
జలంధర్ : పంజాబ్‌లో ఎన్డీయే ప్రభుత్వం రాబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన సోమవారం శాసన సభ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, తాము సమాఖ్య వ్యవస్థను గౌరవిస్తున్నామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సమాఖ్య విధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేశారన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయేదే గెలుపు అని చెప్పారు. రుణాల నుంచి నవ పంజాబ్ విముక్తి అవుతుందన్నారు.
రైతులకు ప్రయోజనాలు
రైతుల కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. 23 లక్షల మంది పంజాబ్ రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి క్రింద లబ్ధి పొందుతున్నారని చెప్పారు. అర్హులైన రైతుల ఖాతాలకు సంవత్సరానికి రూ.6,000 చేరుతోందని చెప్పారు. ఎరువులు, పురుగు మందులను అంతర్జాతీయ మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరలకు అందజేస్తున్నామని తెలిపారు. సహజసిద్ధ, ప్రకృతి వ్యవసాయంపై కృషి చేస్తామని తెలిపారు. 1984లో సిక్కులపై జరిగిన దాడులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, కాంగ్రెస్ మాత్రం ఈ దాడుల్లో నిందితులకు ఉన్నత స్థాయి పదవులను ఇచ్చిందని చెప్పారు.
సైన్యంపై కాంగ్రెస్ ప్రశ్నలు
కాంగ్రెస్ మన సైన్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచార సభ ముగిసిన తర్వాత తాను త్రిపురమాలిని దేవి శక్తి పీఠాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేయాలనుకున్నానని, అయితే తాము ఏర్పాట్లు చేయలేమని పంజాబ్ పరిపాలనా యంత్రాంగం, పోలీసులు తనకు చెప్పారని, ఈ రాష్ట్రంలో భద్రత పరిస్థితులు ఇంత దయనీయంగా ఉన్నాయని చెప్పారు. కానీ తాను త్వరలోనే త్రిపురమాలిని దేవికి ప్రత్యేక పూజలు చేస్తానని తెలిపారు.
మాదక ద్రవ్యాలపై...
మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా పంజాబ్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. పంజాబీల ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. యువతకు సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నానని తెలిపారు. ‘‘మీ కలలను నిజం చేయడానికి నేనున్నాను’’ అని భరోసా ఇచ్చారు. రానున్న ఐదేళ్ళు నవ పంజాబ్‌కు ఓ ముందడుగు అని చెప్పారు. మనమంతా కలిసి నవ పంజాబ్‌ను నిర్మిద్దామని తెలిపారు.
బీజేపీతో కెప్టెన్ సింగ్
కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీతో కలిసి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు తమ సొంత పార్టీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పారు. అలాంటి పార్టీ పంజాబ్ కోసం పని చేస్తుందని భావించలేమని చెప్పారు. అలాంటి పార్టీ పంజాబ్ కోసం ఎలా పని చేస్తుందని ప్రశ్నించారు. పంజాబ్ అభివృద్ధికి కాంగ్రెస్ నేతలు ఎలా కృషి చేయగలరని అడిగారు.
పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.
ఇవి కూడా చదవండి