రాష్ట్రాలకే సాగుచట్టాల బాధ్యత

ABN , First Publish Date - 2021-01-02T06:15:16+05:30 IST

రాష్ట్ర జాబితాలోని అంశాలు ఏమిటో తెలుసుకుంటే ప్రస్తుత రైతుల ఆందోళనకు పరిష్కారం ఏమిటో విదితమవుతుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే బాధ్యతను పూర్తిగా రాష్ట్రాలకు వదిలివేయడమే ఆ పరిష్కారం....

రాష్ట్రాలకే సాగుచట్టాల బాధ్యత

రాష్ట్ర జాబితాలోని అంశాలు ఏమిటో తెలుసుకుంటే ప్రస్తుత రైతుల ఆందోళనకు పరిష్కారం ఏమిటో విదితమవుతుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే బాధ్యతను పూర్తిగా రాష్ట్రాలకు వదిలివేయడమే ఆ పరిష్కారం. ప్రజల అవసరాలు ఏమిటి? వాటిని తీర్చేందుకు ఎటువంటి చట్టాలను తీసుకురావాలో శాసనసభలే నిర్ణయించుకోవాలి. పంజాబ్ అవసరాలు బిహార్ అవసరాలకు భిన్నమైనవి. బిహార్ అవసరాలు బెంగాల్ అవసరాలకు భిన్నమైనవి. కనుక శాసన నిర్మాణంలో పంజాబ్ నమూనా, బిహార్ నమూనా ఉండి తీరాలి.


కొత్తవ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీకి తరలివచ్చిన అశేష రైతుజన సమూహాలు 1942 ఆగస్టు 7-–8 తేదీలలో ముంబై (నాడు బొంబాయి)లోని గోవలీయ ట్యాంక్ మైదాన్‌ను గుర్తు చేస్తున్నాయి. భారత్‌ను తక్షణమే వదిలిపోవాలని బ్రిటిష్ వలసపాలకులను నిష్కర్షగా హెచ్చరించిన మహాత్మాగాంధీ చావో బతుకో తేల్చుకోమని పారతంత్ర్యంలో మగ్గుతున్న భారతీయులకు ఆనాడు ఆ మైదానంలో జరిగిన సభలో పిలుపునిచ్చారు. 


నేడు ఢిల్లీ శివారులోని సింఘూ, నాటి గోవలీయ ట్యాంక్ మైదాన్‌లా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. మహాత్మా గాంధీ అయితే లేరు గానీ సింఘూలో నిరసన తెలుపుతున్న ప్రతి రైతు పరిపూర్ణ అహింసాత్మక చైతన్యంతో రగులుతున్నాడు. ఆనాటి మన తాతలు, తండ్రుల వలే నేటి ఈ మన సహోదరులు కూడా చావో బతుకో తేల్చుకోవడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. గత ఏడాది నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఖండితంగా డిమాండ్ చేస్తున్నారు.


మోదీ ప్రభుత్వ ప్రతినిధులు, రైతుసంఘాల నాయకుల మధ్య జరిగిన తాజా చర్చలు సైతం విఫలమయ్యాయి. తాను తెచ్చిన చట్టాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపసంహరించుకోకూడదనే ఉక్కు నిశ్చయంతో పాలకులు ఉన్నారన్న వాస్తవం తేటతెల్లమయింది. కొత్త సాగుశాసనాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ను మోదీ సర్కార్ సహించదు, సమ్మతించదు. అయితే కీలకమైన మూడు డిమాండ్లు కాక ఆ చట్టాలలోని ఇతర నిబంధనలలో సవరణలు చేసేందుకు పాలకులు అంగీకరిస్తున్నారు. ఆ చట్టాలలో తగు మార్పులు చేర్పులు చేసేందుకు ఏ రాష్ట్ర శాసనసభనూ అనుమతించే ప్రసక్తి లేదని కూడా మోదీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 


తమ మూడు డిమాండ్లను అంగీకరించి తీరవలసిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అవి: (1) వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)లకు పోటీగా క్రమబద్ధీకరించని ప్రైవేట్ మార్కెట్లను అనుమతించకూడదు. (2) కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన భరోసా కల్పించాలి. (3) వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలోకి కార్పొరేట్ కంపెనీలను అనుమతించకూడదు. 


