డ్రెయిన్లు ఆధునీకరిస్తేనే సాగు చేస్తాం

ABN , First Publish Date - 2022-07-07T05:57:30+05:30 IST

డ్రెయిన్లు ఆధునీకరిస్తేనే సాగు చేస్తాం

డ్రెయిన్లు ఆధునీకరిస్తేనే సాగు చేస్తాం
ఆర్డీవో దాసిరాజుతో చర్చిస్తున్న రైతులు

ఆర్డీవోకు తేల్చి చెప్పిన రైతులు
నరసాపురం రూరల్‌, జూలై 6: ‘మురుగు కాల్వలను అధునీ కరించకపోవడం వల్ల నాలుగేళ్ల నుంచి సార్వా పంట ఊడ్వలేకపోతున్నాం. అధికారులకు సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదు. కనీసం మీరైనా పరిష్కారం చూపించాలి. డ్రెయిన్లలో పూడిక తీయకపోతే పంట విరామం ప్రకటిస్తాం.’ అని ఆర్డీవో దాసిరాజు వద్ద రైతులు అవేదన వ్యక్తం చేశారు. బుధవారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి విచ్చేసిన ఆర్డీవోను చిట్టవరం, రుస్తుంబాద, సరిపల్లి, చినమామిడిపల్లి, లిఖితపూడి, సీతారాంపురం గ్రామాల రైతులు కలిశారు. డ్రెయిన్లలో మురుగు పారుదల కాక ఇబ్బంది పడుతున్నామన్నారు. ఆర్డీవో రైతులతో కలిసి నడుస్తూ 3 కిలోమీటర్ల మేర రుస్తుంబాద, సరిపల్లి, నత్తలావ డ్రెయిన్లను పరిశీలించారు. ఆక్రమణలు,  చెత్తా, చెదారం ఉండటాన్ని గుర్తించారు. ‘రుస్తుంబాద, నత్తలావ డ్రెయిన్లు మురుగు లాగకపోవడం వల్ల 3వేల ఎకరాలు ముంపు బారినపడుతున్నాయి. దీంతో ఏటా  పంట వదులుకోవాల్సి వస్తుంది.’ అని ఆర్డీవో వద్ద రైతులు ఏకరువు పెట్టారు. ఆర్డీవో ఇరిగేషన్‌ అధికారులతో చర్చించారు. తక్షణమే డ్రెయిన్ల ఆక్రమణలు, చెత్తా, చెదారాన్ని తొలగించి రైతులు సాగు చేసుకునేలా పనులు చేపట్టాలని అదేశించారు. కంచర్ల నాగేశ్వరరావు, యడ్లపల్లి అర్జునుడు, వెంకటేష్‌, నాగబాబు, ఎస్‌.వెం కయ్యనాయుడు, మామాజీ, గన్నాబత్తుల బాబ్జీ, చిన్ని, కాకిలేటి మధు పాల్గొన్నారు.



Updated Date - 2022-07-07T05:57:30+05:30 IST