జైలుకెళ్లి రండి ప్లీజ్‌!

Published: Sun, 21 Mar 2021 01:05:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జైలుకెళ్లి రండి ప్లీజ్‌!

ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి హిట్‌ లిస్ట్‌లో ఉన్నవారందరూ స్వచ్ఛందంగా జైలుకు వెళ్లి వారి వారి వీలును బట్టి కొన్ని రోజులు ఉండి రండి (పనిలో పనిగా తన లిస్టులో ఉన్న వారి పేర్లు జగన్‌ ప్రకటించినా ఫరవాలేదు)... ఇది జరిగే వరకు ముఖ్యమంత్రికి మనఃశాంతి లభించేలా కనిపించడం లేదు. పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న జగన్‌రెడ్డి అభివృద్ధి గురించి మర్చిపోయి ప్రత్యర్థులను కేసులలో ఇరికించి జైలుకు పంపడం పైనే దృష్టి సారిస్తున్నందున ఇటువంటి విజ్ఞప్తి చేయవలసి వస్తున్నది. హిట్‌ లిస్ట్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు మొదటగా ఉన్నందున జైలుకెళ్లే విషయంలో ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. చంద్రబాబు జైలుకు వెళ్లేవరకు జగన్‌రెడ్డి శాంతించే అవకాశం కనిపించడం లేదు. తాను పదహారు నెలల పాటు జైలుకు వెళ్లి గడపాల్సి రావడానికి కారణం చంద్రబాబు అన్న అభిప్రాయానికి వచ్చిన జగన్‌రెడ్డి, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయనపైనే దృష్టి కేంద్రీకరించినందున రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా చంద్రబాబు కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం. అలా జరగనంత వరకు సీఐడీ అధికారులు ఏదో ఒక కేసు నమోదు చేయడం, దానిపై చంద్రబాబు కోర్టులను ఆశ్రయించవలసి రావడం జరుగుతూనే ఉంటుంది. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆదేశాలు రావడమే తరువాయి సీఐడీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం, హైకోర్టు తప్పుబట్టడం నిత్యకృత్యం అయింది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌ పరువు పోతోంది. మునిసిపల్‌ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు నమోదు చేసుకున్న తర్వాత జగన్‌రెడ్డి తన దృష్టిని చంద్రబాబుపైనే కేంద్రీకరించారు. ఈ క్రమంలో ఆయన అనేక దుష్ట సంప్రదాయాలకు తెర తీస్తున్నారు. ఏ నేరానికి సంబంధించిన అంశంలోనైనా లాభపడింది ఎవరు? నష్టం జరిగింది ఎవరికి? అన్నది ప్రాథమిక సూత్రం! రాజధాని అమరావతి కోసం చేపట్టిన భూ సమీకరణలో భాగంగా అసైన్డ్‌ భూములు సేకరించడం కోసం జారీ చేసిన 41 నంబర్‌ జీవోను తప్పుబడుతూ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ జీవో వల్ల లాభపడింది ఎవరు? నష్టపోయింది ఎవరు? ఫిర్యాదు చేసింది ఎవరు? అన్నవి కీలక ప్రశ్నలు. దళితులకు గతంలో కేటాయించిన అసైన్డ్‌ భూములను చంద్రబాబు వగైరాలు తమ బినామీలతో కొనిపించి ఆ తర్వాత 41వ నంబర్‌ జీవో జారీ చేశారన్నది అధికార పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు సారాంశం. పోలీసు శాఖలో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టులు ఉన్నట్టుగానే వైసీపీలో చంద్రబాబు అండ్‌ కోపై కేసులు వేయడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి అండ్‌ కో ఉన్నారు. 41వ నంబర్‌ జీవో వల్ల తమకు నష్టం జరిగిందని తన నియోజకవర్గానికి చెందిన దళితులు తన వద్ద వాపోయారని ఆళ్ల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కొంతమంది ఎవరో తెలియదు. ఊరూ పేరూ లేనివారి తరపున థర్డ్‌ పార్టీ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయవచ్చా? అలా అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి నిర్ణయం వల్ల తమకు నష్టం జరిగిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు పెడతారా? సంక్షేమ రాజ్యంలో ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. వాటి వల్ల అయాచితంగా లబ్ధి పొందిన వారు ఎవరో నిర్ధారించకుండా కేసులు పెట్టుకుంటూ పోతే అధికార యంత్రాంగం పనిచేయగలదా? స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలదా? రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగితే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఫలానా వర్గానికి నష్టం చేశారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాని మీద కేసు పెట్టి ఆయనను లోపల వేయవచ్చునా? ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న దుష్ట సంప్రదాయాల వల్ల భవిష్యత్తులో ఇలాంటి విపరిణామాలే చోటుచేసుకుంటాయి. ప్రత్యర్థులను ఏయే కేసులలో ఇరికించవచ్చునన్నది శోధించడమే జగన్‌ ప్రభుత్వం దినచర్యగా ఉన్నది. అమరావతి కోసం పైసా ఖర్చు లేకుండా దాదాపు 30 వేల ఎకరాలను సమీకరించడం ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా జరిగిందని గతంలో పలువురు ప్రశంసించారు. చంద్రబాబు ఆ పని చేశారు కనుక ఆయనను ప్రశంసించడానికి జగన్‌ అండ్‌ కోకు మనసు రాకపోవడంలో ఆశ్చర్యపోవాల్సింది లేదు. అందుకే రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరిట భూ కుంభకోణం జరిగిందన్న ప్రచారాన్ని ఎత్తుకున్నారు.


