Space Sectorలో భారత్ నాయకత్వం : మోదీ

ABN , First Publish Date - 2022-06-11T01:29:37+05:30 IST

అంతర్జాతీయ రోదసీ రంగంలో భారత దేశ పారిశ్రామిక సంస్థలు

Space Sectorలో భారత్ నాయకత్వం : మోదీ

అహ్మదాబాద్ : అంతర్జాతీయ రోదసీ రంగంలో భారత దేశ పారిశ్రామిక సంస్థలు ప్రధాన శక్తులుగా ఎదుగుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)  ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. 


ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారతీయ పారిశ్రామిక సంస్థలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మాదిరిగానే గ్లోబల్ స్పేస్ సెక్టర్‌లో కూడా  లీడర్స్‌గా ఆవిర్భవించగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో స్పేస్ సెక్టర్‌లోకి ప్రవేశించేందుకు ప్రైవేటు సంస్థలకు అవకాశం ఉండేది కాదని, తలుపులు మూసేశారని చెప్పారు. ప్రైవేటు సంస్థలు కేవలం అమ్మకందారులుగా మాత్రమే ఉండేవన్నారు. కానీ తన ప్రభుత్వం మాత్రం సంస్కరణలను అమలు చేస్తూ ఈ రంగంలోకి వచ్చేందుకు ప్రైవేటు రంగానికి అవకాశం కల్పిస్తోందని చెప్పారు. 


గొప్ప ఆలోచనలు మాత్రమే గొప్ప విజేతలను తీర్చిదిద్దుతాయన్నారు. స్పేస్ సెక్టర్‌లో సంస్కరణలను తీసుకొచ్చి, అన్ని ఆంక్షలను తాము తొలగించామని చెప్పారు. ప్రైవేటు పరిశ్రమలను IN-SPACe ప్రోత్సహిస్తుందని, రోదసీ రంగంలో విజేతలుగా తీర్చిదిద్దే ప్రక్రియను ప్రారంభిస్తుందని తెలిపారు. ఐటీ రంగంలో విజయం సాధించినట్లుగానే మన పరిశ్రమలు అంతర్జాతీయ రోదసీ రంగంలో కూడా విజయం సాధించగలవని తాను ఆశిస్తున్నానని చెప్పారు. స్పేస్ ఇండస్ట్రీలో విప్లవం సృష్టించే సత్తా IN-SPACeకు ఉందన్నారు. 


Updated Date - 2022-06-11T01:29:37+05:30 IST