క్వాడ్ సదస్సుకు ముందు మోదీ ద్వైపాక్షిక చర్చలు!

ABN , First Publish Date - 2021-09-16T19:47:51+05:30 IST

త్వరలో జరిగే క్వాడ్ సదస్సుకు ముందు ఆస్ట్రేలియా, అమెరికా,

క్వాడ్ సదస్సుకు ముందు మోదీ ద్వైపాక్షిక చర్చలు!

న్యూఢిల్లీ : త్వరలో జరిగే క్వాడ్ సదస్సుకు ముందు ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ దేశాల అధినేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. అమెరికా, భారత్ అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, జపాన్, ఆస్ట్రేలియా దేశాల అధినేతలతో సెప్టెంబరు 23న మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 


జపాన్ ప్రధాని యొషిహిడే సుగ, ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మారిసన్‌లతో మోదీ ఇండో-పసిఫిక్ ప్రాంతంపై చర్చిస్తారు. స్వేచ్ఛాయుత, సౌభాగ్యవంతమైన, నిబంధనల ఆధారిత ఇండో-పసిఫిక్ రీజియన్‌పై చర్చిస్తారు. క్వాడ్ భాగస్వాములతో భారత దేశం టూ ప్లస్ టూ డయలాగ్స్ నిర్వహిస్తుంది. మొదటి ఇండో-ఆస్ట్రేలియన్ డయలాగ్ సెప్టెంబరు 11న న్యూఢిల్లీలో జరుగుతుంది. 


సెప్టెంబరు 24న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలు జరుపుతారు. ఈ ద్వైపాక్షిక చర్చల తర్వాత క్వాడ్ దేశాల సదస్సు జరుగుతుంది. ఈ సమావేశాలన్నీ వైట్ హౌస్‌లో జరుగుతాయి. 


క్వాడ్ గ్రూపులోని భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కూడా భారత్ మాదిరిగానే పరస్పరం ద్వైపాక్షిక చర్చలు జరుపుతాయని తెలుస్తోంది. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశం కోసం ఈ నెల 20న అమెరికా బయల్దేరుతారు. అయితే క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగే అవకాశాలపై ఇప్పటి వరకు సమాచారం లేదు.


క్వాడ్ దేశాలతో రాజకీయ, ఆర్థిక, భద్రత, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. క్వాడ్ సదస్సులో తాలిబన్ పాలిత ఆఫ్ఘనిస్థాన్‌పై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. దోహా ప్రక్రియలో ఇచ్చిన హామీలను తాలిబన్లు తుంగలో తొక్కడం, సున్నీ పష్తూన్ మద్దతుదారులకే ప్రభుత్వంలో చోటు కల్పించడం, మైనారిటీలు, మహిళలను ప్రభుత్వంలో చేర్చకోకపోవడం వంటి అంశాలపై చర్చ జరుగుతుందని సమాచారం.


Updated Date - 2021-09-16T19:47:51+05:30 IST