దిగుమతి సుంకాన్ని తగ్గించండి : కేంద్రానికి టెస్లా వినతి

ABN , First Publish Date - 2021-07-24T01:40:05+05:30 IST

టెస్లా విద్యుత్తు వాహనాల(ఈవీ)పై దిగుమతి సుంకాలను భారీగా తగ్గించాలని కోరుతూ టెస్లా ఇంక్ భారత మంత్రిత్వ శాఖలకు లేఖ రాసింది.

దిగుమతి సుంకాన్ని తగ్గించండి : కేంద్రానికి టెస్లా వినతి

న్యూయార్క్ : టెస్లా విద్యుత్తు వాహనాల(ఈవీ)పై దిగుమతి సుంకాలను భారీగా తగ్గించాలని కోరుతూ టెస్లా ఇంక్ భారత మంత్రిత్వ శాఖలకు లేఖ రాసింది. దిగుమతి సుంకాలను తగ్గిస్తే డిమాండ్ పెరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, స్థానికంగా ఉత్పత్తుల తయారీని పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఆయా పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులపై అధిక దిగుమతి పన్నులను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం విధించింది. గతంలో కూడా ఇతర లగ్జరీ ఆటోమేకర్లు దిగుమతి చేసుకున్న కార్లపై పన్నులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.


భారతదేశంలో ఈ ఏడాది నుంచి అమ్మకాలను ప్రారంభించాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. మంత్రిత్వ శాఖలకు నీతి ఆయోగ్ రాసిన లేఖలో టెస్లా విద్యుత్తు కార్ల దిగుమతులపై ఫెడరల్ పన్నులను 40 శాతానికి తగ్గించడం సముచితంగా ఉంటుందని పేర్కొంది. టెస్లా యూఎస్ పోర్టల్ ప్రకారం మోడల్ 3 స్టాండర్డ్ రేంజ్ ప్లస్ మోడల్ ధర 40 వేల డాలర్లకంటే తక్కువగా ఉంది. టెస్లా కంపెనీ ఈ ఏడాది జనవరిలో... బెంగళూరులో స్థానికంగా ఓ  కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-07-24T01:40:05+05:30 IST