పండుగల్లో హింసపై ఎన్ఐఏ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2022-04-18T22:41:55+05:30 IST

శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చెలరేగిన ..

పండుగల్లో హింసపై ఎన్ఐఏ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ: శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చెలరేగిన మత ఘర్షణలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టులో సోమవారంనాడు ఒక పిటిషన్ దాఖలైంది. న్యాయవాది వినీత్ జిందాల్ ఈ పిటిషన్ వేశారు. ఊరేగింపుల్లో భక్తులపై కాల్పులు, రాళ్లురువ్వడం, వాహనాలను ధ్వంసం చేయడం, మత ఉద్రిక్తతలు సృష్టించడం వంటివి దేశ సౌరభౌమత్యానికి ముప్పని ఆ పిటిషన్‌లో జిందాల్ అన్నారు. ఏడు రాష్ట్రాల్లో వరుస దాడుల ఘటనలు ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని, దేశంలోని హిందువులను లక్షంగా చేసుకున్నట్టు కనిపిస్తోందని, ఐఎస్ఐఎస్, ఇతర జాతివ్యతిరేక, అంతర్జాతీయ సంస్థల ప్రమేయంతో అల్లర్లు సృష్టించేందుకు టెర్రర్ ఫండింగ్‌ జరుగుతోందనే అభిప్రాయాలకు తావిస్తోందని పిటిషనర్ పేర్కొ్న్నారు.


హనుమాన్ జయంతి, రామనవమి వంటి శుభసందర్భాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో మత ఘర్షణలు జరగడం తనను బాధించినట్టు పిటిషనర్ అన్నారు. ''ఏప్రిల్ 16న జహింగీర్‌పూర్‌లో హనుమాన్ జయంతి వేడుకల్లో  ఘర్షణలు చెలరేగాయి. దీనికి ముందు రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు, జేఎన్‌యూ క్యాంపస్‌లో ప్రశాంతంగా జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భక్తులపై దాడులు జరిగాయి'' అని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్‌లపై విచారణను ఎన్ఐఏకు అప్పగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వాలని కోరారు.


కాగా, ఢిల్లీలోని జహంగీర్‌పురి అల్లర్లను సుమోటోగా స్వీకరించాలంటూ సీజేఐ ఎన్‌వీ రమణను కోరుతూ న్యాయవాది అమృత్ పాల్ సింగ్ ఖల్సా ఒక లెటర్ పిటిషన్ కూడా వేశారు. ఇంతవరకూ జరిగిన ఢిల్లీ పోలీసుల విచారణ పాక్షికంగా, కమ్యూనల్‌గా, అల్లర్లను రెచ్చగొట్టిన వారిని నేరుగా కాపాడే విధంగా ఉన్నట్టు అమృత్ పాల్ సింగ్ ఖల్తా అన్నారు. 2020 అల్లర్లలో ఢిల్లీ పోలీసుల పాత్ర ప్రజలపై పోలీసులపై ఉన్న నమ్మకాన్ని తగ్గించిందని ఆయన అభిప్రాయపడ్డారు. జహంగీర్‌పురి అల్లర్లపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి సారథ్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని లెటర్ పిటిషన్‌లో అమృత్ పాల్ సింగ్ ఖల్సా కోరారు.

Updated Date - 2022-04-18T22:41:55+05:30 IST