సంకుచిత భావాల నుంచి దేశాన్ని బయటికి తెస్తున్నాం : మోదీ

ABN , First Publish Date - 2022-01-21T20:41:32+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కాంగ్రెస్‌పై పరోక్షంగా

సంకుచిత భావాల నుంచి దేశాన్ని బయటికి తెస్తున్నాం : మోదీ

అహ్మదాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కాంగ్రెస్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్యానంతరం నూతన నిర్మాణాలు కేవలం ఢిల్లీలోని కొన్ని కుటుంబాల కోసం మాత్రమే జరిగాయని, తన ప్రభుత్వం ఈ సంకుచిత ఆలోచనా ధోరణి నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చిందని చెప్పారు. జాతీయ ప్రాధాన్యంగల నూతన నిర్మాణాలను తన ప్రభుత్వం చేపట్టిందన్నారు. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో సుప్రసిద్ధ సోమనాథ దేవాలయం వద్ద కొత్తగా నిర్మించిన సర్క్యూట్ హౌస్‌ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 


మన మతపరమైన, సాంస్కృతికపరమైన వారసత్వం గురించి మాట్లాడాలంటే గతంలో సందేహం ఉండేదన్నారు. మన పూర్వీకులు మనకు అనేక విషయాలను అందజేశారన్నారు. అయితే మన సుసంపన్నమైన మత, సాంస్కృతిక వారసత్వం గురించి మాట్లాడాలంటే సందేహం ఉండేదన్నారు. స్వాతంత్ర్యానంతరం కేవలం ఢిల్లీలోని కొన్ని కుటుంబాల కోసం మాత్రమే నూతన నిర్మాణాలు జరిగాయన్నారు. తాము ఈ సంకుచిత భావం నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చామన్నారు. జాతీయ ప్రాధాన్యంగల నూతన కట్టడాలను నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్నవాటికి మెరుగులు దిద్దుతున్నామని చెప్పారు. 


పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే పరిశుభ్రత, సదుపాయాలు, పర్యాటకుల సమయం పట్ల గౌరవభావం, ఆధునిక దృక్పథం ఉండాలన్నారు. మతపరమైన, వారసత్వ ప్రాధాన్యంగల ప్రదేశాలను అభివృద్ధి చేయడం వల్ల ఆ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్నారు. 


ఇదిలావుండగా, సోమనాథ్ దేవాలయం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా మోదీ వ్యవహరిస్తున్నారు. 


Updated Date - 2022-01-21T20:41:32+05:30 IST