అమ్మా నీ తెగువకు వందనం... కొవిడ్‌తో పోరాడిన ఓ చంటిబిడ్డ తల్లికి ప్రధాని ప్రశంసలు..

ABN , First Publish Date - 2021-06-17T00:39:48+05:30 IST

కరోనా బారిన పడినా అత్యంత ధైర్యంతో, సానుకూల దృక్పథంతో పోరాడిన ఓ చంటిబిడ్డ తల్లిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు ...

అమ్మా నీ తెగువకు వందనం... కొవిడ్‌తో పోరాడిన ఓ చంటిబిడ్డ తల్లికి ప్రధాని ప్రశంసలు..

న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారిపై అత్యంత ధైర్యంతో, సానుకూల దృక్పథంతో పోరాడిన ఓ చంటిబిడ్డ తల్లిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. కఠినంగా కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ తనను తాను కాపాడుకోవడంతో పాటు, ఆరేళ్ల తన కుమారుడికి కరోనా వైరస్ సోకకుండా చూసుకున్నారంటూ ఆయన కొనియాడారు. గజియాబాద్‌లోని సెక్టార్ 2కి చెందిన పూజా వర్మ, ఆమె భర్త గగన్ కౌశిక్ కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. తాము నివసిస్తున్నది త్రిబుల్ బెడ్‌రూమ్ కావడంతో.. కుమారుడికి కరోనా సోకకుండా వర్మ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురూ ఒక్కో బెడ్ రూమ్‌లో ఐసోలేట్ అయ్యారు. అయితే అప్పటి వరకు తల్లిదండ్రులతో ఆడుతూ పాడుతూ తిరిగిన ఆరేళ్ల ఆ పిల్లాడికి.. ఈ కరోనా వైరస్ అంటే ఏమిటి, కొవిడ్ నిబంధనలేంటి, ఐసొలేషన్‌లోకి వెళ్లాల్సిన అవసరం ఏమిటన్నది ఏమాత్రం అర్థం కాలేదు. తల్లిదండ్రులకు దూరంగా వేరే గదిలో ఉండాల్సినంత తప్పు తానేం చేశానో అన్నట్టు తన కుమారుడు ఆశ్చర్యంగా చూసేవాడని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు తాము ఎదుర్కొన్న అనుభవాలను ఓ కవిత రూపంలో వివరిస్తూ వర్మ ఇటీవల ప్రధాని మోదీకి లేఖ రాశారు.


దీనిపై ప్రధాని ఆమెకు తిరిగి జవాబు రాస్తూ ఆమె కుటుంబ యోగక్షేమాలపై ఆరా తీశారు. ‘‘అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం మీరు, మీ కుటుంబం కరోనా నిబంధలు పాటిస్తూ ధైర్యంగా పోరాడడంపై చాలా సంతోషించాను. కష్టాల్లో ఉన్నప్పుడు సహనం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని శాస్త్రాలు బోధించాయి..’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఆమె రాసిన కవిత పైనా ఆయన స్పందించారు. తన బిడ్డకు దూరంగా గడపాల్సి వచ్చినప్పుడు ఆమె ఎంత ఆతృత, ఆవేదనకు గురయ్యారనేది కళ్లకు కట్టినట్టు చెప్పారంటూ కొనియాడారు. ఆమెకున్న ధైర్యం, సానుకూల దృక్పథంతో భవిష్యత్తులో ఎలాంటి కష్టాలనైనా అవలీలగా ఎదిరించగలరని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా తాము కఠినంగా ఐసోలేషన్ పాటించడం వల్లే తమ కుమారుడికి కొవిడ్-19 సోకకుండా కాపాడుకోగలిగామని కౌశిక్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాము పూర్తిగా కోలుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-17T00:39:48+05:30 IST