
న్యూఢిల్లీ : భారత దేశంలోని ముస్లిం మహిళల హక్కులను, వారి అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ముస్లిం మహిళలు అణచివేతకు గురికాకుండా చూడటానికి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అవసరమని చెప్పారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో, కోవిడ్ మహమ్మారి ఆంక్షల నేపథ్యంలో, తొలిసారి ఆయన ప్రత్యక్షంగా బహిరంగ సభలో గురువారం పాల్గొన్నారు. కర్ణాటకతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో విద్యార్థినులు పాఠశాల తరగతి గదుల్లో హిజాబ్ ధరించడంపై వివాదం జరుగుతున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ప్రభుత్వం ముస్లిం మహిళలను ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి చేసిందన్నారు. ముస్లిం మహిళలు తన ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతివ్వడం ప్రారంభించడంతో ప్రత్యర్థులు ఆందోళనకు గురయ్యారన్నారు. అయినప్పటికీ తాము ప్రతి ముస్లిం మహిళకు అండగా ఉంటామని చెప్పారు.
కర్ణాటకలోని ఓ పాఠశాలలో తరగతి గదిలోకి హిజాబ్ ధరించి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆరుగురిని అనుమతించలేదు. దీంతో జనవరి నుంచి ఆ రాష్ట్రంలో వివాదం జరుగుతోంది. తాజాగా హైకోర్టు విస్తృత ధర్మాసనం ఈ వివాదంపై విచారణ జరుపుతోంది. మతపరమైన అంశాలపై పట్టుపట్టవద్దని, తరగతులకు యూనిఫాం ధరించి హాజరుకావాలని విద్యార్థినులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారం జరుగుతుందని తెలిపింది.
సహరాన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు తమ కుటుంబాల గురించి మాత్రమే ఆలోచిస్తాయని, అంతకుమించి అవి చూడలేవని అన్నారు. ఆ పార్టీలు ప్రజలను పట్టించుకోవన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆ పార్టీలు అధికారంలో ఉండి ఉంటే, దారిలోనే వ్యాక్సిన్లను అమ్మేసుకునేవారని, ప్రజలకు వాటిని చేరనిచ్చేవారు కాదని అన్నారు. వ్యాక్సిన్లు ప్రజల వద్దకు చేరి ఉండేవి కాదన్నారు. ఎవరైనా గొప్ప గొప్ప వాగ్దానాలు చేశారంటే, అవి శుష్క వాగ్దానాలేనని, బాద్యతా రహితంగా చెప్పే మాటలేనని తెలిపారు. గత పాలకులు విద్యుత్తును అందుబాటులోకి తెస్తామన్నారని, ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయారని, ఉత్తర ప్రదేశ్‌ను చీకట్లో ఉంచారని అన్నారు.
ఇవి కూడా చదవండి