ఆహ్లాదం.. ఆనందం.. ఆతిథ్యం

ABN , First Publish Date - 2021-10-10T04:58:23+05:30 IST

పాలమూరు.. పర్యాటకులను ఆకర్షిస్తోంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఏర్పాటు చేసిన కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కు(మయూరి పార్కు) రా రమ్మని పిలుస్తోంది. పచ్చని వాతావరణంలో పక్షుల కిలకిలారావాలు, మయూర విహారాలు, పల్లె సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దిన ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి.

ఆహ్లాదం.. ఆనందం.. ఆతిథ్యం
జిప్‌ సైక్లింగ్‌

పర్యాటకులను ఆకర్షిస్తున్న కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కు

ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచీ రాక

అడ్వెంచర్‌ జోన్‌, రెయిన్‌ ఫాల్స్‌, బోటింగ్‌ ప్రత్యేకం

50 అడుగుల ఎత్తులో రెపరెపలాడుతున్న జాతీయ జెండా

రోజంతా బస చేసేలా కాటేజ్‌ సౌకర్యం

కరోనాతో తగ్గిన సందర్శకులు

ఇప్పుడిప్పుడే పెరుగుతున్న తాకిడి


పాలమూరు.. పర్యాటకులను ఆకర్షిస్తోంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఏర్పాటు చేసిన కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కు(మయూరి పార్కు) రా రమ్మని పిలుస్తోంది. పచ్చని వాతావరణంలో పక్షుల కిలకిలారావాలు, మయూర విహారాలు, పల్లె సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దిన ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. నక్షత్ర వనం, పూల వనం, హంసల కొలను, కరెన్సీ, బటర్‌ఫ్లై, చిల్డ్రన్స్‌, రెయిన్‌ పార్క్‌లు, అడ్వెంచర్‌ జోన్‌, బోటింగ్‌, కృత్రిమ వాటర్‌ ఫాల్స్‌ వినోదాన్ని పంచుతున్నాయి. 2,087 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ పార్కు మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ కృషి, అధికార యంత్రాంగం చొరవతో దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ పార్కు గురించి అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ మరోసారి మాట్లాడటంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

- మహబూబ్‌నగర్‌ 


ఒకప్పుడు పాలమూరు ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సేదతీరాలంటే ఒక్కటంటే ఒక్క పార్కు కూడా లేకపోయింది. ఇప్పుడు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఏర్పాటు చేసిన అర్బన్‌ ఎకో పార్క్‌ ఉమ్మడి పాలమూరు జిల్లాకే తలమానికంగా మారింది. ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి సందర్శకులు తరలొస్తున్నారు. ఐదేళ్ల కిందటి వరకు ఇక్కడ అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీ మాత్రమే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీనివాస్‌గౌడ్‌ ఈ పార్కుపై దృష్టి పెట్టారు. అటవీశాఖ అధికారులతో చర్చించి, ఇక్కడ విశాలమైన అర్బన్‌ లంగ్స్‌ఫేస్‌ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐదేళ్లుగా అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. రోజు రోజుకు పర్యాటకులకు కొత్తదనం పంచేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పార్క్‌లలో ఉండే ప్రత్యేక ఆకర్శనలను ఇక్కడ ఏర్పాటు చేశారు.


ఎప్పటికప్పుడు కొత్తదనం

పార్క్‌కు వచ్చే సందర్శకులను ఆకట్టుకు నేందుకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని పంచుతున్నారు. ఒకసారి వచ్చిపోయిన తరువాత మళ్లీ వస్తే ఏదో ఒకటి కొత్తగా కనిపించేలా, ఆకట్టుకునేలా పార్కును తీర్చిదిద్దుతున్నారు. ముందుగా ప్రవేశ ద్వారాన్ని జంతువుల ప్రతిమలతో ఆకర్షణీయంగా తీర్చిదిదారు. బటర్‌ఫ్లై పార్క్‌, గులాబి వనం, చిల్డ్రన్‌ పార్క్‌, డైనోసార్‌, చింపాంజి, జింక ప్రతిమలను ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి ఉట్టిపడేలా ఉన్న ఎద్దుల బండిని, చేదురు బావి ఆకట్టుకుంటున్నాయి. తరువాత కెనాన్‌ వాక్‌, విజ్ఞానాన్ని పెంపొందిం చేందుకు కరెన్సీ, హె ర్బల్‌ పార్క్‌ చేశారు. పార్కులో 25 దేశాలకు చెందిన కరెన్సీ నోట్ల గుర్తులను బోర్డులలో ఏర్పాటు చేశారు. వ్యాయామం కోసం ఓపెన్‌ జిమ్‌, యోగా కేంద్రం, ట్రెక్కింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. హంసల కొలను, మకావ్‌ పక్షులు, ఏడడుగుల ఎత్తున్న ఆస్ట్రిచ్‌ పక్షులు ఏర్పాటు చేయగా ఆకట్టుకుంటున్నాయి. ఆరోగ్యాన్ని పంచేం దుకు రాశి, నక్షత్ర వనాలను ఏర్పాటు చేశారు. 12 రాశుల మొక్కలు, 27 నక్షత్ర వనాలు ఉన్నాయి. పార్క్‌లో కొండపై 50 అడుగుల ఎత్తులో జాతీయ జెండా రెపరెపలాడుతోంది. రోడ్డుపై నుంచి వెళ్లే వారికి 350 అడుగుల ఎత్తులో పాల మూరుకు వచ్చిపోయే వారికి కనిపించేలా జెండాను ఏర్పాటు చేశారు.


