వ్యర్థాలు నూటికి నూరు శాతం ప్రాసెసింగ్ జరగాలి : మోదీ

ABN , First Publish Date - 2021-10-01T19:24:23+05:30 IST

మన దేశంలో రోజువారీ వ్యర్థాల్లో 70 శాతం వరకు ప్రాసెసింగ్

వ్యర్థాలు నూటికి నూరు శాతం ప్రాసెసింగ్ జరగాలి : మోదీ

న్యూఢిల్లీ : మన దేశంలో రోజువారీ వ్యర్థాల్లో 70 శాతం వరకు ప్రాసెసింగ్ జరుగుతోందని, దీనిని నూటికి నూరు శాతానికి పెంచవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నగరాల్లోని చెత్త కొండలను ప్రాసెస్ చేసి, పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) 2.0లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. 


దేశంలోని అన్ని నగరాలకు చెత్త నుంచి విముక్తి కల్పించడం, నీటి భద్రత కల్పించడం లక్ష్యాలుగా స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) 2.0లను రూపొందించారు. ఈ కార్యక్రమాలను ప్రధాని మోదీ శుక్రవారం న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 లక్ష్యం నగరాలను చెత్త రహితం చేయడమేనని చెప్పారు. ఈ రెండో దశలో మురుగు నీటి పారుదల, భద్రతా నిర్వహణలను సాధించాలనుకుంటున్నట్లు తెలిపారు. నగరాల్లో నీటి భద్రత కల్పించడం, మురికి నల్లాలు నదుల్లో కలవకుండా చర్యలు తీసుకోవడం ఈ పథకాల లక్ష్యాలని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలు సాకారం కావడానికి ఇది చాలా ముఖ్యమైన ముందడుగు అని తెలిపారు. నేటి కార్యక్రమాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటర్లో నిర్వహించడం చాలా గొప్ప విషయమని, సమానత్వం కోసం పట్టణాలు అభివృద్ధి చెందడం చాలా ముఖ్యమని ఆయన నమ్మేవారని చెప్పారు. 


మన దేశంలో రోజుకు సుమారు 1 లక్ష టన్నుల వ్యర్థాల ప్రాసెసింగ్ జరుగుతోందన్నారు. ఈ పథకాల ప్రారంభ సమయంలో ఇది 20 శాతమేనని చెప్పారు. నేడు రోజువారీ వ్యర్థాల్లో సుమారు 70 శాతం వరకు ప్రాసెసింగ్ జరుగుతోందన్నారు. దీనిని నూటికి నూరు శాతానికి పెంచడం అవసరమని తెలిపారు. 


స్వచ్ఛతా పథకాల రెండో దశలో నగరాల్లోని చెత్త కొండలను ప్రాసెస్ చేసి, పూర్తిగా తొలగిస్తామన్నారు. అలాంటి ఓ చెత్త కొండ ఢిల్లీలో చాలా కాలం నుంచి ఉందని, తొలగింపు కోసం ఎదురు చూస్తోందని అన్నారు. 


ఈ కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్‌దీప్ సింగ్ పురి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పట్టణాభివృద్ధి శాఖల మంత్రులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-01T19:24:23+05:30 IST