దేశం పట్ల బాధ్యతల నిర్వహణలో NCC శిక్షణ ఉపయోగపడుతోంది : మోదీ

ABN , First Publish Date - 2022-01-28T20:35:26+05:30 IST

దేశం పట్ల తన బాధ్యతలను నిర్వర్తించేందుకు అమితమైన

దేశం పట్ల బాధ్యతల నిర్వహణలో NCC శిక్షణ ఉపయోగపడుతోంది : మోదీ

న్యూఢిల్లీ : దేశం పట్ల తన బాధ్యతలను నిర్వర్తించేందుకు అమితమైన బలం తనకు NCCలో పొందిన శిక్షణ వల్ల లభిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో జరిగిన NCC ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. NCC గణతంత్ర దినోత్సవాల శిబిరం ముగింపు సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 28న ఈ ర్యాలీ జరుగుతుంది. 


మోదీ మాట్లాడుతూ, ‘‘మీలాగే నేను కూడా ఒకప్పుడు చురుకైన NCC కేడెట్‌నని చెప్పడం గర్వంగా ఉంది. NCCలో నేను పొందిన శిక్షణ, నేర్చుకున్న విషయాలు, దేశం పట్ల నా బాధ్యతలను నిర్వర్తించడంలో నేడు నేను అద్భుతమైన శక్తిని పొందుతున్నాను’’ అన్నారు. స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా అమృత మహోత్సవాలను దేశం జరుపుకుంటోందన్నారు. అటువంటి సమయంలో జరుగుతున్న ఈ సంబరాలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. కరియప్ప మైదానంలో తాను అటువంటి ఉత్తేజాన్ని చూస్తున్నానని తెలిపారు. 


సిక్కు కేడెట్ తలపాగాతో మోదీ...

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ NCC (నేషనల్ కేడెట్ కాప్స్) ర్యాలీలో సిక్కు కేడెట్ తలపాగాను ధరించారు. ఎర్రని ఈకలతో అలంకరించిన రైఫిల్-గ్రీన్ తలపాగాను ధరించారు. కేడెట్ల కవాతును సమీక్షించి, గార్డ్ ఆఫ్ ఆనర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తమ కేడెట్లకు పతకాలు, బ్యాటన్లను బహూకరించారు. 


ఆ రెండు రాష్ట్రాల సంప్రదాయాలతో...

స్వాతంత్ర్య దినోత్సవాలు, గణతంత్ర దినోత్సవాల్లో ప్రధాని మోదీ ధరించే తలపాగాలు గొప్పగా ప్రచారమవుతున్నాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల్లో ఉత్తరాఖండ్ సంప్రదాయ తలపాగాను ధరించారు. ఆ రాష్ట్ర పుష్పం బ్రహ్మకమలం చిత్రంతో కూడిన ఈ తలపాగా ఆకర్షణీయంగా కనిపించింది. అదేవిధంగా మణిపూర్‌లో ప్రసిద్ధమైన అంగ వస్త్రాన్ని కూడా ధరించారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ శాసన సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 




Updated Date - 2022-01-28T20:35:26+05:30 IST