కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టుతో నవ చరిత్ర సృష్టి: మోదీ

ABN , First Publish Date - 2021-12-13T20:15:23+05:30 IST

తిష్ఠాత్మక 'కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు'తో నవ చరిత్ర సృష్టి జరుగనుందని ప్రధాని..

కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టుతో నవ చరిత్ర సృష్టి: మోదీ

వారణాసి: ప్రతిష్ఠాత్మక 'కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు'తో నవ చరిత్ర సృష్టి జరుగనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మోదీ కలల ప్రాజెక్టుగా మూడేళ్ల వ్యవధిలో పూర్తయిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును సోమవారంనాడు ఆయన ప్రారంభించారు. రూ.399 కోట్ల వ్యయంతో నిర్మించిన కాశీ విశ్వనాథ్ థామ్ ఫేజ్-1ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.తొలుత 'హర్ హర్ మహదేవ్' నినాదంతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పెద్దఎత్తున సాధులు, సంతులు ఈ కార్యక్రమంలో పాల్గొని 'జై శ్రీరామ్' నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్ పటేల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.


కాశీ విశ్వనాథ్ ప్రాజెక్టు కారిడార్ నిర్మాణంతో వయోవృద్ధులు, దివ్యాంగులు సైతం జెట్టీలు, ఎస్కలేటర్లలో ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడానికి మార్గం సుగమమైందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వారు నేరుగా ఘాట్ నుంచి జెట్టీలో ఆలయానికి చేరుకోవచ్చని అన్నారు. ఎస్కలేటర్‌ ద్వారా కూడా ఘాట్ చేరుకోవచ్చని చెప్పారు.  కోవిడ్ మహమ్మారి వెంటాడినా నిర్దేశిత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అహరహం శ్రమించిన వర్కర్లకు, కారిడార్‌ కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, యూపీ సర్కార్‌కు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.


ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మాగాంధీ వందేళ్ల క్రితం వారణాసి వచ్చారని, అక్కడ ఇరుకు వీదులు, రోడ్లు, అపరిశుభ్ర వాతావరణం చూసి ఎంతో ఆవేదన చెందారని చెప్పారు. గాంధీజీ పేరుతో చాలా మంది అధికారంలోకి వచ్చారని, అయితే భవ్య కాశీ నిర్మాణంతో తొలిసారిగా ఆయన కల ఇన్నేళ్లకు సాకారమైందని అన్నారు.

Updated Date - 2021-12-13T20:15:23+05:30 IST