PM Modi, CM Stalin: నేడు ప్రధానితో స్టాలిన్‌ భేటీ

ABN , First Publish Date - 2022-08-17T12:58:59+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) బుధవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narend

PM Modi, CM Stalin: నేడు ప్రధానితో స్టాలిన్‌ భేటీ

                            - రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితోనూ సమావేశం


చెన్నై, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) బుధవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)తో భేటీ కానున్నారు. ఆ సందర్భంగా నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు, జీఎస్టీ బకాయిలు, సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు కేటాయించాలని వినతి పత్రం ఇవ్వనున్నారు. ఒక రోజు పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి స్టాలిన్‌ మంగళవారం రాత్రి 9.50 గంటలకు విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. రాత్రి అక్కడి తమిళనాడు హౌస్‌లో బసచేశారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు  నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీష్‌ ధనకర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందించనున్నారు. అనంతరం 11.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్ళి నూతన రాష్ట్రపతి పదవి అధిరోహించిన ద్రౌపది ముర్మును కలిసి అభినందించనున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఆ సందర్భంగా చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలియజేయనున్నారు. అదేవిధంగా నీట్‌ మినహాయింపు బిల్లుకు ఆమోదం తెలపాలని, కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని, ప్రభుత్వ పథకాలకు మరిన్ని నిధుల కేటాయించాలని కోరుతూ ప్రధానికి ఓ వినతిపత్రం సమర్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదేవిధంగా రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచడాన్ని కూడా స్టాలిన్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్ళనున్నారు. అదే సమయంలో చెస్‌ ఒలంపియాడ్‌(Chess Olympiad)ను ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని జాతీయ క్రీడాపోటీలను కూడా నిర్వహించేందుకు అనుమతివ్వాలని కూడా కోరనున్నట్లు సమాచారం. అనంతరం కొందరు కేంద్ర మంత్రులను కూడా కలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఢిల్లీ పర్యటనను ముగించుకుని బుధవారం రాత్రి ఢిల్లీలో బయలుదేరనున్నారు. 

Updated Date - 2022-08-17T12:58:59+05:30 IST