ఆక్సిజన్ కొరత తీర్చడానికి ఇలా చేయండి : మోదీ సలహా

ABN , First Publish Date - 2021-04-22T22:37:32+05:30 IST

దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అత్యున్నత స్థాయి సమావేశం

ఆక్సిజన్ కొరత తీర్చడానికి ఇలా చేయండి : మోదీ సలహా

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ ఉత్పత్తితో పాటు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచే ఉపాయాలపై చర్చించారు. ఆక్సిజన్ సప్లైను ఎలా వేగవంతం చేస్తున్నామన్న దానిపై అధికారులు ప్రధాని మోదీకి వివరించారు. ఇంతటి క్లిష్ట సమయంలో అధికారులందరూ బహుముఖీనంగా కష్టించి పనిచేయాలని పీఎం కోరారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆక్సిజన్ విషయంలో వినూత్నమైన మార్గాలను ఉపయోగించి, రోగులకు సరైన వైద్యం అందించాలని మోదీ అధికారులను కోరారు. 


ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, దీన్ని అధిగమించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, ఉత్పత్తి పెంచడానికి తగిన మార్గాలను అన్వేషించి, తర్వితగతిన ఆక్సిజన్‌ను రాష్ట్రాలకు సరఫరా చేయాలని మోదీ ఆదేశించారు. నైట్రోజన్ ఆర్గాన్ కోసం నిర్దేశించిన క్రయోజనిక్ ట్యాంకర్లను కూడా ఇటు వైపు మళ్లించి, ఆక్సిజన్ సరఫరా కోసం అందుబాటులోకి తేవాలని మోదీ సూచించారు. అంతేకాకుండా ఆక్సిజన్ సరఫరా కోసం రైళ్లను కూడా వినియోగించుకోవాలని ఆదేశించారు. ఆయా రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించడం పూర్తైన తర్వాత ఖాళీ ట్యాంకర్లను విమానంలో వెనక్కి తీసుకురావాలని మోదీ సూచించారు. 


 ‘‘ఆక్సిజన్ కొరత నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత సమీక్ష సమావేశం జరిగింది. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత గురించి చర్చించారు. ఆక్సిజన్ ఉత్పత్తిని ఎలా పెంచాలి? అన్న దానిపై సమాలోచనలు జరిపారు. డిమాండ్‌కు తగ్గ ఆక్సిజన్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ఎలా కష్టపడుతున్నామన్న విషయాన్ని అధికారులు మోదీకి వివరించారు’’ అని పీఎంవో పేర్కొంది. ఆక్సిజన్ కొరత విషయంలో ఇప్పటికే తాము అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేస్తున్నామని, వారి అవసరాలను గుర్తించామని అధికారులు మోదీ దృష్టికి తీసుకొచ్చారు. 20 రాష్ట్రాలకు ప్రస్తుతం రోజుకు 6,785 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని, ఈ నెల 21 వ తేదీ నాటికి 6,822 మెట్రిక్ టన్నులను కేటాయించామని అధికారులు వివరించారు. కొన్ని రోజులుగా లిక్విడ్ ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరిగిందని, దీంతో పరిశ్రమలకు, స్టీల్ ప్లాంట్లకు ఆక్సిజన్ సరఫరాను నిషేధించామని అధికారులు మోదీ దృష్టికి తీసుకొచ్చారు.


Updated Date - 2021-04-22T22:37:32+05:30 IST