వర్షం నీటిని ఒడిసి పడదాం: మోదీ
న్యూఢిల్లీ: వేసవి సమీపిస్తున్న తరుణంలో నీటి సంరక్షణపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్వరలోనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 'క్యాచ్ ది రెయిన్' ప్రచారానికి శ్రీకారం చుట్టనుందని ప్రకటించారు. నెలవారీ రేడియా కార్యక్రంలో భాగంగా 74వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో జాతినుద్దేశించి ప్రధాని ఆదివారంనాడు మాట్లాడారు. నీటి సంరశ్రణ, ఆత్మనిర్భర్ భారత్ సహా పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. మాఘమాసంలోనే హరిద్వార్ కుంభమేళా జరుపుకుంటున్నామని, మార్చి 22న నీటి దినోత్సవాన్ని జరుపుకుంటామని గుర్తుచేశారు.
తమిళం నేర్చుకోలేకపోయా..
ఏదైనా చేయాలనుకున్నది మీరు చేయలేకపోయారా అని వ్యక్తి కొద్దిరోజుల క్రితం తనను అడిగాడని, దానికి తనను తాను ప్రశ్నించకున్నానని మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అతి పురాతమైన తమిళ భాష నేర్చుకునేందుకు తగిన ప్రయత్నం చేయలేకపోవడం తనను బాధించిన విషయమని అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్‌లో సైన్స్ పాత్ర కీలకం
'ఆత్మనిర్భర్ భారత్'లో సైన్స్ పాత్ర కీలకమని మోదీ అన్నారు. ఆదివారంనాడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సైన్స్ అభివృద్ధికి విఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్ చేసిన కృషి శ్లాఘనీయమని అన్నారు. భారతీయ శాస్త్రవేత్తలు చేసిన కృషిని, సాధించిన ఘనత, ఇండియన్ సైన్స్‌ను నేటి యువత అధ్యయనం చేయాలని కోరారు. సైన్స్‌ను 'ల్యాబ్ టు ల్యాండ్' అనే మంత్రంతో ముందుకు తీసుకు వెళ్లాలని అన్నారు. ఇందుకు లఢక్‌లోని రైతు ఉర్గోన్ వుత్సంగ్ ఒక ఉదాహరణ అని అన్నారు. ఆయన 20 వేర్వేరు పంటలను సేంద్రియ పద్దతిలో పండిస్తున్నారని తెలిపారు. పంట వ్యర్థాలను మరో పంటకు ఎరువుగా వాడటం కూడా ప్రశంసనీయమని అన్నారు.
ప్రమోద్‌జీ ఒక మంచి ఉదాహరణ
ఆత్మనిర్భర్ భారత్‌కు ఎందరో సహకరిస్తున్నారని, బీహార్‌లోని బెట్టియాకు చెందిన ప్రమోద్‌జీ ఇందుకు ఒక ఉదాహరణ అని మోదీ తెలిపారు. ఢిల్లీలో ఎల్‌ఈడీ బల్బుల పరిశ్రమలో పనిచేసిన ప్రమోద్ జీ అక్కడే ఆ తయారీ విధానం నేర్చుకుని తన సొంతూరులో ఎల్‌ఈడీ బల్బుల పరిశ్రమను స్థాపించారని తెలిపారు.
సిలునాయక్ సేవలు ప్రశంసనీయం
'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని ఒడిశాలోని అరఖుడకు చెందిన సిలు నాయక్ పేరు ప్రస్తావించారు. నాయక్ సార్‌గా పేరు తెచ్చుకున్న సిలు నాయక్ భద్రతా దళాల్లో చేరాలనుకునే యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. దేశానికి సేవ చేయాలనుకుంటున్న ఎందరికో ఆయన మార్గదర్శిగా నిలుస్తున్నారని ప్రధాని అభినందించారు.
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.