లతా మంగేష్కర్‌కు నివాళులర్పించేందుకు ముంబైకి మోదీ

ABN , First Publish Date - 2022-02-06T18:41:34+05:30 IST

లతా మంగేష్కర్ పార్దివ దేహానికి నివాళులర్పించేందుకు ప్రధాన

లతా మంగేష్కర్‌కు నివాళులర్పించేందుకు ముంబైకి మోదీ

న్యూఢిల్లీ : ‘భారత రత్న’ లతా మంగేష్కర్ పార్దివ దేహానికి నివాళులర్పించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముంబైకి వెళ్తున్నారు. ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు ఆయన ముంబై చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ఆమె పార్దివ దేహానికి నివాళులర్పిస్తారు. ఆమె పార్దివ దేహాన్ని ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె నివాసం నుంచి శివాజీ పార్కుకు తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచి, అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. 


‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ రెండు రోజులపాటు జాతీయ సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జాతీయ పతాకాన్ని రెండు రోజులపాటు అవనతం చేస్తారు. 


మోదీ ఆదివారం ఇచ్చిన ట్వీట్లలో, దేశంలో ఎన్నటికీ భర్తీ కానటువంటి శూన్యాన్ని ఆమె వదిలి వెళ్ళారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాటల్లో వర్ణించలేనంత ఆవేదనకు గురయ్యానని తెలిపారు. ఇతరుల పట్ల దయ, సంరక్షణ భావాలుగల లత దీదీ మనల్ని వదిలి వెళ్ళిపోయారన్నారు. భారతీయ సాంస్కృతిక దిగ్గజంగా ఆమెను రానున్న తరాలు గుర్తు చేసుకుంటాయన్నారు. ఆమె అద్భుత గళం ప్రజలను సాటిలేని రీతిలో మంత్రముగ్ధులను చేసిందన్నారు. 


ఆమె పాటలు అనేక రకాల భావాలను పలికినట్లు తెలిపారు. భారతీయ సినీ ప్రపంచంలో మార్పులను ఆమె దశాబ్దాలపాటు సన్నిహితంగా చూశారన్నారు. సినిమాలతోపాటు భారత దేశ అభివృద్ధిపట్ల ఆమె నిరంతరం తపించేవారని తెలిపారు. ఆమె ఎల్లప్పుడూ బలమైన, అభివృద్ధి చెందిన భారత దేశాన్ని చూడాలనుకున్నారని చెప్పారు. 


‘‘లత దీదీ నుంచి నేను ఎల్లప్పుడూ అమితమైన ఆప్యాయతను పొందడం నాకు లభించిన గౌరవంగా భావిస్తాను. ఆమెతో నా సంభాషణలు మరపురానివి. లత దీదీ మరణం పట్ల నా తోటి భారతీయులతో కలిసి దుఃఖిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడాను. ప్రగాఢ సంతాపం తెలిపాను. ఓం శాంతి’’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-06T18:41:34+05:30 IST