తు విజయాలపై క్రీడాకారులు దృష్టి సారించాలి. అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

క్రీడాకారులకు సడలింపు ఇవ్వాలి
 - ఎం. శ్రీకాంత్‌ నాయక్‌, అథ్లెట్‌, హన్మకొండ

కరోనా వల్ల క్రీడాకారులకు తీవ్ర నష్టం జరుగుతోంది. రెండేళ్లుగా ఆటలకు దూరంగా ఉంటున్నాం. శిక్షణ లేదు. పోటీలు లేవు. దీంతో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో  పతకాలు గెలుచుకునే అవకాశాలు లేకుండాపోయాయి. క్రీడా కోటాలో ఉద్యోగాలు పొందే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. భౌతికదూరం పాటిస్తూ క్రీడాకారులు పాల్గొనేలా క్రీడా పోటీలను తిరిగి నిర్వహించాలి. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా సడలింపు ఇచ్చినట్టు క్రీడా కోటా విషయంలో క్రీడాకారులకు కూడా వయసులో సడలింపు ఇవ్వాలి. 

Updated Date - 2021-07-19T05:43:00+05:30 IST