ఉత్తరాంధ్ర గుండె ఘోష

ABN , First Publish Date - 2021-04-03T06:11:20+05:30 IST

పదిమందే బాగుపడాలి, 90 మంది సేవ చేయ్యాలి అనుకునే మనస్తత్వం ప్రైవేట్‌కు అనుకూలం. సర్వేజనా సుఖినోభవంతు అనే ఆశంస వాస్తవం కావాలంటే విశాఖ ఉక్కు కర్మాగారం.....

ఉత్తరాంధ్ర గుండె ఘోష

పదిమందే బాగుపడాలి, 90 మంది సేవ చేయ్యాలి అనుకునే మనస్తత్వం ప్రైవేట్‌కు అనుకూలం. సర్వేజనా సుఖినోభవంతు అనే ఆశంస వాస్తవం కావాలంటే విశాఖ ఉక్కు కర్మాగారం వంటిది ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి.


కొవిడ్–-19 ప్రభావంతో కుదేలయిన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి మోదీ ప్రభుత్వం గత ఏడాది రూ.20 లక్షల కోట్ల ‘ఆత్మ నిర్భర్’ పథకాన్ని ప్రకటించింది. అదే సందర్భంలో ‘ఇకనుంచి ప్రభుత్వం వ్యాపార రంగంలో వుండదు, నాలుగు అంశాలకు మాత్రమే పరిమితమౌతుంది’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. ఆయన మాటల అర్థాన్ని ఆ కష్టకాలంలో ఎవరూ గుర్తించలేదు. రూ.20 లక్షల కోట్లు అంటే జాతీయాదాయంలో 10 శాతం, కేంద్ర బడ్జెట్‌తో సమానమైన విలువ గల డబ్బు.


అదేమయిందో తెలియదుగాని తెలుగు వారి అస్తిత్వ సంపద ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్’ అమ్మేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. నష్టాలు వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నామని, అందులో భాగంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మివేయాలని నిర్ణయించినట్టు పాలకులు తెలిపారు. బిహెచ్ఇఎల్, సెయిల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు వ్యాపారం చెయ్యవు. అవి దేశ ఆర్ధికవ్యవస్థ కు పట్టుగొమ్మలు. ప్రభుత్వ ఫిస్కల్ పాలసీకి, ఉత్పత్తి రంగంలో పారిశ్రామిక వ్యవస్థకు మూల స్తంభాలు. అవి ఉత్పత్తి చేసిన వస్తువులను వేరేవాళ్లు అమ్ముతారు. అది వారి వ్యాపారం. ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధం లేని వ్యవహారం. నిజానికి లాభపడేది ప్రభుత్వరంగ ఉత్పత్తుల అవుట్ లెట్‌లు నిర్వహించే ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలే! మొదట్లో నష్టాలు వచ్చినవి అమ్మేస్తాం అన్నారు. తరువాత లాభ నష్టాలతో సంబంధం లేదు అన్ని ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తున్నాం అన్నారు. భారత దేశ ఆర్ధికవ్యవస్థ విదేశీ కంపెనీలకు, ప్రభుత్వాలకు కంటగింపుగా ఉన్నది అంటే ప్రైవేట్ రంగ పరిశ్రమలు, వాటి ఉత్పత్తులు, సేవల మూలంగా కాదు.


