రానున్న మూడేళ్లలో కార్యాచరణపై మంత్రులతో మోదీ భేటీలు

ABN , First Publish Date - 2021-08-07T20:32:39+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నూతన మంత్రివర్గం

రానున్న మూడేళ్లలో కార్యాచరణపై మంత్రులతో మోదీ భేటీలు

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నూతన మంత్రివర్గం త్వరలో మూడు రోజులపాటు సమావేశం కాబోతోంది. రానున్న మూడేళ్ళలో అమలు చేయవలసిన కార్యాచరణపై చర్చించబోతోంది. ప్రజాగ్రహాన్ని ఎదుర్కొనడంపై ప్రధానంగా దృష్టి సారించబోతోంది. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రభుత్వ వైఫల్యం, పెరుగుతున్న ధరలు, నూతన సాగు చట్టాలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 


బీజేపీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, నరేంద్ర మోదీ మంగళవారం నుంచి మూడు రోజులపాటు మంత్రులతో సమావేశమవుతారు. పార్లమెంటు సమావేశాల అనంతరం సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందజేసే ప్రయోజనాలు  చిట్ట చివరి వ్యక్తికి సైతం చేరడంపై ప్రధానంగా దృష్టి పెడతారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత జూలై 8న తొలిసారి మంత్రులతో మోదీ సమావేశమైన సంగతి తెలిసిందే. 


వచ్చే ఏడాది ప్రారంభంలో ఏడు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయి. 2024లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించే విధంగా ప్రజలకు చేరువ కావడంపై చర్చిస్తారు. మరోవైపు కోవిడ్-19 మూడో ప్రభంజనం రాబోతున్నట్లు సంకేతాలు వస్తుండటంతో, దీనిపై కూడా చర్చించే అవకాశం ఉంది. 


రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం కేంద్ర మంత్రులకు తేనీటి విందు ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ఈ విందుకు మోదీ కూడా హాజరవుతారని సమాచారం.


Updated Date - 2021-08-07T20:32:39+05:30 IST