ఖాదీ ఉత్పత్తులను కొనడం దేశ నిర్మాణానికి కృషి చేయడమే : మోదీ

ABN , First Publish Date - 2021-07-25T18:13:49+05:30 IST

ప్రజలు ఖాదీ ఉత్పత్తులను కొనాలని, భారత్‌ జోడో

ఖాదీ ఉత్పత్తులను కొనడం దేశ నిర్మాణానికి కృషి చేయడమే : మోదీ

న్యూఢిల్లీ : ప్రజలు ఖాదీ ఉత్పత్తులను కొనాలని, భారత్‌ జోడో ఆందోళన్‌లో భాగస్వాములు కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవాలు త్వరలో రాతున్నట్లు తెలిపారు. మన జీవితాల్లో చేనేతకు మరింత ప్రజాదరణ లభించే విధంగా మనమంతా చేయగలిగినదంతా చేద్దామని అన్నారు. మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఈ పిలుపునిచ్చారు. 


గత కొన్ని సంవత్సరాల్లో ఖాదీ సాధించిన విజయాలు అందరికీ తెలుసునని చెప్పారు. 2014 నుంచి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాల్లో తరచూ ఖాదీ గురించి చెప్తుండటాన్ని ప్రజలు గమనించే ఉంటారని పేర్కొన్నారు. ప్రజల కృషితోనే నేడు ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు అనేక రెట్లు పెరిగాయని తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాలకు చారిత్రక నేపథ్యం ఉందని చెప్పారు. 1905లో ఇదే రోజు నుంచి స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందన్నారు. స్వాతంత్ర్యోద్యమం, ఖాదీ గురించి ప్రస్తావన వచ్చినపుడు అందరికీ సహజంగానే మహాత్మా గాంధీ గుర్తుకొస్తారన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో ‘క్విట్ ఇండియా’ ఉద్యమం జరిగినట్లుగానే, ప్రస్తుతం భారత్ జోడో ఆందోళన్‌కు ప్రతి భారతీయుడు నాయకత్వం వహించాలన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రధాన ఆదాయ వనరు హస్తకళలేనని తెలిపారు. ఈ రంగంలో లక్షలాది మంది మహిళలు, చేనేతకారులు, వృత్తి నిపుణులు ఉన్నారని చెప్పారు. మనం మన నిత్య జీవిత కార్యకలాపాలను నిర్వహించుకుంటూనే దేశ నిర్మాణానికి కృషి చేయవచ్చునని వివరించారు. స్థానికంగా తయారు చేసినవాటినే కొనాలనే నియమం పెట్టుకోవడం వంటివి చేయడం ద్వారా దేశాన్ని నిర్మించవచ్చునని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా చిన్న ప్రయత్నం చేసినా చేనేతకారుల్లో కొత్త ఆశలు మొలకెత్తుతాయని చెప్పారు. 


Updated Date - 2021-07-25T18:13:49+05:30 IST