ఇన్‌సైడర్‌ ట్రేడింగా మీ మొహమా? అని హైకోర్టు చీవాట్లు పెట్టినా జగన్‌ అండ్‌ కో తమ ప్రచారాన్ని మానుకోలేదు. మొత్తానికి అమరావతిని విజయవంతంగా నాశనం చేశారు. ఫలితంగా నిజంగానే రాజధాని గురించి ముందుగానే తెలిసి అక్కడ ఎవరైనా భూములు కొని ఉంటే ఇప్పుడు జగన్‌ ప్రభుత్వ చర్యల కారణంగా వారు కూడా నిండా మునిగారు కదా? ఇంకెందుకీ ప్రచారం? ఏ దళితులైతే నష్టపోయారని ఇప్పుడు కేసులు పెట్టారో, ఆ దళితులు కూడా జగన్‌ నిర్ణయాల వల్ల నష్టపోయారు. ఇంకెవరి కోసం ఈ కేసులు? ఎటు తిరిగి ఎటు చూసినా చంద్రబాబునాయుడే కనిపిస్తున్నారు. అదేమిటో గానీ తాత రాజారెడ్డిని చంపింది సతీష్‌ రెడ్డి అని అప్పటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చిన జగన్‌రెడ్డి... ఇప్పుడు అదే సతీష్‌ రెడ్డిని తనవైపు మళ్లించుకోవడం ద్వారా ఔదార్యాన్ని ప్రదర్శించారు. తండ్రి రాజశేఖర్‌ రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడానికి ముకేశ్‌ అంబానీ కారణమని నిందించిన నోటితోనే ఆయనకు సాదర స్వాగతం పలికి అడిగిందే తడవుగా పరిమళ్‌ నత్వానీకి రాజ్యసభ సభ్వత్వం కల్పించి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. సొంత బాబాయిని బాత్రూంలో గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపిన కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని న్యాయస్థానానికి నివేదించడం ద్వారా పెద్దమనసు చాటుకున్నారు. తనపైనే దాడికి తెగబడిన కోడి కత్తి కేసును కూడా మర్చిపోయారు. ఇంత విశాల దృక్పథాన్ని ప్రదర్శించిన జగన్‌ రెడ్డి తన ప్రత్యర్థి చంద్రబాబు అండ్‌ కో విషయంలో మాత్రం శాంతించడం లేదు. మునిసిపల్‌ ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించడానికి ప్రజలు తన విధానాలను ఆమోదించడమే కారణమని భావిస్తున్న కారణంగా జగన్‌రెడ్డి ఇప్పుడు మళ్లీ చంద్రబాబుపై దృష్టిసారించారు. స్థానిక ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచినంత మాత్రాన అది బలుపు కాదు వాపు మాత్రమేనని గత అనుభవాలు మనకు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడాన్ని ఇలాగే అభివర్ణించారు. నంద్యాలలో గెలుపు తన విజయమని చంద్రబాబు భావిస్తే ఆయనకంటే మూర్ఖుడు ప్రపంచంలోనే ఉండడని అప్పట్లో జగన్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నందున ప్రజలు భయపడి ఆయన ఇచ్చిన డబ్బు తీసుకొని ఓటు వేశారని నిందించారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీని ఓడించినంత మాత్రాన చంద్రబాబు అధికారం నుంచి దిగిపోరని తెలుసు గనుకే ప్రజలు భయపడి ఓట్లు వేశారని జగన్‌ అప్పట్లో ఆరోపించారు. ఇప్పుడు మునిసిపల్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించానని చెప్పుకొంటున్న జగన్‌రెడ్డికి ఈ మాటలు గుర్తుండకపోవచ్చు.