ఐడిపిఎల్, బిహెచ్ఇఎల్, ఇస్రో, సెయిల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి సంస్థలు, వాటిలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, కార్మికులు అందించిన మానవ పెట్టుబడి, శ్రమ చాలా గొప్పది. 2019లో 249 ప్రభుత్వరంగ సంస్థలు రూ.2.13 లక్షల కోట్ల (పన్నులకు ముందు) లాభాలు ఆర్జించాయి. మనదేశ బడ్జెట్‌తో సమానమైన రూ.25.4 లక్షల కోట్ల టర్నోవర్ సాధించాయి. ఇదే అసలైన కిటుకు. ఇది కార్పొరేట్ రంగానికి, విదేశీ కంపెనీలకు కష్టంగా వుంది. అది ప్రజల ఆస్తి. పేద ప్రజలు, దళితులు బహుజనులు తమ ఆరోగ్యాన్ని, విద్యను, ఆదాయాన్ని వదులుకొని ప్రభుత్వ సంస్థల్లో బడ్జెట్ రూపంలో పెట్టిన పెట్టుబడి. దీన్నుంచి లాభపడినవి కార్పొరేట్ సంస్థలే తప్ప దేశ ఆర్ధిక నిర్మాణానికి 1950లో ఒక్కరూ పది కోట్ల పెట్టుబడి పెట్టలేదు. ప్రభుత్వాలను తమకు అనుకూలంగా మార్చుకొని పర్మిట్ లైసెన్స్‌ల రూపంలో అప్పుడు, కాంట్రాక్టులు పాలసీల రూపంలో ఇప్పుడు లబ్ధిపొందుతోన్న కుబేరులు ఎవరో అందరికీ తెలుసు. వారి చేతిలో కీలుబొమ్మలు విధానాలు ప్రకటిస్తే వాటికి వత్తాసుగా చెల్లింపు మేధావులు కితాబులివ్వటం అనాగరికం. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదట ప్రభుత్వరంగ సూత్రాన్ని గురించి చెప్పింది కౌటిల్యుడు. ఆ వారసత్వ కొనసాగింపే నెహ్రూ -అంబేడ్కర్- లోహియా వంటి మన కాలం నాయకుల ఆర్ధిక విధానాలు. ఆ విధానాల సమున్నత ఫలితాలే భిలాయ్, రూర్కెలా ఉక్కు కర్మాగారాలు, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. అనబడే విశాఖ స్టీల్ ప్లాంట్. 


విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. వేలాది మత్స్యకారులు, సన్నకారు రైతులు 30 వేల ఎకరాలు సముద్రానికి ఆనుకొని ఉన్న భూమిని వదులుకొని త్యాగం చేస్తే వచ్చిన సంస్థ. 1971లో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినా ఉత్పత్తి 1990 తరువాతే జరిగింది. తరువాత 2000 సంవత్సరంలో బిఐఎఫ్ ఆర్ వరకు వెళ్లి తిరిగి లాభాలు ఆర్జించి సొంతంగా విస్తరణకు పూనుకున్న సంస్థ. ప్రపంచంలో స్టీల్ పరిశ్రమలపై పరిశోధన చేసిన ఆర్ధిక శాస్త్రవేత్తలు ఒక ప్లాంట్ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 4.5 మిలియన్ టన్నుల ఇనుము ఉత్పత్తి చేయాలని నిర్ధారించారు. విశాఖ స్టీల్ యిప్పుడు 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని సంపాదించుకుంది. ఇదంతా ప్రభుత్వం నుంచి ఎటువంటి పూర్తి సహకారం లేకున్నా సాధించింది. దేశంలో చాలా ప్రైవేట్ స్టీల్ మిల్లులకు సొంతంగా గనులుంటే, వైజాగ్ స్టీల్ ప్లాంటుకు సొంత గనులు కేటాయించలేదు. అయినా దేశీయ, విదేశీ పోటీని తట్టుకొని నిలబడింది వైజాగ్ స్టీల్. ఇది తెలుగువారి ఆత్మ నిర్భర్‌కు చెందిన అంశం. 


వైజాగ్ స్టీల్ తెలుగు ప్రజల సెంట్‌మెంట్ మాత్రమే కాదు ఉత్తరాంధ్ర గుండె ఘోష. గంగవరం పోర్టును ప్రైవేట్ పరం చేసి మత్స్యకారులను మోసం చేసి స్టీల్ ప్లాంట్ భూముల్లోనే ఆ ప్లాంట్ కోసం నిర్మించవలసిన పోర్ట్‌ను మొదట ప్రైవెట్ పరం చేసి, ఆ తరువాత గుజరాత్ అంబానీకి, దాన్ని అమ్మేలా చేశారని వార్త. రాష్ట్రం విడిపోతే తెలంగాణ సోదరులను హైద్రాబాద్ ఆదుకున్నట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను వైజాగ్ స్టీల్ ఆదుకుంది. విశాఖపట్నం సముద్రతీరం, అమాయక ఆదివాసీ, మత్స్యకార, బహుజన ప్రజలు ఎంతో ఆర్తితోయీ ప్లాంటు ఉద్యోగుల ఆధారంగా ఏదోలా బ్రతికేస్తున్నారు.


