అనేక అవరోధాలపై శాస్త్రవేత్తల విజయ దుందుభి : మోదీ

ABN , First Publish Date - 2020-11-07T22:50:16+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను

అనేక అవరోధాలపై శాస్త్రవేత్తల విజయ దుందుభి : మోదీ

న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అభినందించారు. కోవిడ్-19 మహమ్మారి విసిరిన భారీ సవాళ్ళను శాస్త్రవేత్తలు అధిగమించారని ప్రశంసించారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ)ని విజయవంతంగా ప్రయోగించినందుకు హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు అనేక అవరోధాలను అధిగమించి ఈ ప్రయోగాన్ని సకాలంలో నిర్వహించి విజయం సాధించారన్నారు. 


మోదీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఈ రోజు పీఎస్ఎల్‌వీ సీ49/ఈఓఎస్-01ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోను, భారత దేశపు స్పేస్ ఇండస్ట్రీని అభినందిస్తున్నాను. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మన శాస్త్రవేత్తలు నిర్ణీత గడువును చేరుకునేందుకు అనేక అవరోధాలను అధిగమించారు’’ అని పేర్కొన్నారు. 


పీఎస్ఎల్‌వీ సీ-49 భారత దేశపు అత్యాధునిక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్-01)తోపాటు మరొక 9 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ ప్రయోగంలో అమెరికాకు చెందిన 4, లగ్జెంబెర్గ్‌కు చెందిన 4, లిథువేనియాకు చెందిన 1 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీహరికోట, సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం మధ్యాహ్నం 3.12 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. 


Updated Date - 2020-11-07T22:50:16+05:30 IST