ప్రభుత్వం, రైతుల మధ్య డిసెంబర్ 30న జరిగిన చర్చలు విఫలమయ్యాయి. జనవరి 4న ఆ చర్చలు మళ్ళీ ప్రారంభమవనున్నాయి. ఇదిలాఉండగా రైతుల డిమాండ్లలో రెండిటికి ఒప్పుకున్నట్టు ప్రభుత్వం చెప్పుకుంటున్నది. అవి: (1) విద్యుత్ సబ్సిడీలను యథావిధిగా కొనసాగించడం (2) కోతలు, నూర్పిళ్ళ అనంతరం పొలాల్లో మిగిలిపోయిన గడ్డి దుబ్బులను దగ్ధం చేస్తున్న రైతులకు ఎటువంటి శిక్ష, జరిమానా విధించకపోవడం. వాస్తవానికి, ప్రభుత్వం అంగీకరించిన ఈ రెండు డిమాండ్లు రైతుల మూడు ప్రధాన డిమాండ్లకు పూర్తిగా భిన్నమైనవి. తత్ఫలితంగానే చర్చలు విఫలమయ్యాయి. వీటిపై పాలకులు, పోరాటకారుల మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరే అవకాశాలు కన్పించడం లేదు. 


వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో సంస్కరణల అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని ఆర్థికవేత్తలు అందరూ ఎటువంటి మినహాయింపు లేకుండా అంగీకరిస్తున్నారు. ఏపీఎంసీ చట్టాలు లోపభూయిష్టమైనవే. దేశవ్యాప్తంగా అతి కొద్దిమంది రైతులకు మాత్రమే లబ్ధి సమకూరుస్తున్నందునే అవి లోపభూయిష్టమైనవని అనవలసి వస్తోంది. వాటిలోని లోపాలను సరిదిద్దగలిగిన పరిష్కారమేమిటి? ఆ మార్కెటింగ్ కమిటీలను దుర్బలపరచడం పరిష్కారం కానేకాదు. ప్రస్తుత ఎపిఎంసీల స్థానంలో స్వల్పస్థాయిలో క్రమబద్ధీకరించిన వేలాది మార్కెటింగ్ సొసైటీలను ఏర్పాటు చేయడమే సరైన పరిష్కారం. ఈ మార్కెటింగ్ సొసైటీలను దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలు, పెద్ద గ్రామాలలో నెలకొల్పితీరాలి. అప్పుడే రైతులు తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు విక్రయించుకోగలుగుతారు. అంతేకాక బరువు, నాణ్యత, తేమ మొదలైన ఉత్పత్తేతర అంశాల ప్రాతిపదికన జరుగుతున్న దోపిడీ నుంచి రైతులకు రక్షణ సమకూరుతుంది. 2019 సార్వత్రక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మానిఫెస్టో ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఏపీఎంసీ వ్యవస్థను బలహీనపరచడం, దానిని విస్తరించడం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మోదీ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతోంది. 


కనీస మద్దతు ధర విషయంలో కూడా ఇదే వాదన వర్తిస్తుంది. ఎంఎస్‌పి ఒక లోపభూయిష్ట సాధనం. ఎందుకని? కేవలం అతి కొద్దిమంది రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను ఎంఎస్‌పికి విక్రయించుకోగలుగుతున్నారు. ఈ విక్రయాలు కూడా వరి, గోధుమ, సోయాబీన్, పత్తి, చెరకు పంటలకు మాత్రమే పరిమితం. కార్పొరేట్ కంపెనీలు రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ముందుగా నిర్ణయించుకున్న ఒప్పందపు ధరకు కొనుగోలు చేయడం ఎంఎస్‌పిలోని లోపాలకు ఎంతమాత్రం పరిష్కారం కాబోదు. ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలను నిర్దేశిత ఎంఎస్‌పి కంటే తక్కువ ధరకు కొనడం లేదా విక్రయించడంపై చట్టబద్ధమైన ఆంక్షలు విధించి తీరాలి. 


నిరసన తెలుపుతున్న రైతులకు అనుకూలంగా మరింత బలవత్తరమైన వాదన ఒకటి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజ్యాంగానికి ప్రణమిల్లారు. ప్రణమిల్లడంతోనే సరా? పాలనా వ్యవహారాలలో ఎటువంటి చిన్నపాటి సందేహం వచ్చినా ఆ చిన్నపుస్తకాన్ని చదవాలి. మోదీ తరచు రాజ్యాంగాన్ని చదువుతుంటారనడంలో సందేహం లేదు. ఏడవ షెడ్యూల్‌లోని రెండో జాబితాలో ఏముందో ఆయన గుర్తించారా? శాసనాలు చేసే విషయంలో రాష్ట్రాలకు అధికారాలు ఉన్న అంశాల జాబితా అది. రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన ఈ అంశాల జాబితాలో 14వది వ్యవసాయం; 26వది వ్యాపారవర్తకాలు; 28వది మార్కెట్లు, సంతలు, వస్తుప్రదర్శనలు; 52వది వినియోగం లేదా విక్రయానికి గాను వివిధ ప్రాంతాలలోకి సరుకుల ప్రవేశంపై విధించే స్థానిక పన్నులు ఇత్యాది అంశాలు. 