తెలంగాణలో కూడా ఒకటి రెండు మున్సిపాలిటీలు మినహా మిగతా వాటన్నింటినీ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకుంది. ఇప్పుడు అదే టీఆర్‌ఎస్‌ ఎటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదో చూస్తున్నాం. మునిసిపల్‌ ఎన్నికల్లో జగన్‌ పార్టీ ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడిందో అందరికీ తెలిసిందే. పోలీసు అధికారులే స్వయంగా రంగంలోకి దిగి ప్రతిపక్షాల అభ్యర్థులను బెదిరించడం, అధికార పార్టీకి మద్దతు ఇవ్వడానికి నిరాకరించిన వారిని వేధించడం చూశాం. అధికారంలో ఉన్న పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడటం సహజం. అయితే ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరించింది. దాదాపు 30 వేల మెజారిటీతో నంద్యాలలో గెలిచిన తెలుగుదేశం.. సాధారణ ఎన్నికల్లో అదే 30 వేల మెజారిటీతో ఓడిపోయింది. కాకినాడ నగర పాలక సంస్థలో 85 శాతం డివిజన్లు గెలుచుకున్న తెలుగుదేశం.. శాసనసభ ఎన్నికల్లో రెండు స్థానాలను కోల్పోయింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు నిజంగా తమకు ఏ మేరకు అనుకూలంగా ఉన్నాయో జగన్‌కు తెలుసో లేదో తెలియదు గానీ వైసీపీ నాయకులకు మాత్రం తెలుసు. జగన్‌రెడ్డి ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటారు. గతంలో ఆయన చెప్పినట్టుగా ఆ విషయం ఆయనకు తెలియదా? చంద్రబాబుకే భయపడిన వాళ్లు జగన్‌కు భయపడరా? అయినా అధికార పార్టీ నాయకులు ముఖ్యమంత్రిని సంతృప్తిపరచడం కోసం రంకెలు వేస్తున్నారు. సొంత జిల్లాలో, సొంత పార్టీలోనే ఉక్కపోతను ఎదుర్కొంటూ తరచుగా కన్నీళ్లు పెట్టుకుంటున్న రోజా మరో అడుగు ముందుకేసి తెలుగుదేశం పార్టీని పాత సామాను తరహాలో ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాలని హేళన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా లభించలేదు. ఆ తర్వాత పదేళ్లు గడిచేసరికి అదే కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. విజయాలను చూసి మురిసిపోతున్నవారు చరిత్ర తెలుసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు కొందరు ఇలాగే నోరుపారేసుకున్నారు. ఒకప్పుడు లోక్‌సభలో రెండంటే రెండు సీట్లకే పరిమితమైన భారతీయ జనతాపార్టీ ఇప్పుడు అత్యంత బలమైన పార్టీగా విరాజిల్లుతున్నది కదా! అప్పుడు తెలుగుదేశం పార్టీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం గమనార్హం.


తెలుగుదేశం నేర్వాల్సిన పాఠాలెన్నో!

