నాసెన భూముల్లో నాగళ్లు

ABN , First Publish Date - 2021-06-17T06:17:14+05:30 IST

కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గతంలో కేటాయించిన భూముల్లో రైతులు ప్రవేశించారు. పరిహారం, పునరావాసం కల్పించలేదని నిరసిస్తూ నాగళ్లతో కూడిన ట్రాక్టర్లను వినియోగించి సెజ్‌ భూములను దుక్కి చేశారు.

నాసెన భూముల్లో నాగళ్లు
నాగళ్లతో కూడిన ట్రాక్టర్లను వినియోగించి సెజ్‌ భూముల దుక్కి

-ఎర్ర జెండాలతో ప్రవేశించిన రైతులు, సీపీఎం, రైతు సంఘాలు 

-పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్‌


సోమందేపల్లి(గోరంట్ల), జూన 16: కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గతంలో కేటాయించిన భూముల్లో రైతులు ప్రవేశించారు. పరిహారం, పునరావాసం కల్పించలేదని నిరసిస్తూ నాగళ్లతో కూడిన ట్రాక్టర్లను వినియోగించి సెజ్‌ భూములను దుక్కి చేశారు. సోమందేపల్లి మండలం కావేటి నాగేపల్లికి చెందిన రైతులు సీపీఎం, రైతు సంఘాల నాయకులతో కలసి పాలసముద్రం సమీపంలోని నాసెన పరిశ్రమ సేకరించిన తమ పొలాల్లో బుధవారం ఎర్రజెండాలు పాతి ప్రవేశించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి పెద్దన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌లు పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులకు అండగా నిలిచారు. గోరంట్ల, సోమందేపల్లి మండలాల్లో నాసెన, బెల్‌ పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం రైతుల నుండి భూములను సేకరించింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించకుండా ప్రభుత్వం రైతులపై కేసులుపెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తుందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. దీంతో వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 31మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. నాలుగు వారాల్లో 31 మంది రైతులకు భూమికి నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని ఫిబ్రవరిలోనే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీచేసిందన్నారు. అయితే ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం తీర్పును ఉల్లంఘిస్తోందని వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజకీయ నాయకులు, అధికారులు సైతం ఈ వ్యవహారంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ దళారులను ప్రోత్సహించిందన్నారు. హైకోర్టు తీర్పు వెలువడి నాలుగు నెలలు గడుస్తున్నా స్పందించకపోవడంతో సీపీఎం వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో అనివార్య పరిస్థితుల్లో తమ భూముల్లో రైతులు ప్రవేశించి ఎర్రజెండాలు పాతి ట్రాక్టర్‌తో దున్నారు. 15 రోజుల్లో నాసెనవారు వచ్చి పరిహారం చెల్లిస్తూ పునరావాసం కల్పిచాలని కోరారు. లేదంటే తమ భూములతోపాటు నాసెన స్వాధీనం చేసుకున్న భూములను గోడలు బద్దలుకొట్టి ప్రవేశిస్తామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కావేటి నాగేపల్లికి చెందిన రైతులు అశ్వర్థరెడ్డి, శంకర్‌రెడ్డి, రామాంజినరెడ్డి, అనీల్‌, ఆదిలక్ష్మమ్మ, నాగలక్ష్మమ్మ, రామాంజినమ్మ, అమ్మోజి, వెంకటలక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు. నాసెన కంపెనీ అధికారి శ్రీకాంతరెడ్డి, పోలీసులకు ఫిర్యాదు చేయగా సోమందేపల్లి ఎస్‌ఐ వెంకటరమణ అక్కడికి చేరుకుని కార్మిక సంఘాల నాయకులు, రైతులతో చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులను రైతులకు జరిగిన అన్యాయాన్ని ఎస్‌ఐ కి నాయకులు వివరించారు.


Updated Date - 2021-06-17T06:17:14+05:30 IST