ఆర్థిక లబ్ధినిస్తున్న మోదీ దౌత్య నీతి

Published: Wed, 01 Jun 2022 07:18:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆర్థిక లబ్ధినిస్తున్న మోదీ దౌత్య నీతి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ ఎనిమిదేళ్ల కాలంలో భారత విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. నెహ్రూ తర్వాత, మోదీ హయాంలో మాత్రమే ప్రధానమంత్రి వ్యక్తిత్వం కేంద్రబిందువుగా భారతీయ విదేశీ విధానం అమలవుతోంది. అందుకే మోదీ, తాను అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 114 విదేశీ పర్యటనలు చేశారు.


కరుడుగట్టిన హిందూత్వ రాజకీయాలకు ప్రతీకగా ఉండి, గోధ్రా అల్లర్ల కారణాన అమెరికా వీసా నిరాకరణకు గురయిన నేత నరేంద్ర మోదీ. జాతీయ స్థాయి రాజకీయాలతో, అందునా దౌత్య విధానాల పట్ల ఆయన అవగాహనా శక్తిని పలువురు శంకించారు. 2014లో ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టినప్పుడు విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. ప్రత్యేకించి కీలకమైన గల్ఫ్ ముస్లిం దేశాలతో ఎటువంటి సంబంధాలు నెరపుతారనేది అంతటా ఉత్కంఠ రేపింది. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ స్వతంత్ర భారత చరిత్రలో గల్ఫ్ దేశాలతో బలమైన మైత్రికి బాట వేసిన ఘనతను మోదీ మాత్రమే దక్కించుకున్నారు.


గల్ఫ్ దేశాల రాచకుటుంబాలతో సత్సంబంధాల కొరకు మోదీ ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ పలు సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఇటీవల మరణించిన యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ అధ్యక్షుడు, అబుధాబి రాజు అయిన శేఖ్ ఖలీఫా అల్ నహ్యాన్ మృతి పట్ల భారతదేశంలో అధికారికంగా ఒకరోజు సంతాప సూచక దినాన్ని పాటించారు. అధికారిక మర్యాదల ప్రకారం ప్రధాని కంటే ముందు వరుసలో ఉండే ఉప రాష్ట్రపతిని సంతాపాన్ని తెలియజేయడానికి అబుధాబికి పంపించడం ఇందులో భాగంగా జరిగింది. సౌదీ, అబుధాబి యువరాజులతో కలిసిన ప్రతిసారి మోదీ వినమ్రంగా వ్యవహరించే తీరు చూడముచ్చటగా ఉంటుంది.


శరవేగంగా ఇంధన వినియోగం పెరుగుతున్న దేశాలలో భారత్ అగ్రస్థానంలో ఉన్నది. ఇంధన దిగుమతులకై భారత్ గణనీయంగా అరబ్బు దేశాలపై ఆధారపడింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వినియోగదారుడు, విక్రయదారుడి సంబంధంగా మాత్రమే కొనసాగిన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరస్పర ఆర్థిక ప్రయోజనాల దిశగా మార్చిన ఘనత మోదీదేననడంలో సందేహం లేదు. పెట్రోలియం అవసరాలకు తోడుగా సుమారు 80 లక్షల మంది ప్రవాస భారతీయులు గల్ఫ్ దేశాలలో పని చేస్తూ ప్రతి నెల తమ ఆదాయాన్ని విదేశీ మారక రూపంలో మాతృభూమికి పంపిస్తున్నారు. ఈ దృష్ట్యా గల్ఫ్ దేశాలతో స్నేహ సంబంధాలు భారత్‌కు కీలకం. గల్ఫ్ దేశాలు వేర్వేరుగా నిర్వహించే సార్వభౌమిక సంపద నిధి (సావరిన్ వెల్త్ ఫండ్ – ఎస్‌డబ్ల్యూఎఫ్) పెట్టుబడుల కొరకు అమెరికా, యూరోప్ దేశాలు నిరంతరం ప్రయత్నిస్తున్నప్పుడు తామెందుకు ప్రయత్నం చేయకూడదని మోదీ సర్కార్ ఆలోచించింది. ఆ దిశగా అనేక ముందడుగులు వేసి పురోగతి సాధిస్తోంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ దేశాల నుంచి భారీ పెట్టుబడులను సాధించడంతో పాటు అబుధాబిలో హిందూ ప్రార్థనా మందిర నిర్మాణానికి కూడ ప్రధాని మోదీ విశేషంగా తోడ్పడ్డారు.


యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్, భారత్‌ల మధ్య రేపటి నుంచి కార్యాచరణ రూపం దాల్చనున్న ‘సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం’ (సిఇపిఏ) ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో అత్యంత అరుదైన చరిత్రాత్మక ఘట్టం. అనేక భారతీయ ఉత్పత్తుల ఎగుమతులకు ఊతమిచ్చే ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మాములు విషయం కాదు. మధ్యప్రాచ్య అరబ్బు, ఆఫ్రికా, ఈశాన్య ఐరోపా దేశాల ఎగుమతులకు స్థావరమైన యుఏఇతో ఈ రకమైన సువిశాల ప్రయోజనాలు కల్గిన వాణిజ్య ఒప్పందాన్ని సాధించిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుంది. అసలు ఈ రకమైన ఒప్పందాన్ని ఏ ఇతర దేశంతో ఇప్పటి వరకు యుఏఇ చేసుకోలేదు. ఆ మాటకొస్తే భారత్ కూడా గత ఒక దశాబ్ద కాలంగా ప్రపంచంలోని ఏ దేశంతోనూ చేసుకోలేకపోయింది. ప్రధాని మోదీ అబుధాబి రాజు శేఖ్ మోహమ్మద్‌తో పెంపొందించుకున్న సాన్నిహిత్యంతో మాత్రమే ఇది సాధ్యమైంది. ప్రస్తుత 50 బిలియన్ డాలర్ల ఎగుమతులను రానున్న అయిదేళ్ల కాలంలో 100 బిలియన్ డాలర్లకు పెంచడం లక్ష్యంగా భారతదేశం ఈ ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’ను చేసుకున్నది. అమెరికా ప్రోత్సాహంతో యుఏఇ– ఇజ్రాయిల్ మధ్య మొదలయిన వాణిజ్య సంబంధాల నేపథ్యంలో భారతదేశ ఒప్పంద ప్రాధాన్యం ఎనలేనిది.

బంగారం అభరణాల నుంచి ఔషధాల వరకు అనేక ఉత్పత్తుల దిగుమతులపై సుంకాన్ని సడలించడం ఈ ఒప్పందం ప్రధానాంశం. నిజామాబాద్ పసుపు, కోస్తాంధ్ర మత్స్య ఉత్పత్తులు, తమిళనాడు లుంగీలు మొదలగు అనేక ఉత్పత్తుల ఎగుమతులు, మున్ముందు ఇంకా ఎన్నో వ్యాపార ఒప్పందాలకు మార్గం సుగమమయింది.


బంగ్లాదేశ్, వియత్నాం, పాకిస్థాన్‌లు దుబాయి మీదుగా తమ చౌక ఉత్పత్తులను భారత్‌కు సునాయసంగా ఎగుమతి చేయకుండా అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈశాన్య ఐరోపా, ఆఫ్రికాలలో నూతన అవకాశాలకు, మరీ ముఖ్యంగా అక్కడ చైనాతో పోటీపడడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. యుఏఇతో పాటు ఇతర గల్ఫ్ దేశాలతో కూడా ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాల’ను కుదుర్చుకోవడానికి మోదీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించాలి. మొత్తానికి ఎనిమిదేళ్ల కాలంలో విదేశాంగ విధానంలో మోదీ చేసిన కృషి ప్రశంసనీయం.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.