ఈ విషయం అలా ఉంచితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల నుంచి తెలుగుదేశం పార్టీ గానీ, ఆ పార్టీ అధినేత గానీ నేర్చుకోవలసిన పాఠాలు ఉన్నాయా? అన్న అంశాన్ని చూద్దాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు పార్టీని, రాజకీయాలను పూర్తిగా విస్మరించడం వల్ల ప్రస్తుత దుస్థితి దాపురించింది. మునిసిపల్‌ ఎన్నికల్లో ఓటమికి కారణాలు అన్వేషించి విరుగుడు చర్యలకు ఉపక్రమించకుండా ప్రజలను నిందించే దుస్సాహసానికి కొంత మంది నాయకులు తెగబడ్డారు. రాజకీయ పార్టీల అధినేతలపై, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలపై పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అభిమానం, గౌరవం అయినా ఉండాలి లేదా భయం ఉండాలి. చంద్రబాబు విషయంలో తెలుగుదేశం శ్రేణులకు ఈ రెండూ లేవు. ఉండివుంటే ఎన్నికల ప్రచార సమయంలో విజయవాడలో కేశినేని నాని, ఆయనతో విభేదిస్తున్న బొండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా వంటి వారు అలా బజారుకెక్కి ఉండేవారు కారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు కూడా మునిసిపల్‌ ఎన్నికల్లో చేతులెత్తేశారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ మోస్ట్‌ నాయకుడైన యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునిలో వైసీపీకి దాదాపు 78 శాతం ఓట్లు లభించాయంటే అందుకు ఎవరు కారణం? అధికారంలో ఉన్నప్పుడు హోం మంత్రిగా పనిచేసిన చినరాజప్ప సొంత నియోజకవర్గం పెద్దాపురంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. తెలుగుదేశం నాయకులు గట్టిగా నిలబడి పోరాడిన మునిసిపాలిటీలలో ఓట్‌ షేరింగ్‌ వేరే రకంగా ఉంది. గుంటూరు నగర పాలక సంస్థలో ‘‘మాకు ఒక పది డివిజన్లు వదిలేయండి. మిగతాచోట్ల మేం బలహీనులనే పోటీకి పెడతాం’’ అని తెలుగుదేశం నాయకులే అధికార పార్టీ వారితో రాజీ కుదుర్చుకోవడం నిజం కాదా? పోటీ చేసిన పది డివిజన్లలో తొమ్మిది గెలుచుకోలేదా? నిలబడి కొట్లాడవలసిన వాళ్లు లాలూచీ పడుతుంటే ప్రజలు తెలుసుకోలేరా? తన తరఫున ప్రజలే పోరాడాలని కోరుకోవడం ఏమిటి? అధికార పార్టీ నుంచి తమకు వేధింపులు ఎదురుకాకుండా నాయకులు రాజీ పడుతుంటే కార్యకర్తలు మాత్రం సర్వం ఒడ్డి పోరాటం చేయాలని కోరడం ఏమి న్యాయం? విశాఖపట్నంలో నాయకుల వైఫల్యం, లాలూచీ కారణంగానే నగర పాలక సంస్థ చేజారింది. ఓటేయడానికి విశాఖ వాసులు సిద్ధంగా ఉన్నప్పటికీ వారిలో భరోసా కల్పించే నాయకుడు ఏడి? ఇవన్నీ వదిలేసి జనసేన పార్టీ ఓట్లు చీల్చడం వల్లే ఓడిపోయామని చెప్పడం ఆత్మవంచన కాదా? అలాంటప్పుడు 30 డివిజన్లు ఎలా గెలుచుకోగలిగారు? తూర్పుగోదావరి జిల్లాలో రెండు మూడు మునిసిపాలిటీల్లో మాత్రమే జనసేనకు గణనీయంగా ఓట్లు లభించాయి. తుని మునిసిపాలిటీలో ఆ పార్టీకి కేవలం 500 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా అక్కడ 20 శాతం ఓట్లు కూడా పొందలేకపోవడం తెలుగుదేశం నాయకుల వైఫల్యం కాదా? ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. తప్పులన్నీ నాయకుల వైపే ఉన్నాయనడానికి కూడా లేదు. అధినేత చంద్రబాబు వైపు కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. అధినేత బలంగా ఉంటేనే ఏ ప్రాంతీయ పార్టీ అయినా బలంగా ఉంటుంది. కష్టకాలంలో పార్టీని నిలబెట్టడానికి చంద్రబాబు పడుతున్న శ్రమను అభినందించాల్సిందే. అయితే ఆ పరిస్థితికి తానెంతవరకు కారణమో చంద్రబాబు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. కీలక సమయాల్లో పార్టీ అధినేత తమకు అండగా ఉంటారన్న నమ్మకం ఆయనపై పార్టీ నాయకులకు లేదనే