నేపాల్‌ Maya Devi ఆలయంలో Modi ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-05-16T21:12:54+05:30 IST

బుద్ధ పౌర్ణమి పర్వదినం సందర్భంగా నేపాల్‌లోని చారిత్రక మాయాదేవి ఆలయంలో..

నేపాల్‌ Maya Devi ఆలయంలో Modi ప్రత్యేక పూజలు

ఖాట్మండు: బుద్ధ పౌర్ణమి పర్వదినం సందర్భంగా నేపాల్ (Nepal) లోని చారిత్రక మాయాదేవి (Maya Devi) ఆలయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన భార్య డాక్టర్ అర్జు రాణా దేవుబా పాల్గొన్నారు. ఆలయం పక్కనే ఉన్న అశోక స్తంభం వద్ద ఇరువురు ప్రధానులు దీపాలు వెలిగించారు. అనంతరం బోధి వృక్షానికి నీళ్లు పోశారు. బౌద్ధ సంస్కృతి, వార‌సత్వ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. అనంతరం టెంపుల్ కాంప్లెక్స్‌లోని విజిటర్స్ బుక్‌లో మోదీ సంతకం చేశారు.


దీనికి ముందు, నేపాల్‌లో నాలుగు రోజుల పర్యటన కోసం ఖాట్మండు చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. గౌతమబుద్ధుని జన్మస్థలమైన లుంబినిలోని ప్రఖ్యాత మాయాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మోదీ నేపాల్ పర్యటన ప్రారంభమైనట్టు పీఎంఓ కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలిపింది. నేపాల్‌లో అడుగుపెట్టగానే మోదీ ఓ ట్వీట్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. బుద్ధ పౌర్ణమి పర్వదినాన నేపాల్ ప్రజలతో కలిసి ఉండటం చాలా సంతోషంగా ఉందని, లుంబినిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నానని తెలిపారు.

Updated Date - 2022-05-16T21:12:54+05:30 IST