ఇప్పటికీ 8 వేల కుటుంబాలు నిర్వాసితులుగా రోడ్ల మీదే ఉన్నారు. వారి భూములు తీసుకొని, స్టీలు అమ్ముకొని రాజకీయ కాంట్రాక్టర్లు జాతీయ స్థాయికి ఎదిగారు. నలబై ఎళ్లుగా ఆర్ కార్డులు పట్టుకు తిరిగి తిరిగి పిచ్చెక్కి నిజంగానే విశాఖ మెంటల్ హాస్పటల్‌లో చేరిన ఎంతోమంది యిప్పటికీ ఆశగా స్టీల్ ప్లాంట్ వైపు ఎదురు చూస్తున్నారు. కారణం ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం 2.5 లక్షల రూపాయలు గాజువాక నియోజక వర్గం (స్టీల్ ప్లాంట్) నుండే వస్తోంది. అంటే విశాఖపట్నం రాష్ట్రంలో ఆర్ధికంగా నిలదొక్కుకున్నదంటే దానికి స్థానికుల సహకారమే కారణం. నిజానికి గాజువాక తప్పించి అరకు తదితర నియోజక వర్గాలు, గ్రామీణ నియోజక వర్గాల తలసరి ఆదాయం రాష్ట్రంలో అందరి కంటే తక్కువ ఉంది. అందుకే ఉత్తరాంధ్ర ప్రజల వాటా యింకా వారికి చేరలేదు. ఈ లోపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల్లో వస్తున్న మార్పులతో ‘బెంబేలు’ పడిపోతున్న జనాలను ఆదుకోవాలి. 


వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది అమ్మేయాలని ప్రభుత్వం అంటే వారికి తందాన పలికే భక్తులు అసలు విషయాలు తెలుసుకోవటంలేదు. మూడు దశాబ్దాల కాలంలో (1990–2020)లో యీప్లాంట్ మూలంగా 5.22 లక్షల కోట్ల టర్నోవర్ జరిగింది. ఈ కాలంలో రూ.17972 కోట్లు లాభం, రూ.14879 కోట్లు నష్టం వెరసి నికరంగా రు.3093 కోట్ల లాభంతో ఉంది. ఇది నామినల్ విలువలో చెప్పింది. నిజవిలువలో అంటే స్థిర విలువలో చెబితే అంటే గతంలో లాభాలు ఉండి యిటీవల నష్టాల్లో ఉండడంతో ఆ విలువ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. పేదలు ప్లాంట్ కట్టడానికి యిచ్చిన భూమి విలువ సుమారు రెండు లక్షల కోట్లు. ఇన్వెంటరీ (మిగిలిన సరుకులు) 7వేలకోట్లు, ప్లాంటు విలువ 26 లక్షలకోట్లు. ప్రభుత్వ పెట్టుబడి రూ.4890 కోట్లు మాత్రమే. నిజానికి పబ్లిక్ రంగ పరిశ్రమ అమ్మేయాలని చెప్పే ఎకౌంటెట్లు, వాణిజ్య ఆర్ధికవేత్తలు చెప్పే గ్రాస్ ప్రాఫిట్-కేపిటల్ రేషియో, షేర్ కేపిటల్ రేషియో ఇటీవల కాలంలో 7.8 శాతం, 19.9 శాతంగా ఉన్నాయి. ఇది టాటా స్టీల్ సాధించిన ఫలితాలకు దగ్గరగా ఉంది. టాటాకు సొంత గనులున్నాయి. వైజాగ్ స్టీల్ నష్టాలు పూడ్చుకుంటుంది, సొంత గనులు ఇస్తే ఎక్కువ లాభాలు ఆర్జిస్తుంది. ఆ సంపద దేశ సంపద అవుతుంది. ప్రైవేట్ వ్యక్తులది కాదు.పదిమందే బాగుపడాలి 90 మంది సేవ చేయ్యాలి అనుకునే మనస్తత్వం ప్రైవేట్‌కు అనుకూలం. ప్రజలంతా బాగుపడాలి, సర్వేజనో సుఖినోభవంతు అనే ఆశంస వాస్తవం కావాలంటే విశాఖ ఉక్కు కర్మాగారం వంటిది ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. 


-ప్రొఫెసర్. కె.యస్. చలం

Updated Date - 2021-04-03T06:11:20+05:30 IST