చెప్పవచ్చు. మరో రకంగా చెప్పుకొంటే తనపై నమ్మకం లేకుండా ఆయనే చేసుకున్నారు. పార్టీ కోసం చొక్కాలు చించుకొని పనిచేసినా కీలక సమయంలో పక్కనపెట్టరన్న గ్యారంటీ లేదని పలువురు నాయకులు వాపోతూ ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో అంతులేని తాత్సారం చేయడమే కాకుండా తప్పు చేసిన వారిపైన, పార్టీకి నష్టం చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించడంలో కూడా చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తుంటారు. దీంతో బలమైన నాయకులు కూడా తెగబడి పనిచేయడానికి జంకుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర్‌ రెడ్డి తన అనుచరుడైన గౌరు వెంకటరెడ్డిని జైలుకు వెళ్లి మరీ పరామర్శించారు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న వారిని పరామర్శించే సాహసం చంద్రబాబు చేయగలరా? ఆనాడు రాజశేఖర్‌ రెడ్డి చేసిన పని వల్ల నమ్ముకున్న వాళ్ల కోసం ఆయన ఎంత వరకైనా వెళతారన్న పేరొచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంతెందుకు, జగన్‌ రెడ్డి విషయమే తీసుకుందాం. కేంద్రంలో అధికారం చలాయిస్తూ అత్యంత బలమైన నాయకురాలిగా చలామణి అవుతున్న సోనియాగాంధీని ధిక్కరించి సొంత పార్టీ పెట్టుకొని జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడని కారణంగానే జగన్‌కు జనంలో క్రేజ్‌ ఏర్పడింది. గతంతో పోల్చితే ఇప్పుడు రాజకీయాల్లో కొలమానాలు మారిపోయాయి. చంద్రబాబు ఇంకా పాత విధానాలను, విలువలను పట్టుకొని వేలాడుతున్నారు. ఒకప్పుడు వాహినీ వారి చిత్రాలలో పెద్దమనుషుల రూపంలో విలనిజం చూశాం. ఇప్పుడు భయంకరమైన విలన్‌ పాత్రలు పోషించేవారికి అదే స్థాయిలో క్రేజ్‌ ఉంటోంది. ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు మారిపోయాయి. నాయకులు ఆ మేరకు మారకపోతే కనుమరుగవుతారు. ఇప్పుడు చంద్రబాబు ప్రదర్శించాల్సింది దృఢత్వం. ఎన్టీఆర్‌ వేసిన పునాది పుణ్యమా అని తెలుగుదేశం పార్టీ దాదాపు నాలుగు దశాబ్దాలు నిలబడింది. ఇప్పటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఆ పునాదులను పటిష్ఠం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటే మరో మూడు నాలుగు దశాబ్దాల పాటు పార్టీ నిలబడుతుంది. పార్టీ గురించి ఆలోచించని వారినీ, తనపట్ల కనీసం గౌరవం కూడా లేనివారిని ఇంకెంత కాలం మోస్తారు? పార్టీకి ఇప్పుడు కొత్త రక్తం అవసరం. చంద్రబాబు నాయకత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోలేదు. రాజకీయాలను విస్మరించిన కారణంగానే తనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారాన్ని ఆయన పట్టించుకోలేదు. ఫలితంగా ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా ఆయనపై కుల ముద్ర వేయగలిగారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సైకాలజీని అర్థం చేసుకోవడంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో జరిగే సాధారణ ఎన్నికలకు గీటురాయి కాదు. జయలలిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలే కాదు, ఉప ఎన్నికల్లో కూడా పోటీ చెయ్యలేదు. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం నాయకులు ఆత్మపరిశీలన చేసుకొని తమను తాము సరిదిద్దుకోవడం తక్షణ అవసరం. వాడుకుని వదిలేస్తారు అన్న అపవాదు మోసుకుంటూ గడిపే నాయకులకు ఒడిదుడుకులు తప్పవు. తెలుగుదేశం పార్టీ నాయకులు పై నుంచి కింది వరకు లోపాలను సరిదిద్దుకొని కలసికట్టుగా ముందుకు వెళితే భవిష్యత్తు ఉండకపోదు!

ఆర్కే

జైలుకెళ్లి రండి ప్లీజ్‌!

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.