ప్లాట్ల విక్రయానికి పాట్లు!

ABN , First Publish Date - 2022-05-28T07:04:10+05:30 IST

‘చౌక ధరలో సొంత ఇంటి స్థలం’ పేరుతో జనం నుంచి వందల కోట్ల రూపాయలు దండుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం జిల్లాలో బెడిసి కొడుతోంది.

ప్లాట్ల విక్రయానికి పాట్లు!
ఆనందపురం మండలంలోని పాలవలసలో సేకరించిన భూమి

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో ఎంఐజీ ప్లాట్లకు 500 కూడా దాటని దరఖాస్తులు

27తో ముగిసిన దరఖాస్తు గడువు

మళ్లీ పొడిగించాలని అధికారుల యోచన

లేఅవుట్లలో కనిపించని అభివృద్ధి పనులు 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


‘చౌక ధరలో సొంత ఇంటి స్థలం’ పేరుతో జనం నుంచి వందల కోట్ల రూపాయలు దండుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం జిల్లాలో బెడిసి కొడుతోంది. మధ్య తరగతి ప్రజలకు మార్కెట్‌ ధర కంటే తక్కువకు ఇంటి స్థలం అందిస్తామని ప్రకటించి, ‘ఎంఐజీ ప్లాట్లు-జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌’ పేరుతో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ద్వారా 2,300 ప్లాట్లకు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆనందపురం మండలంలోని పాలవలస, రామవరం, గంగసాని అగ్రహారాల్లో నాలుగు లేఅవుట్లు వేసి, వాటిలో 150, 200, 240 గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని ప్రకటించారు. పాలవలసలో గజం రూ.18 వేలు, రామవరం, గంగసాని అగ్రహారాల్లో రూ.14 వేలు చొప్పున ధర నిర్ణయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 28న ప్రకటన జారీచేశారు. ఏడాదికి రూ.18 లక్షలలోపు ఆదాయం కలిగిన ఎవరైనా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చునని, ఎక్కువ దరఖాస్తులు వస్తే...లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా 20 శాతం ప్లాట్లు ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించామని, వారికి ధరలో 10 శాతం రాయితీ కూడా ఇస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి మే 27వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అది కాస్త శుక్రవారం సాయంత్రంతో ముగిసిపోయింది. 


కనిపించని స్పందన 

దరఖాస్తు గడువు ముగియడంతో వీఎంఆర్‌డీఏ అధికారులను సంప్రతించగా, నాలుగు లేఅవుట్ల పరిధిలో 500 వరకు దరఖాస్తులు వచ్చాయని సమాధానమిచ్చారు. మొత్తం ప్లాట్లు 2,300 కాగా వచ్చిన దరఖాస్తులు అందులో ఐదో వంతు మాత్రమే. అధికారులు ఊహించిన స్పందన కనిపించకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి లేఖ రాసి, అనుమతి తీసుకుంటామని ఉన్నతాధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.


ముందస్తు దోపిడీకి యత్నం

వీఎంఆర్‌డీఏ లేదా ఏ ఇతర ప్రైవేటు సంస్థ గాని ప్లాట్లు విక్రయించాలంటే.. ముందు లేఅవుట్‌ వేసి, అందులో మౌలిక వసతులన్నీ కల్పించి, వినియోగదారులకు చూపించి, అమ్మకానికి ప్రయత్నిస్తాయి. ఇప్పటివరకు ఇదే పద్ధతి అమలవుతోంది. అయితే ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌-ఎంఐజీ ప్లాట్ల’ విషయంలో అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రైతుల నుంచి భూములు సమీకరించి, వాటిలో లేఅవుట్లు వేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు కనీసం తుప్పలు కూడా తొలగించలేదు. పత్రికల్లో ప్రకటనలు చూసి, అక్కడికి వెళ్లిన వారికి లేఅవుట్‌ ఆనవాళ్లే కనిపించడం లేదు. పైగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అక్కడి మార్కెట్‌ ధరల కంటే రెట్టింపు ఉన్నాయనే విషయం బహిర్గతమైంది. ఏ అభివృద్ధి చేయకుండానే ప్లాట్లను అమ్మేసి, డబ్బు లాగేయాలని ప్రణాళిక రూపొందించిన విషయం అర్థమవడంతో స్పందన లేకుండా పోయింది. 


పది శాతం నిబంధనపై అసహనం  

దరఖాస్తుతో పాటు ప్లాటు విలువలో పది శాతం ధరావత్తు చెల్లించాలన్నది నిబంధన. అంటే పాలవలసలో 150 గజాల స్థలం తీసుకోవాలనుకుంటే...గజం రూ.18 వేలు చొప్పున రూ.27 లక్షలు అవుతుంది. అందులో పది శాతం అంటే రూ 2.7 లక్షలు దరఖాస్తుతో పాటు చెల్లించాలి. ప్లాటు కేటాయించిన నెల రోజులకు మరో 30 శాతం కట్టాలి. అంటే నెల రోజుల్లోనే రూ.11 లక్షల వరకు కట్టాలి. పోనీ ఇంత చెల్లించినా అక్కడేమైనా పనులు చేస్తారా? అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రకటన ఇచ్చాక కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో జనంలో అనుమానాలు మొదలయ్యాయి. ‘వైఎస్‌ఆర్‌ రాజీవ్‌ స్వగృహ’లా చేతికి స్థలం అందకుండా పోతుందేమోననే భయం చాలామందిలో నెలకొంది. దీంతో ప్లాట్లు కొనాలనే కోరిక ఉన్నా ఈ పథకానికి దూరంగా ఉండిపోయామని చెబుతున్నారు. 


రూ.600 కోట్ల సమీకరణకు యత్నాలు 

ఈ పథకం ద్వారా ఆనందపురం మండలంలోని నాలుగు లేఅవుట్లు ద్వారా రూ.600 కోట్లు సమీకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం లేఅవుట్లు ప్రతిపాదించిన ప్రాంతాల పరిసరాల్లో ఇతర ప్రైవేటు లేఅవుట్లు లేవని, గ్రామాలకు కూడా దూరంగా ఉన్నాయని, ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంత ధర చెల్లించి ప్లాట్లు తీసుకోవడంపై సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-05-28T07:04:10+05:30 IST