బాలికలే టాపర్స్‌

ABN , First Publish Date - 2022-06-28T14:35:43+05:30 IST

రాష్ట్రంలో సోమవారం విడుదలైన ప్లస్‌-1 పబ్లిక్‌ పరీక్షా ఫలితాల్లో కూడా అమ్మాయిలు టాప్‌ లేపారు. బాలికలు అధికంగా ఉత్తీర్ణత సాధించారు. చెన్నై,

బాలికలే టాపర్స్‌

- ఫ్లస్‌-1 పరీక్షా ఫలితాలు విడుదల

- 90.7 శాతం ఉత్తీర్ణత

- పెరంబలూరు జిల్లా ఫస్ట్‌


చెన్నై, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సోమవారం విడుదలైన  ప్లస్‌-1 పబ్లిక్‌ పరీక్షా ఫలితాల్లో కూడా అమ్మాయిలు టాప్‌ లేపారు. బాలికలు అధికంగా ఉత్తీర్ణత సాధించారు. చెన్నై, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలలో 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్లస్‌-1 పబ్లిక్‌ పరీక్షలు   మేలో నిర్వహించగా 8,83,882 మంది హాజరయ్యారు. వీరిలో 4,33,684 మంది బాలురు, 4.50,198 మంది బాలికలున్నారు. రాష్ట్రంలో 8.43,319 మంది పరీక్షలకు హాజరుకాగా 7,59,856 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 4,11,612 మంది బాలికలు,3,48,243 మంది బాలురున్నారు. రాష్ట్రంలో గతేడాది ఈ పరీక్షల్లో 96.04 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈ యేడాది 90.07 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షా ఫలితాలు సోమవారం ఉదయం www.tnresults.nic.in, www.dge.tn.gov.in అనే వెబ్‌సైట్లలో విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లోనూ బాలుర కంటే బాలికలే అధికంగా పాసయ్యారు. పరీక్ష రాసినవారిలో బాలికలు 94.99 శాతం, బాలురు 84.6 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రస్థాయిలో 95.56 శాతం ఉత్తీర్ణత సాధించిన పెరంబలూరు జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. 95.44 శాతం ఉత్తీర్ణతతో విరుదునగర్‌ జిల్లా, 95.25 శాతంతో మదురై జిల్లా ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 83.27 శాతం మంది, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 91.65 శాతం మంది, ప్రైవేటు పాఠశాలల్లో 99.35 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలకు వివిధ కారణాల వల్ల 41,376 మంది విద్యార్థులు హాజరుకాలేదని పాఠశాలల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ పరీక్షల్లో 187 మంది 591 మార్కుల కంటే అధికంగా మార్కులు సంపాదించుకున్నారు. 


చెన్నై స్కూళ్లలో 77.54 శాతం ఉత్తీర్ణత...

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పాఠశాలల్లో 77.54 శాతం మంది ప్లస్‌వన్‌ ఉత్తీర్ణత సాధించారు. నగరంలోని 32 కార్పొరేషన్‌ మహోన్నత పాఠశాలల్లో 3166 మంది బాలులురు, 3507 మంది బాలికలు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2070 మంది బాలురు, 3104 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. 95.41 శాతం ఉత్తీర్ణతతో నగరంలోని బుల్లా అవెన్యూ కార్పొరేషన్‌ బాలికల పాఠశాల ప్రథమస్థానంలో నిలిచింది. 94.50 శాతంతో నుంగంబాక్కం బాలికల మహోన్నతపాఠశాల ద్వితీయ స్థానం, 93.31 శాతం ఉత్తీర్ణతతో మార్కెట్‌ వీధి బాలికల మహోన్నత పాఠశాల తృతీయ స్థానంలో నిలిచాయి.


ఆగస్టులో ఇన్‌స్టెంట్‌ పరీక్షలు...

ప్లస్‌-1 పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలైనవారికి ఆగస్టులో ఇన్‌స్టెంట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు విద్యార్థులు తాము చదివిన పాఠశాలల ద్వారా ఈ నెల 29 నుంచి జూలై ఆరో తేదీవరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పరీక్షలు జరిగే తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు.

Updated Date - 2022-06-28T14:35:43+05:30 IST