పుదుచ్చేరి ఎన్నికలపై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-03-31T00:28:06+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో కాంగ్రెస్

పుదుచ్చేరి ఎన్నికలపై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

పుదుచ్చేరి : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో కాంగ్రెస్ పరిపాలనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ సిటింగ్ సీఎంకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడం ఈ ఎన్నికలను ‘ప్రత్యేకమైవి’గా మార్చిందన్నారు. మంగళవారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అధిష్ఠానానికి విధేయంగా ఉన్నారని మోదీ పేర్కొన్నారు. ఆ పార్టీ నేత ధరించే చెప్పులను కూడా నారాయణ స్వామి మోశారన్నారు. ఆ పార్టీ నేతను ఆకట్టుకునేందుకు తప్పుడు అనువాదాలు కూడా చేశారన్నారు. ఇన్ని చేసినప్పటికీ నారాయణ స్వామికి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వలేదన్నారు. దీనిని బట్టి ఆయన ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. 


అనేక సంవత్సరాల నుంచి విఫలమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాల చాంతాడంత జాబితాలో పుదుచ్చేరి ప్రభుత్వానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. పుదుచ్చేరి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు. విద్య, వైద్యం, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం వంటి ఏ రంగాన్ని పరిశీలించినా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తాయన్నారు. అవినీతి గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారన్నారు. అవినీతితో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్నట్లు చెప్పుకుంటున్నారన్నారు. 


30 స్థానాలున్న పుదుచ్చేరి శాసన సభ ఎన్నికలు ఏప్రిల్ 6న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే రెండున జరుగుతుంది.

Updated Date - 2021-03-31T00:28:06+05:30 IST