Central Vista Avenue : కర్తవ్య పథ్‌ను ప్రారంభించిన మోదీ... కార్మికులకు భారీ ఆఫర్...

ABN , First Publish Date - 2022-09-09T02:05:55+05:30 IST

సెంట్రల్ విస్టా (Central Vista) ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కర్తవ్య

Central Vista Avenue : కర్తవ్య పథ్‌ను ప్రారంభించిన మోదీ... కార్మికులకు భారీ ఆఫర్...

న్యూఢిల్లీ : సెంట్రల్ విస్టా (Central Vista) ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కర్తవ్య పథ్‌ (Kartavya Path)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాశ్ చంద్రబోస్ (Netaji Subhash Chandra Bose)  విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. 


న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్-ఇండియా గేట్ మధ్య ఉన్న మార్గాన్ని గతంలో రాజ్‌పథ్ అని పిలిచేవారు. దీనికి కర్తవ్య పథ్ అని ఢిల్లీ నగర పాలక సంస్థ నామకరణం చేసింది. దీనికి ఇరు వైపులా ఎనిమిది వంతెనలను నిర్మించారు. దీంతో పాదచారులు పచ్చిక బయళ్ళలో నడవవలసిన అవసరం ఉండదు. కాలి నడక మార్గాలు, వంతెనలపై నుంచి పాదచారులు నడవడానికి అవకాశం ఉంటుంది. 16 ప్రాంతీయ ఫుడ్ స్టాల్స్‌ను త్వరలో ఏర్పాటు చేస్తారు. 



ఇండియా గేట్ వద్ద 28 అడుగుల ఎత్తయిన నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి, పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు మోదీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పని చేసిన కార్మికులతో మాట్లాడారు. ‘‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పని చేసిన శ్రమజీవులందరినీ రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానిస్తాను’’ అని వారితో చెప్పారు. 


ఈ సందర్భంగా ఇండియా గేట్ వద్ద  ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మోదీ తిలకించారు. గడచిన తొమ్మిది దశాబ్దాల్లో సెంట్రల్ విస్టా ఎవెన్యూ అభివృద్ధి చెందిన తీరును ఈ ప్రదర్శనలో వివరించారు. 



సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం రూ.13,450 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీనిలో భాగంగానే కర్తవ్య పథ్‌ను అభివృద్ధి చేశారు.  సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో త్రికోణాకారంలో ఉండే పార్లమెంటు భవనం, సెంట్రల్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి నివాసం, కార్యాలయం, ఉప రాష్ట్రపతి నివాసం, కార్యాలయం నిర్మితమవుతున్నాయి. ఈ ప్రాజెక్టులో మొదట పూర్తయినది కర్తవ్య పథ్. ఇక్కడ ఆహ్లాదకరమైన పార్కులు, అద్భుతమైన లైటింగ్, మనసును దోచుకునే పచ్చదనం వంటి ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. 


ఘన వ్యర్థాల నిర్వహణ, తుపాను నీటి నిర్వహణ, వినియోగించిన నీటిని రీసైకిలింగ్ చేయడం, వర్షపు నీటిని పరిరక్షించడం, నీటి సంరక్షణ, ఇంధనం ఆదా వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. 


Updated Date - 2022-09-09T02:05:55+05:30 IST