రాష్ట్ర జాబితాలోని అంశాలు ఏమిటో తెలుసుకుంటే ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆందోళనకు పరిష్కారం ఏమిటో విదితమవుతుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే బాధ్యతను పూర్తిగా రాష్ట్రాలకు వదిలివేయడమే ఆ పరిష్కారం. ప్రజల అవసరాలు ఏమిటి? వాటిని తీర్చేందుకు ఎటువంటి చట్టాలను తీసుకురావాలో శాసనసభలే నిర్ణయించుకోవాలి. పంజాబ్ అవసరాలు బిహార్ అవసరాలకు భిన్నమైనవి. బిహార్ అవసరాలు బెంగాల్ అవసరాలకు భిన్నమైనవి. కనుక శాసన నిర్మాణంలో పంజాబ్ నమూనా, బిహార్ నమూనా ఉండితీరాలి.


పంజాబ్ రైతులు తమ ఉత్పత్తులను క్రమబద్ధీకరించిన మార్కెట్లలో విక్రయించుకోదలుచుకుంటే సుంకం చెల్లించి విక్రయించుకోవడానికి అనుమతించాలి. బిహార్ రైతులు ఏపీఎంసీ చట్టాలను కోరుకోకపోతే వారి అభీష్ఠాన్ని గౌరవించాలి. వారు ఎలా, ఎక్కడ విక్రయించుకోదలుచుకున్నా అలాగే విక్రయించుకోనివ్వండి (వడ్లకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1850 ఉండగా, బిహార్ రైతులు కేవలం రూ.800కే అమ్ముకున్నారు. ఇందుకు ఎవరైనా ఎందుకు అభ్యంతరం చెప్పాలి?) అసలు ఒక రాష్ట్రంలో అమల్లో ఉన్న చట్టాల గురించి కేంద్రప్రభుత్వం ఎందుకు పట్టించుకోవాలి? ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమైన ఆహారధాన్యాలను భారత ఆహారసంస్థ కొనుగోలు చేయాలని కేంద్రం భావించిన పక్షంలో ఆ కేంద్రసంస్థ అధికారిక కార్యకలాపాల పరిధి విస్తరణకు పటిష్ఠచర్యలు చేపట్టాలి. ధాన్యం సేకరణ, నిల్వ, పంపిణీ విషయంలో మరింత సామర్థ్యంతో వ్యవహరించగల అధికారాలను ఆ సంస్థకు సమకూర్చాలి. భారత ఆహారసంస్థ కార్యకలాపాలను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ వ్యతిరేకించదు. ఎందుకంటే ఆ సంస్థ వల్ల తమ రైతులు, ప్రజలకు విశేష మేలు జరుగుతుందనే వాస్తవం పాలకులకు బాగా తెలుసు. 


మోదీ సర్కార్‌కు లోక్‌సభలో సంఖ్యాబలం ఉంది. దాని ఆధారంగా సర్వాధికారాలను చెలాయించడానికి ప్రభుత్వం సంకల్పించుకున్నట్టు కనిపిస్తోంది. అపఖ్యాతి పాలైన ‘మోదీ హై, తో మమ్కిన్ హై’ అన్న నినాదాన్ని విపరీత స్థాయిలో వర్తింపచేస్తున్నారు! ప్రతి విషయంలోనూ మోదీ తన మాటను నెగ్గించుకోలేరు. అందుకు ఎటువంటి తప్పుడు మార్గాన్ని అనుసరించినా అది సాధ్యం కాదు. దీన్నే నేను ‘ట్రంపిజం’ అన్నాను. ప్రతి ట్రంప్‌ను ప్రజలు సత్వరమే అధికారచ్యుతుణ్ణి చేస్తారు. ‘రైతులు ఆగ్రహిస్తే ఎంత నిరంకుశ ప్రభువూ తట్టుకోలేడు’ అని రెండు సహస్రాబ్దాల క్రితమే తిరువళ్లువర్ అన్నాడు. వినయశీలురుగా వ్యవహరించడంలో మానవాళికి కరోనా వైరస్ అనేక పాఠాలు నేర్పింది. రైతుల నిరసనలు మన వర్తమాన, భావి పాలకులకు నమ్రతగా వ్యవహరించడంలోనూ, పరిపాలన నెరపడంలోనూ, చట్టాలు చేయడంలోనూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనా బాధ్యతలు నిర్వర్తించడంలోనూ విలువైన పాఠాలు నేర్పుతుందని నేను విశ్వసిస్తున్నాను. భారతదేశాన్ని పాలించే హక్కును నరేంద్రమోదీ సాధించుకున్నారు. దేశ పాలనలో, మరీ ముఖ్యంగా అన్నదాతల విషయంలో ఆయన తన బాధ్యతలను అత్యంత అణకువతో నెరవేర్చాలి.




పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-01-02T06:15:16+05:30 IST