
(విజయనగరం రూరల్): మహాకవి గురజాడ రచనలు నిత్యనూతనం. భవిష్యత్ తరాలకు మార్గదర్శకం.. రాష్ట్రపతి, దేశ ప్రధాని వంటి వారు తమ, తమ ప్రసంగాల్లో రచయితల పేర్లు ప్రస్తావిస్తుంటారు. అయితే దక్షిణ భారత దేశానికి చెందిన రచయిత, సాహితీవేత్తల పేర్లు చాలా అరుదుగా వస్తుంటాయి. తాజాగా కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంభోత్సవంలో భాగంగా శనివారం దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన సందేశంలో మహాకవి గురజాడ అప్పారావు రచనలోని ‘సొంత లాభం కొంత మానుకుని.. పొరుగువారికి తోడుపడవోయ్’, దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్న పంక్తిని ప్రస్తావించారు. ఇది తెలుసుకున్న విజయనగరం ప్రజలు పులకించారు. రాష్ట్ర, జిల్లా రచయితలు, సాహితీవేత్తలు హర్షం వ్యక్తంచేశారు.