ప్లస్‌ సైజ్‌ మోడల్‌!

ABN , First Publish Date - 2021-09-08T05:30:00+05:30 IST

ఊబకాయులను ఆత్మన్యూనతకు గురి చేసే బాడీ షేమింగ్‌ క్రమేపీ తగ్గుతూ, బాడీ పాజిటివిటీ ఊపందుకుంటోంది. ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా తన తాజా వెడ్డింగ్‌ వేర్‌ ప్రచారం కోసం...

ప్లస్‌ సైజ్‌ మోడల్‌!

ఊబకాయులను ఆత్మన్యూనతకు గురి చేసే బాడీ షేమింగ్‌ క్రమేపీ తగ్గుతూ, బాడీ పాజిటివిటీ ఊపందుకుంటోంది. ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా తన తాజా వెడ్డింగ్‌ వేర్‌ ప్రచారం కోసం, ప్లస్‌ సైజ్‌ మోడల్‌ సాక్షి సింద్వానీని ఎంచుకోవడమే ఇందుకు నిదర్శనం. ఫ్యాషన్‌ బ్లాగర్‌, బాడీ పాజిటివ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ అయిన బొద్దుగా ఉండే ఆ ముద్దుగుమ్మ సాక్షి సింద్వానీ గురించిన ఆసక్తికరమైన కథనం ఇది!


‘వంపుల్ని దాచకండి, ప్రదర్శించండి’ సాక్షి సింద్వానీ నినాదం ఇది. ఫ్యాషన్‌ ఇండస్ర్టీ తీరును మార్చి, మహిళల పట్ల సమాజానికి ఉన్న ధృక్కోణాన్ని సరిదిద్దిన ఘనత ఈమెది. ఒంపులు కలిగిన మహిళలకు సంబంధించి, ప్లస్‌ సైజు ఫ్యాషన్‌ స్టైలింగ్‌ వీడియోలు రూపొందకపోవడాన్ని గమనించిన సాక్షి, యూట్యూబ్‌ బ్లాగర్‌గా తన ఫ్యాషన్‌ ప్రయాణం మొదలుపెట్టింది. కళ్లు చెదిరే స్టైలింగ్‌ వీడియోలు, డాన్సింగ్‌ ఛాలెంజ్‌లు, ఆత్మవిశ్వాసాన్ని పెంచే కంటెంట్‌తో కొద్ది కాలంలోనే విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. తన సైజును బట్టి ఎగతాళి ఎదుర్కొన్నది మొదలు హార్పర్స్‌ బజార్‌ కవర్‌ గర్ల్‌గా ఎదిగిన ఆమె కథ అసాంతం ఆసక్తికరం. మూడున్నర లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లను సంపాదించుకున్న సాక్షి యూట్యూబ్‌ ఛానల్‌కు 87 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. 


బొద్దుగా ఉంటేనే అందం...

చర్మం బహిర్గతం కాకుండా, తమ ఒంటిని దాచుకోవాలనుకునే బొద్దుగా ఉండే ఆడవాళ్లే లక్ష్యంగా సాక్షి, ఫ్యాషన్‌ కంటెంట్‌ తయారు చేస్తూ ఉంటుంది. ఇందుకోసం స్పోర్ట్స్‌ బ్రాలు మొదలు కోర్సెట్‌, మినీ స్కర్ట్‌... ఇలా సాక్షి ధరించి, ప్రదర్శించని దుస్తులు లేవు. ఈ స్టైలిష్‌ బ్లాగర్‌ బాడీ పాజిటివిటీలో భాగంగా ఒంపులను నిర్భయంగా ప్రదర్శించాలనుకునే ప్లస్‌ సైజు మహిళల కోసం కొన్ని ఫ్యాషన్‌ లేబుల్స్‌ను కూడా ప్రమోట్‌ చేసింది. కేబి కలెక్షన్‌లో భాగంగా ప్యాంట్‌సూట్స్‌, ఓరా స్టూడియో కలెక్షన్‌లో భాగంగా పొట్టి గౌన్లను ప్రమోట్‌ చేసింది. భారీ కాయం కలిగిన మహిళలు వేసుకోలేని కార్సెట్లకూ సాక్షి కొత్త స్టైల్‌ను ఆపాదించి, ‘లీ క్లాతింగ్‌ కొ’ ద్వారా ప్రచారం కల్పించింది.


షేప్‌ వేర్‌ సొగసు

ఊబకాయులు ఎక్కువగా ఉపయోగించే షేప్‌వేర్‌కు సాక్షి కొత్త నిర్వచనం చెప్పింది. బట్‌ చిక్‌ ప్రొడక్ట్స్‌కు ప్రచారం కల్పించే పనిలో భాగంగా ఒంటికి హత్తుకుపోయే షేప్‌ వేర్‌ ధరించి, ‘‘సన్నగా కనిపించడం కోసం షేప్‌ వేర్‌ ధరించడం మానేయండి. నేనిలాంటివేవీ ధరించకుండా కూడా అందంగా కనిపిస్తుంటాను. ఏ రోజైనా ధరించిన దుస్తులు బిగుతైనట్టు అనిపించినా, అసౌకర్యం కలిగించినా వెంటనే షేప్‌ వేర్‌లోకి మారిపోతూ ఉంటాను. ఈ దుస్తుల్లో నా ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. స్వయంస్వావలంబన సాధించిన అనుభవానికి లోనవుతాను.’’ అంటూ సాటి ప్లస్‌ సైజ్‌ మహిళలను ప్రోత్సహిస్తోంది సాక్షి.




నూరానియత్‌, ది బ్రైడల్‌ ఎడిట్‌

నూరానియత్‌, ది బ్రైడల్‌ ఎడిట్‌... ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా తాజా ఫ్యాషన్‌ ఫిల్మ్‌ ఇది. సహజసిద్ధ శరీర నిర్మాణాన్ని స్వాగతించే విషయంలో ఇప్పటికీ మన దేశం వెనకపడే ఉన్నా, ‘అన్ని సైజులూ అందమైనవే’ అనే నినాదం ప్రచారానికి కొందరు ప్రముఖులు నడుం బిగించారు. వారిలో ఒకరు మనీష్‌ మల్హోత్రా. నూరానియత్‌, ది బ్రైడల్‌ ఎడిట్‌ వీడియోలో ఒక న్యూ ఏజ్‌ బ్రైడ్‌గా అవకాశం దక్కడం తన అదృష్టమనీ, కౌటూర్‌లో నటించాలని కెరీర్‌లో అడుగు పెట్టినప్పటి నుంచీ తను కంటున్న కల ఈ రూపంలో తీరిందనీ ఇన్‌స్టా వేదికగా తన ఆనందాన్ని పంచుకుంది సాక్షి. ఎరుపు రంగు లాంగ్‌ బ్రైడల్‌ గౌన్‌లో మనీష్‌ మల్హోత్రా జ్యువెలరీ ధరించి హొయలు ఒలికించిన సాక్షి ఫొటోలు నెటిజన్లను అలరిస్తున్నాయి. అందంగా కనిపించడానికి ప్లస్‌ సైజ్‌ అడ్డంకి కాదనే నిజాన్ని నిరూపిస్తున్నాయి.


Updated Date - 2021-09-08T05:30:00+05:30 IST