ఎండల్లో హాయ్‌.. హాయ్‌..

మండె వేసవిలో అర్బన్‌పార్క్‌ చల్లటి వినోదాన్ని ఇస్తోంది. ఇక్కడ దట్టమైన అడవిలో రెయిన్‌గన్‌లతో కృత్రిమ వర్షాన్ని కురిపిస్తారు. మండు వేసవిలో ఈ 8 రెయిన్‌ గన్‌ల తుంపరలో తడిస్తే అంతకన్నా హాయి మరోటి ఉండదు. కృత్రిమ వాటర్‌ ఫాల్స్‌ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కొండపై నుంచి జాలువారుతున్న వాటర్‌ ఫాల్స్‌ దగ్గర చిన్నాపెద్దా తేడా లేకుండా అంతా ఎంజాయ్‌ చేస్తున్నారు. రోజంతా చూసినా పార్క్‌ అందాలు ఇంకా మిస్‌ అవుతున్నామని ఫీల్‌ అయ్యేవారి కోసం నైట్‌ షెల్టర్‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. 10 టెంట్‌లలో ఫ్యామిలీలు బస చేసేలా సౌకర్యం కల్పించారు. రోజంతా టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌, స్నాక్స్‌, టీ ఆస్వాదిస్తూ, పార్క్‌లో ఉన్న అందాలను చూయించేందుకు గాను ఒక్కొక్కరికి రోజుకు రూ.1,500 ప్యాకేజీగా నిర్ణయించారు. 


హైలెట్‌గా అడ్వెంచర్‌ జోన్‌

ఛత్తీస్‌ఘడ్‌ నుంచి నిపుణులను తీసుకొచ్చి అడ్వెంచర్‌ జోన్‌(సాహసక్రీడ)ను ఏర్పాటు చేశారు. ఒక కొండ నుంచి మరో కొండపైకి రోప్‌ ద్వారా వెళ్లే జిప్‌ లైన్‌, రెండు రోప్‌లు సైకిల్‌ను బ్యాలెన్స్‌ చేసే జిప్‌ సైకిల్‌ ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి. చిన్న పిల్లలతో పాటు యువత ఎక్కువగా ఈ విన్యా సాలకు ఆకర్శితులవుతున్నారు. అదేవిధంగా టైర్‌ వంతెన, ఎదురు వంతెన, టైర్‌లు ఎక్కడం వంటి విన్యాసాలెన్నో ఉన్నాయి. 


మళ్లీ పూర్వ వైభవం

కరోనాకు ముందు పార్క్‌ నిత్యం సందర్శకులతో కిటకిటలాడేది. కరోనా తరు వాత సందర్శకుల తాకిడి తగ్గిపోయింది. అంతకుముందు సెలవు వస్తే పార్కుకు 1,000 నుంచి 1,500 వందల మంది పర్యాటకులు వచ్చేవారు. ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి ప్రత్యేక బస్సులో విహార యాత్రగా ఇక్కడికి వచ్చేవారు. కరోనాతో పర్యాటకులు తగ్గిపోగా, ఇప్పుడిప్పుడే తాకిడి మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం దసరా సెలవులు రావడంతో జనం నెమ్మెదిగా వస్తున్నారు. తొందరలోనే మళ్లీ పూర్వ వైభవం వస్తుందని అటవీశాఖ అధికారి గంగారెడ్డి తెలిపారు.


దేశంలోనే అద్భుత పార్క్‌ను చేస్తాం 

ఈ కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్క్‌ను దేశం లోనే అద్భుత మైన పార్క్‌గా తీర్చిదిద్దు తాం. ఇప్పటికే ఎంతో అభివృద్ది చేయగా, చేయాల్సినవి చాలా ఉన్నాయి. 2,087 ఎక రాల్లో దేశంలోనే అతిపెద్ద పార్క్‌గా దీనిని ఏర్పాటు చేశాం. జిల్లాతోపాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు రెండ్రోజుల పాటు పాలమూరులోని పర్యాటక క్షేత్రాలను తిలకించేలా అభివృద్ధి చేస్తాం. 

- రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌















Updated Date - 2021-10-10T04:58:23+05:30 IST